Begin typing your search above and press return to search.

కరూర్ తొక్కిసలాట ఘటన... సుప్రీంలో కీలక పరిణామం!

సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   10 Oct 2025 10:36 PM IST
కరూర్  తొక్కిసలాట ఘటన... సుప్రీంలో కీలక పరిణామం!
X

సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత కరూర్ లో నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 41 మంది మృతి చెందడంతో పాటు పదుల సంఖ్య గాయపడ్డారు. దీంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా ఒక్కసారిగా సంచలనంగా మారింది. మరోవైపు ఈ ఘటనపై హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ టీవీకే సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. అక్కడ తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది.

అవును... కరూర్ తొక్కిసలాట ఘటనపై సిట్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఆదేశాన్ని సవాల్ చేస్తూ టీవీకే పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంలో ఈ పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులతోనే సిట్ ఏర్పాటు చేయాలన్న హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం వ్యతిరేకించింది.

ఈ సమయంలో తొక్కిసలాటపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ టీవీకే, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఎన్వీ అంజరియాలతో కూడిన ధర్మాసనం తన తీర్పును రిజర్వ్ చేసింది. అంతకంటే ముందు మరణించిన బాధితురాలి తరపున కేంద్ర సంస్థతో దర్యాప్తు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్లకు ప్రతిస్పందనగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరింది.

ఇదే సమయంలో సెప్టెంబర్ 27న కరూర్‌ లో తొక్కిసలాటకు దారితీసిన రోడ్‌ షో ర్యాలీకి టీవీకేకి ఇచ్చిన అనుమతిపై సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అదేవిధంగా కరూర్ తొక్కిసలాట మృతుల పోస్ట్ మార్టం పరీక్షలు అర్ధరాత్రి నిర్వహించి నాలుగు గంటల్లో ఎలా పూర్తి చేశారని కూడా కోర్టు ప్రశ్నించింది.

ఈ సందర్భంగా వాదనలు వినిపించిన పిటిషనర్... ఏఐడీఎంకే కూడా ర్యాలీకి అనుమతి కోరగా... స్థలం ఇరుకుగా ఉందని, అందువల్ల అనుమతి ఇవ్వలేమని చెప్పిన పోలీసులు.. అదే స్థలంలో టీవీకే పార్టీకి మాత్రం అనుమతి ఇచ్చారని.. ఏఐడీఎంకే కోసం జనం రద్దీగా ఉంటే.. టీవీకే కోసం కూడా జనం రద్దీగా ఉంటారని.. ఇందులో మొత్తం తప్పు రాష్ట్ర పోలీసులదే అని తెలిపారు.

అదేవిధంగా పిటిషనర్ లేవనెత్తిన మరో అంశం ఏమిటంటే.. 27వ తేదీ రాత్రి 7:30 గంటలకు ఈ సంఘటన జరిగిందని.. అందరినీ రాత్రి 9-10 గంటలకు ఆసుపత్రికి తరలించారని.. ఈ సమయంలో ఓ వ్యక్తి భార్యను కోల్పోయి దుఃఖంలో ఉన్నాడని.. అయితే.. రాత్రి 10:30 గంటలకు 30 మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి, ఉదయం 4 గంటలకు దహన సంస్కారాలు పూర్తి చేశారని తెలిపారు.

దీనిపై ధర్మాసనం ప్రశ్నించగా స్పందించిన రాష్ట్ర న్యాయవాది, సీనియర్ అడ్వకేట్ పి. విల్సన్... కుటుంబాలు మృతదేహాలను డిమాండ్ చేయడం ప్రారంభించడంతో చాలా గొడవలు జరిగాయని.. ముఖ్యమంత్రి కరూర్‌ కు విమానంలో వెళ్లగా, ప్రజలు మృతదేహాల కోసం వేడుకున్నాని, అందువల్ల కలెక్టర్ అనుమతి ఇచ్చారని తెలిపారు.

ప్రజల డిమాండ్ మేరకే... సమీప జిల్లాల నుండి వైద్యులను పోస్టుమార్టం నిర్వహించడానికి పిలిపించారని అన్నారు. అదేవిధంగా... జనంలోకి పాదరక్షలు విసిరి తొక్కిసలాటకు కుట్ర పన్నారనే ఆరోపణను కూడా ఆయన తోసిపుచ్చారు. ఈ నేపథ్యంలోనే బెంచ్ ఆదేశాలను రిజర్వ్ చేసింది.