పొగడ్తలే కాదు.. విమర్శలనూ తట్టుకోవాలి నాయకా: హైకోర్టు సంచలన తీర్పు
ఎంతసేపూ మీకు పొగడ్తలే కావాలంటే.. ఎంతసేపూ మీకు పూల దండలే పడాలంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది.
By: Garuda Media | 4 Nov 2026 4:00 AM IST``ఎంతసేపూ మీకు పొగడ్తలే కావాలంటే.. ఎంతసేపూ మీకు పూల దండలే పడాలంటే కుదరదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రశ్నించే హక్కు, విమర్శించే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. ఈ రెండు కూడా ప్రజాస్వామ్యంలో భాగమే. ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కు ఉన్నట్టుగానే విమర్శించే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. ఈ విషయాన్ని నాయకులు అర్థం చేసుకోవాలి.`` - అని మద్రాస్ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. దేశంలో ప్రస్తుతం ముఖ్యమంత్రులను, ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించారని.. లేదా తిట్టిపోశారని పేర్కొంటూ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పు సంచలనంగా మారింది.
ఏం జరిగింది?
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై ప్రధాన ప్రతిపక్షం డీఎంకే నేత సుధ కొన్నాళ్ల కిందట విమర్శించారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి నిద్రపోతున్నారంటూ ఆమె విమర్శించారు. ఈ వ్యవహారం అధికార పక్షానికి మంట పుట్టించింది. పైగా.. ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రధాన మీడియాలో హైలెట్ అయ్యాయి. ఈ పరిణామాలపై సీరియస్ అయిన.. టీవీకే నేతలు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఎంకే నేత, స్థానిక కౌన్సిలర్ సుధపై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈక్రమంలో ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె.. ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్ విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు ఏకసభ్య న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యం అంటే.. పాలకులను ఎంతసేపూ పొగడడమే కాదని.. పూల దండలు కురిపించడమే కాదని అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలిగినప్పుడు.. వారికి ఆగ్రహం వచ్చినప్పుడు.. అదే ప్రజాస్వామ్యం వారికి విమర్శించే భావప్రకటనా స్వేచ్ఛ ఇచ్చిందని తెలిపారు. సుధ చేసిన వ్యాఖ్యల్లో వ్యక్తిగత విమర్శలు ఉన్నాయన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది. ఇవి వ్యక్తిగతం కావని.. ఆమె అనుచిత వ్యాఖ్యలు కూడా చేయలేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో సుధకు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ.. న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
విమర్శలపై.. గతంలోనూ..
ఇక, ప్రజాప్రతినిధులను విమర్శిస్తున్నారని.. కీలక పదవుల్లో ఉన్నవారిపై వ్యాఖ్యలు చేస్తున్నారని పలు సందర్భాల్లో అనేక రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. ఆయా సందర్భాల్లో కూడా కోర్టులు సమర్ధించాయి. అయితే.. వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులను రోడ్డున పడేయడం, వారిని కించపరిచేలా వ్యవహరించడం వంటివాటిని మాత్రమే అడ్డుకున్నాయి. ఇక, ప్రధాని మోడీపై విమర్శలు చేశారని గతంలో రాహుల్‌పై నమోదైన కేసును కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇటీవల కూడా.. అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యలను మహారాష్ట్రలోని నాసిక్ కోర్టు కూడా కొట్టివేయడం గమనార్హం.
