ఏ దేశంలో పుట్టానో తెలీదు.. పాస్ పోర్టు ఇవ్వండి.. హైకోర్టును ఆశ్రయించాడు
కోర్టులో అతను దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ఆ వ్యక్తి తల్లిదండ్రుల పేర్లు రవీంద్రన్.. జయలది.
By: Garuda Media | 23 Sept 2025 12:00 PM ISTకొన్ని సందర్భాల్లో అనూహ్య పరిణామాలతో కూడిన కేసులు కోర్టుకు వస్తుంటాయి. తాజాగా మద్రాసు హైకోర్టుకు ఇదే తరహాలో వచ్చిన కేసును.. విచారణకు ఓకే చెప్పింది తమిళనాడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం. ఇంతకూ ఈ కేసు వివరాల్లోకి వెళితే.. భారత్ లోనే పుట్టి పెరిగిన వ్యక్తి.. పెద్దోడై.. పెళ్లై.. పాస్ పోర్టు అప్లై చేసుకున్న వేళ.. అతడికి పౌరసత్వం ఇవ్వటం కుదరదని రిపోర్టు ఇవ్వటమే కాదు.. ఏ దేశంలో పుట్టాడన్న విషయాన్ని తెలీదంటూ స్టాంప్ వేసిన వైనంతో కేసు నమోదైంది. చివరకు జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటి వేళలో 34 ఏళ్ల బహిసన్ మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టులో అతను దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొన్న అంశాల్ని చూస్తే.. ఆ వ్యక్తి తల్లిదండ్రుల పేర్లు రవీంద్రన్.. జయలది. వారిది శ్రీలంకలోని ట్రింకోమలై. 1991 శ్రీలంకలో జరుగుతున్న గొడవల నేపథ్యంలో కొందరు భారత్ కు వచ్చేశారు. అలా తమిళనాడుకు తరలి వచ్చిన వారిలో పలువురిని అప్పట్లో రామనాథపురం జిల్లా మండపంలో శ్రీలంక శరణార్థుల క్యాంపులో ఉంచారు.
అదే ఏడాది గర్భిణిగా ఉన్న జయలదిని పుదుకోట్టై క్యాంపునకు తరలించారు. అక్కడే బహిసన్ పుట్టాడు. 1992లో శరణార్థుల శిబిరాల్ని తొలగించటంతో శ్రీలంక తమిళులకు బదులుగా బయట బతికేందుకు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ పర్యవేక్షణలో ప్రత్యేక ధ్రువీకరణ ఇచ్చారు. ఇక.. బహిసన్ విషయానికి వస్తే అతడి స్కూలింగ్.. తర్వాత చదువులు వేర్వేరు ప్రాంతాల్లో పూర్తైంది. చివరకు చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో వెబ్ డెవలపర్ గా పని చేస్తున్నాడు. పెళ్లైన అనంతరం ఈ ఏడాది మార్చి 28న భార్యతో కలిసి పాస్ పోర్టుకు అప్లై చేసుకుంటే.. అందుకు రీజనల్ పాస్ పోర్టు ఆఫీసు ఓకే చెప్పింది.
అయితే.. పోలీసు వెరిఫికేషన్ రిపోర్టుతో అతడికి ఇబ్బందులు మొదలయ్యాయి. పౌరసత్వం చట్టం 1986 సవరణ ప్రకారం తల్లిదండ్రులు ఇద్దరు భారతీయులైతేనే ఇక్కడ పుట్టిన వారికి పౌరసత్వం వస్తుందని.. లేదంటే విదేశీయుల కిందనే లెక్క అవుతుందని పేర్కొన్నారు. 1991లో పుట్టిన తనకు భారత పౌరసత్వం ఇవ్వటం కుదరదని.. తనది ఏ దేశమో తెలీదని అధికారులు స్పష్టం చేస్తూ రిపోర్టు ఇచ్చినట్లుగా హైకోర్టుకు తెలిపారు.
అంతేకాదు.. అధికారులు తాజాగా అతడి మీద కేసు నమోదు చేయటంతో ఆగస్టు 21న పోలీసులు విచారణకు తీసుకున్న విషయాన్ని తెలియజేస్తూ.. తప్పుడు ధ్రువీకరణలతో పాస్ పోర్టు పొందినట్లుగా తన మీద అభియోగాలు మోపినట్లుగా తెలిపారు. తనను అరెస్టు చేసిన వేళ.. బెయిల్ కోసం అప్లై చేయగా ఎగ్మోర్ కోర్టు రిజెక్టు చేసినట్లుగా పేర్కొన్నారు.
అనంతరం జిల్లా కోర్టు నుంచి బెయిల్ తీసుకున్న తనను.. తిరుచ్చి శరణార్థుల క్యాంపునకు తరలించే ప్రయత్నాన్ని అడ్డుకుంటూ హైకోర్టును ఆశ్రయించాడు. క్యాంపులో ఉంచితే సహజీకణ దరఖాస్తు చేసుకోవటానికి అనర్హతకు గురవుతానని పేర్కొంటూ.. అధికారుల నిర్ణయాన్నిఆపాలని కోర్టును కోరారు. ఈ నేపథ్యంలో అక్టోబరు 8 వరకు ఈ కేసులో చర్యలు తీసుకోవద్దని పేర్కొంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అతడికి కాస్తంత ఊరట కలిగించేలా మారాయి. అయితే.. తదుపరి ఉత్తర్వుల ఆధారంగానే అతడి భవిష్యత్తు ఉంటుందని మాత్రం చెప్పక తప్పదు.
