Begin typing your search above and press return to search.

చైల్డ్ పో*ర్నోగ్రఫీపై ఉక్కుపాదం.. ఒక్క వీడియో ఉన్నా కటకటాల వెనక్కే.. కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయి?

డిజిటల్ యుగంలో సమాచారం మన వేళ్ల చివరన ఉంది, కానీ ఆ సమాచారంలో ఏది చట్టబద్ధం.. ఏది నేరం అనే స్పృహ ఉండడం ముఖ్యం.

By:  Tupaki Political Desk   |   9 March 2026 3:38 PM IST
చైల్డ్ పో*ర్నోగ్రఫీపై ఉక్కుపాదం.. ఒక్క వీడియో ఉన్నా కటకటాల వెనక్కే.. కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయి?
X

డిజిటల్ యుగంలో సమాచారం మన వేళ్ల చివరన ఉంది, కానీ ఆ సమాచారంలో ఏది చట్టబద్ధం.. ఏది నేరం అనే స్పృహ ఉండడం ముఖ్యం. ముఖ్యంగా చిన్నపిల్లలకు సంబంధించిన అశ్లీల సమాచారం విషయంలో కర్ణాటక హైకోర్టు తాజాగా ఒక సంచలన తీర్పును వెలువరించింది. అశ్లీల వీడియోలు లేదా ఫొటోలను ఇతరులకు పంపకపోయినప్పటికీ, కేవలం మీ మొబైల్ స్టోరేజీలో అవి సేవ్ అయి ఉన్నా అది తీవ్రమైన నేరమేనని కోర్టు స్పష్టం చేసింది.

కేసు నేపథ్యం?

ఒక వ్యక్తి తన మొబైల్‌లో చిన్న పిల్లలకు సంబంధించిన అశ్లీల వీడియోలను సేవ్ చేసుకున్నాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా, అతను హైకోర్టును ఆశ్రయించాడు. ‘నేను ఆ వీడియోలను ఎవరికీ షేర్ చేయలేదు, కేవలం నా ఫోన్‌లో మాత్రమే ఉన్నాయి, కాబట్టి నాపై నమోదైన కేసులను కొట్టేయాలి’ అని అతను పిటిషన్ దాఖలు చేశాడు. అయితే, ఈ వాదనను కోర్టు పూర్తిగా తోసిపుచ్చింది. అలాంటి అశ్లీల కంటెంట్‌ను కలిగి ఉండడం కూడా శిక్షార్హమైన నేరమేనని న్యాయస్థానం హెచ్చరించింది.

చట్టం ఏం చెప్తోంది..

*ఇలాంటి వీడియోలను ఫోన్‌లో సేవ్ చేసుకోవడం వల్ల రెండు ప్రధాన చట్టాల కింద శిక్షలు పడే అవకాశం ఉందని కోర్టు గుర్తు చేసింది.

*ఐటీ చట్టం సెక్షన్ ప్రకారం.. పిల్లలకు సంబంధించిన అశ్లీల సమాచారాన్ని డిజిటల్ రూపంలో సృష్టించడం, చూడడం లేదంటే నిల్వ (సేవ్) చేయడం నేరమని ఈ సెక్షన్ చెబుతోంది.

*పోక్సో చట్టం చైల్డ్ పోర్నోగ్రఫీని కలిగి ఉండడం కూడా శిక్షార్హమని వివరిస్తోంది. అంటే, మీరు ఆ వీడియోలను కేవలం చూసి వదిలేసినా లేదా మీ ఫోన్ మెమరీలో స్టోర్ చేసుకున్నా, చట్టం మిమ్మల్ని వదిలిపెట్టదు.

సామాజిక బాధ్యత

చాలా మంది వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే ఇలాంటి అశ్లీల వీడియోలను సరదాగా చూసి డిలీట్ చేయకుండా ఫోన్‌లోనే ఉంచుకుంటారు. కొన్నిసార్లు 'ఆటో డౌన్లోడ్' ఆప్షన్ వల్ల మనకు తెలియకుండానే గ్యాలరీలోకి వచ్చి చేరుతుంటాయి. కానీ, పోలీసుల తనిఖీల్లో లేదా ఆన్‌లైన్ నిఘాలో ఇలాంటివి దొరికితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. చిన్నపిల్లల హక్కులను కాపాడటంలో చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయని మనం గ్రహించాలి.

కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు సమాజానికి ఒక గట్టి సందేశాన్ని పంపింది. పిల్లల భద్రత విషయంలో రాజీ లేదని, అశ్లీల కంటెంట్‌ను ప్రోత్సహించినా లేదా నిల్వ చేసినా కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పింది. అందుకే, మన ఫోన్లలో ఏముందో ఒకసారి చెక్ చేసుకోవడం, అనుమానాస్పద వీడియోలు ఉంటే వెంటనే తొలగించడం చాలా ఉత్తమం. చట్టంపై అవగాహన ఉండటమే మనల్ని మనం కాపాడుకునే మార్గం!