Begin typing your search above and press return to search.

ముస్లింల‌కు.. ష‌రియా చ‌ట్ట‌మే వ‌ర్తిస్తుంది: క‌ర్ణాట‌క హైకోర్టు కీల‌క తీర్పు

ముస్లిం ప‌ర్స‌న‌ల్ లాబోర్డు ఇచ్చే తీర్పుల‌పైనా.. ఆ బోర్డు చేసే ప్ర‌తిపాద‌న‌ల‌పైనా గ‌తంలో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది.

By:  Garuda Media   |   10 Aug 2026 9:59 PM IST
ముస్లింల‌కు.. ష‌రియా చ‌ట్ట‌మే వ‌ర్తిస్తుంది:  క‌ర్ణాట‌క హైకోర్టు కీల‌క తీర్పు
X

ముస్లిం ప‌ర్స‌న‌ల్ లాబోర్డు ఇచ్చే తీర్పుల‌పైనా.. ఆ బోర్డు చేసే ప్ర‌తిపాద‌న‌ల‌పైనా గ‌తంలో సుప్రీంకోర్టు కీల‌క తీర్పు ఇచ్చింది. ముఖ్యంగా ముస్లింల వివాహాల‌కు సంబంధించి ష‌రియా చ‌ట్టం కంటే కూడా.. భార‌తీయ చ‌ట్టాలు, ప్ర‌త్యేక వివాహ చ‌ట్టం వ‌ర్తిస్తుంద‌ని సుప్రీకోర్టు స్ప‌ష్టం చేసింది. అయితే.. దీనికి భిన్నంగా క‌ర్ణాట‌క హైకోర్టు తాజాగా సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. ముస్లింలు.. ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం వివాహం చేసుకుంటే.. ఆ చ‌ట్ట‌మే వ‌ర్తిస్తుంద‌ని స్ప‌ష్టం చేసింది. మ‌త సంప్ర‌దాయాల ప్ర‌కారం.. పెద్ద‌ల స‌మ‌క్షంలో జ‌రిగిన వివాహానికి.. మ‌త పెద్ద‌ల స‌మ‌క్షంలో చేసుకున్న ఒప్పందానికి క‌ట్టుబ‌డి ఉండాల‌ని పేర్కొంది.

అదేస‌మయంలో ప్ర‌త్యేక వివాహ చ‌ట్టం.. వారికి వ‌ర్తించ‌బోద‌ని స్ప‌ష్టం చేసింది. ఒక‌వేళ ఈ చ‌ట్టం కింద వివాహ రిజిస్ట్రేష‌న్ చేసు కున్నా.. వారికి కూడా ష‌రియా చ‌ట్ట‌మే వ‌ర్తిస్తుంద‌ని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ వ్య‌వ‌హారం.. ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌కు దారితీసింది. వాస్త‌వానికి ముస్లింలు నిఖా(పెళ్లి) చేసుకునే స‌మ‌యంలో ష‌రియా చ‌ట్టం ప్ర‌కారం చేసుకుంటున్నారు. కానీ, గ‌తంలో సుప్రీంకోర్టు ఈ చ‌ట్టం ప్ర‌కారం చేసుకున్నా.. భార‌తీయ వివాహ చ‌ట్టంలోని ప్ర‌త్యేక వివాహ నిబంధ‌న కింద న‌మోదు చేసుకోవాల‌ని.. అదే వర్తిస్తుంద‌ని.. విడాకులు, భ‌ర‌ణం స‌హా వివిధ స‌మ‌యాల్లో దీనినే అమ‌లు చేయాల‌ని ఆదేశించింది.

తాజాగా క‌ర్ణాట‌క హైకోర్టు పూర్తి భిన్న‌మైన తీర్పు ఇచ్చింది. న్యాయ‌మూర్తులు జస్టిస్ డీకే. సింగ్, జస్టిస్ టీఎమ్. నదాఫ్ తో కూడిన ధర్మాసనం ఈ మేర‌కు తీర్పు వెలువ‌రించింది. ఇక‌, విష‌యంలోకి వెళ్తే.. స‌జీద్ ప‌ర్వేజ్‌, ఫ‌ర్జ‌నా తాజ్‌లు వివాహం చేసుకుని.. ఇటీవ‌ల విడాకులకు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. తాము భార‌త స్పెష‌ల్ మ్యారేజీ యాక్ట్ కింద రిజిస్ట్రేష‌న్ చేసుకున్నామ‌ని పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ చ‌ట్టం ప్ర‌కారం త‌మ‌కు విడాకులు మంజూరు చేయాల‌నికోర్టును అభ్య‌ర్థించారు. అయితే.. ష‌రియా విధానంలో వివాహం జ‌రిగింది కాబ‌ట్టి.. మ‌త‌పెద్ద‌ల స‌మ‌క్షంలోనే విడాకుల అంశాన్ని తేల్చుకోవాల‌ని హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

కేవలం ఫారిన్ టూర్స్‌, విదేశీ వీసా కోసం.. మాత్ర‌మే భార‌త ప్ర‌త్యేక వివాహ చ‌ట్టం కింద చేసుకున్న రిజిస్ట్రేష‌న్ వ‌ర్తిస్తుంద‌ని ధ‌ర్మాసనం తేల్చేసింది. దీంతో నిఖా చేసుకున్న దంప‌తులు.. విడాకుల కోసం.. ష‌రియా చ‌ట్టాన్ని, మ‌త పెద్ద‌ల సూచ‌న‌ల‌ను పాటించాల‌ని ధ‌ర్మాసనం తెలిపింది. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద విడాకులు పొందాలంటే.. వివాహం కూడా అదే చట్టం ప్ర‌కారం జ‌రిగి ఉండాల‌ని కోర్టు వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం.