ఎన్నికల వేళ.. ఉచితాలపై కోర్టు 'పిడుగు'!
కేంద్రం మాత్రం ఉచితాలు సరికాదని తేల్చింది. కానీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం పలు రాష్ట్రాల్లో అదే బీజేపీ ఉచిత హామీలు ప్రకటించింది.
By: Garuda Media | 27 Nov 2025 3:00 PM ISTఎన్నికలు అనగానే.. పార్టీలు ఉచితాల జాబితాలను రెడీ చేసుకుంటున్నాయి. అసలు ఉచితాలకు తాము వ్యతిరేకమని గొంతు చించుకునే బీజేపీ కూడా.. ఇటీవల బీహార్ ఎన్నికల్లో విద్యార్థులకు సైకిళ్లు.. ఉద్యోగి నులకు విద్యుత్ వాహనాల హామీ ఇచ్చింది. ఇక, మహిళలకు ఏటా రూ.10 వేల హామీ కూడా.. ఈ పార్టీ ప్రకటించిందే. సో.. ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు ఒకప్పుడు అభివృద్ధి మంత్రం పఠించిన పార్టీలు.. తాజాగా తమ రూటును ఉచితాల వైపు మళ్లిస్తున్నాయి.
అయితే.. ఎప్పటికప్పుడు ఎన్నికల్లో `ఉచిత హామీ`లపై చర్చ సాగుతూనే ఉంది. ఇవి సరికాదని మేధావులు చెబుతూనే ఉన్నారు. ఏకంగా ఈ వ్యవహారం గతంలో సుప్రీంకోర్టుకు కూడా చేరింది. అయితే.. ఏదీ తేలలేదు. ప్రజలను ఆకర్షించే విషయంలో పార్టీల వ్యవహార శైలిని కోర్టు తప్పుబట్టినా.. దీనికి పరిష్కారం మాత్రం లభించలేదు. కేంద్రం మాత్రం ఉచితాలు సరికాదని తేల్చింది. కానీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో మాత్రం పలు రాష్ట్రాల్లో అదే బీజేపీ ఉచిత హామీలు ప్రకటించింది.
ఇదిలావుంటే.. మరో నాలుగు మాసాల్లో ఎన్నికలకు వెళ్లనున్న తమిళనాడులో ఇప్పుడు కోర్టు ఈ ఉచితాల పై పిడుగు వేసింది. వాస్తవానికి ఉచిత హామీలకు తమిళనాడు పరాకాష్ఠగా మారింది. అన్నీ ఫ్రీగా ఇచ్చేస్తామని గతంలో కరుణా నిధి, జయలలితలు ప్రకటించుకుని అధికారం కోసం పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ అదే సంస్కృతి కొనసాగుతోంది. అయితే.. తాజాగా మద్రాస్ హైకోర్టులో ప్రజాస్వామ్య వాదులు కొందరు పిటిషన్లు వేశారు. ఉచితాలకు బ్రేక్ వేయాలని.. మరికొన్నాళ్లలోనే ఎన్నికలు రానున్నాయని.. ప్రజాధనాన్ని, పన్నుల ద్వారా చెల్లిస్తున్న మొత్తానికి బాధ్యత వహించేలా ప్రభుత్వాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఈ పిటిషన్లపై తాజాగా బుధవారం విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. తీవ్ర వ్యాఖ్యలు చేసింది. రానున్న రోజుల్లో అన్నం కూడా వండి తినిపిస్తారేమోనని సెటైర్లు వేసింది. ఉచిత హామీలను అవినీతి వ్యవహారంగా పరిగణించాల్సిన అవసరం ఉందని... వీటి వలన ఓటర్లు ప్రభావితమవుతున్నారని అభిప్రాయపడింది. ఉచిత పథకాల వలన తమిళ ప్రజలు బద్ధకస్తులుగా మారిపోయారని.. అందుకే హోటళ్లు, సెలూన్‌లు, చివరకు పొలాల్లో పనిచేసేందుకు కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను రప్పించుకోవాల్సిన పరిస్థితి నెలకొందని మద్రాస్ హైకోర్టు కోర్టు తెలిపింది.
అంతేకాదు.. రాజకీయ పార్టీల వల్లే ఉత్పాదక శక్తి తగ్గిపోతోందని వ్యాఖ్యానించిన కోర్టు.. దీనికి సమాధానం చెప్పాలంటూ.. కేంద్రం సహా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఉద్యోగాలు, మౌలిక సదుపాయాల కల్పన, విద్యా వైద్యారంగ అభివృద్ధి, రవాణా, వ్యవసాయ రంగాలను పక్కనబెట్టి.. ఉచిత హామీలపైనే అభ్యర్థులు ఫోకస్ పెడుతున్నారన్న పిటిషనర్ల వాదనతో ఏకీభవిస్తున్నట్టు కోర్టు తెలిపింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
