Begin typing your search above and press return to search.

పెళ్లికి ముందు రిలేషన్ పై మదురై హైకోర్టు వ్యాఖ్యలు.. తర్వాతేమైందంటే?

పెళ్లికి ముందు రిలేషన్ పై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

By:  Garuda Media   |   18 Nov 2025 12:00 PM IST
పెళ్లికి ముందు రిలేషన్ పై మదురై హైకోర్టు వ్యాఖ్యలు.. తర్వాతేమైందంటే?
X

పెళ్లికి ముందు రిలేషన్ పై మద్రాసు హైకోర్టు మదురై ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సమాజంలో జరుగుతున్న అంశాల్ని ప్రస్తావిస్తూ.. ఒక యువకుడిపై పెట్టిన కేసును కొట్టేస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. ఇంతకూ ఏం జరిగిందంటే.. తొమ్మిదేళ్లు తనతో లైంగికంగా సంబంధం ఉన్న తర్వాత పెళ్లికి నో చెప్పాడంటే ఒక యువకుడిపై యువతి చేసిన ఫిర్యాదుకు సంబంధించిన కేసును విచారించిన సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది.

‘‘పెళ్లికి ముందు శారీరక సంబంధం సర్వసాధారణమైపోయింది. సమాజంలో జరుగుతున్న అంశాలు కోర్టుకు తెలియకుండా లేవు. పిటిషనర్ తో సుదీర్ఘ కాలం లైంగిక సంబంధం కొనసాగినప్పటికీ.. కంప్లైంట్ చేసిన వారు వ్యతిరేకత తెలపకపోవటం చూస్తే వారిద్దరి సమ్మతితోనే అది జరిగినట్లు సూచిస్తోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేయటానికి ఎలాంటి ఆధారాలు లేవు’’ అని పేర్కొంటూ యువకుడిపై పెట్టిన కేసును కొట్టేస్తూ తీర్పును ఇచ్చింది.

తిరునెల్వేలికి చెందిన దేవా విజయ్ పై ఒక యువతి వళ్లియూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కాలేజీలో ఇద్దరం లవ్ చేసుకున్నామని.. తొమ్మిదేళ్లు విజయ్ తనతో ఫిజికల్ రిలేషన్ లో ఉండి.. తర్వాత పెళ్లికి నో చెప్పారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విజయ్ కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసును కొట్టేయాలంటూ విజయ్ మదురై ధర్మాసనంలో పిటిషన్ దాఖలు చేశారు.

విచారణలోని తమ ముందుకు వచ్చిన అంశాల్ని ప్రస్తావించిన మదురై ధర్మాసనం.. ‘‘శారీరకంగా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో సమస్యలు ఏర్పడితే క్రిమినల్ చట్టాన్ని ఉపయోగించటం సరికాదు. ఇద్దరి మధ్య సంబంధం ప్రేమ ఆధారంగా ఏర్పడిందా? వివాహం కోసం ఎదురు చూశారా? కేవలం పరస్పర ఆనందమా? అన్నది వారికి మాత్రమే తెలుసు. ఇలాంటి విషయాల్లో కోర్టు కచ్ఛితమైన నిర్ణయం తీసుకోవటం అసాధ్యం. ఇలా కేసులు వేయటం న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయటంతో సమానం. అందుకే కోర్టు ఈ కేసును రద్దు చేస్తోంది’’ అంటూ తమ తీర్పును ఇచ్చారు.