Begin typing your search above and press return to search.

కరూర్ తొక్కిసలాట... విజయ్ పార్టీపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!

అవును... కరూర్ లో టీవీకే పార్టీ అధినేత విజయ్ జరిపిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   4 Oct 2025 4:07 PM IST
కరూర్ తొక్కిసలాట... విజయ్ పార్టీపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు!
X

గత వారం కరూర్‌ లో జరిగిన తొక్కిసలాట తమిళనాడు రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతి చెందగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఈ సమయంలో సినీ నటుడు విజయ్, తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఈ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేసింది.

అవును... కరూర్ లో టీవీకే పార్టీ అధినేత విజయ్ జరిపిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మద్రాస్ హైకోర్టు తీవ్రంగా మండిపడింది. ఇందులో భాగంగా.. 41 మంది ప్రాణాలను బలిగొన్న విషాదం తర్వాత ఎటువంటి పశ్చాత్తాపం చూపకుండా అక్కడి నుండి పారిపోయారని జస్టిస్ సెంథిల్‌ కుమార్ అన్నారు!

ఇదే సమయంలో హిట్ అండ్ రన్ కేసులో టీవీకే ప్రచార బస్సును సీజ్ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు. అదేవిధంగా... ర్యాలీలోని అన్ని సీసీటీవీ కెమెరాలను, ముఖ్యంగా విజయ్ బస్సు లోపల, వెలుపల ఉన్న వాటిని సీజ్ చేయాలని కూడా ఆయన పోలీసులను కోరారు. ఐజీపీ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ ను ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది.

ఈ సందర్భంగా నటుడిని చూడటానికి వచ్చిన వారిని ర్యాలీ నిర్వాహకులు వదిలేశారని.. చివరికి వారు ప్రాణాలు కోల్పోయారని.. పార్టీ వారిని రక్షించాల్సిందని న్యాయస్థనం పేర్కొంది. ఇదే సమయంలో ఈ ఘోర సంఘటన తర్వాత వారు ఎటువంటి పశ్చాత్తాపం, బాధ్యత లేదా విచారం వ్యక్తం చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది.

ఇదే సమయంలో... స్థానిక పోలీసుల దర్యాప్తుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు.. టీవీకే నాయకుల పట్ల రాష్ట్రం దయ చూపుతున్నట్లు కనిపిస్తోందని చెబుతూ.. విజయ్ పై ఎందుకు కేసు నమోదు చేయలేదని కూడా ప్రశ్నించింది! అదేవిధంగా... సెప్టెంబర్ 27న జరిగిన ఈ దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన రెండు పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.

ఆదవ్‌ అర్జునపై చర్యలు చేపట్టాలి!:

మరోవైపు.. టీవీకే నిర్వాహకుడు ఆదవ్‌ అర్జున తన 'ఎక్స్‌' ఖాతాలో.. విప్లవం సృష్టించాలని పోస్టు చేసిన వ్యవహారంపై చర్యలు చేపట్టాలని మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా... బాధ్యతారహిత పోస్టులపై పోలీసులు జాగ్రత్తగా దర్యాప్తు చేసి కేసు నమోదు చేయాలని పేర్కొంది.

ముందస్తు బెయిల్ నిరాకరణ!:

కరూర్‌ తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, ఉప కార్యదర్శి నిర్మల్‌ కుమార్, కరూర్‌ పశ్చిమ జిల్లా కార్యదర్శి మదియళగన్‌ తదితరులపై 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే మదియళగన్ ను అరెస్ట్‌ చేసి తిరుచ్చి సెంట్రల్‌ జైలుకి తరలించారు.

ఈ నేపథ్యంలో... బుస్సీ ఆనంద్, నిర్మల్‌ కుమార్‌ ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే ప్రత్యేక విచారణలో మధురై బెంచ్ వారి ఇద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చింది. కేసు దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున బెయిల్ మంజూరు చేయలేమని పేర్కొంది. వారిద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారని తెలుస్తోంది.