మంచు విష్ణు, మోహన్ బాబు కేసులో సుప్రీమ్ కోర్టు సంచలన తీర్పు!
సినీ నటుడు, విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది.
By: A.N.Kumar | 1 Aug 2025 12:15 PM ISTసినీ నటుడు, విద్యాసంస్థల వ్యవస్థాపకుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణుకు సుప్రీం కోర్టు నుంచి భారీ ఊరట లభించింది. 2019లో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై విద్యార్థులతో కలిసి చేసిన ధర్నా కారణంగా కేసు నమోదు చేసిన చంద్రగిరి పోలీసులకు కోర్టు చురకలు వేశాయి. "ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు, సెక్షన్లు ఎలా వర్తిస్తాయో చెప్పండి!" అంటూ పోలీసులను ప్రశ్నించింది. దీంతో ఈ కేసును సుప్రీం కోర్టు పూర్తిగా కొట్టివేసింది.
కేసు నేపథ్యం
2019 మార్చి 22న మోహన్ బాబు, మంచు విష్ణు విద్యానికేతన్ విశ్వవిద్యాలయానికి చెందిన విద్యార్థులతో కలిసి తిరుపతి-మదనపల్లి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయని, ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని పోలీసులు పేర్కొంటూ కేసు నమోదు చేశారు.
హైకోర్టు తీర్పు.. మళ్లీ ట్రైలల్ కోర్టుకే పంపండి
ఈ కేసును తొలగించాలంటూ మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, ఈ కేసులో నిజానిజాలు ముందుగా ట్రయల్ కోర్టులో నిర్ధారించాలి అంటూ హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో మోహన్ బాబు గత మార్చి 3న సుప్రీం కోర్టును ఆశ్రయించారు.
-సుప్రీం కోర్టు తుది తీర్పు
జూలై 22న ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు, నిన్న తుది తీర్పు వెలువరించింది. చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో నమోదైన FIRని కొట్టివేస్తూ, మోహన్ బాబుపై వేయబడిన సెక్షన్లు అనవసరమని తేల్చింది. శాంతియుతంగా జరిగిన ధర్నా విషయంలో ఎలాంటి నిర్ధిష్ట ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
రాజకీయ కోణం కూడా?
ఈ కేసు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్న సమయంలో నమోదవ్వడం, ప్రస్తుతం ఆయన ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రావడం వల్ల మళ్లీ కేసు ముందుకు నెళ్లించే ప్రయత్నం జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పుతో మోహన్ బాబుకు పూర్తిగా న్యాయం లభించినట్టు అయింది.
ఈ తీర్పుతో మంచు కుటుంబానికి కొంత ఊరట లభించినప్పటికీ, మోహన్ బాబు ఇంకా వివాదాల మధ్యే ఉండటం గమనార్హం. ప్రత్యేకించి మంచు మనోజ్ వివాదం ఇంకా నత్తనడకన సాగుతోంది. అయినా ఈ తీర్పుతో కనీసం ఒక ప్రధానమైన కేసు నుంచి విడుదల కావడం, మోహన్ బాబుకు నైతిక విజయంగా నిలిచింది.
