న్యాయ వ్యవస్థలో జస్టిస్ భూయాన్.. 'భూకంపం'!
భారత న్యాయవ్యవస్థపై విమర్శలు కొత్తకాదు. ఆ మాటకు వస్తే.. సిట్టింగ్ కోర్టులు కూడా సుప్రీంకోర్టు తీర్పులను తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి.
By: Garuda Media | 3 Aug 2026 3:49 PM ISTభారత న్యాయవ్యవస్థపై విమర్శలు కొత్తకాదు. ఆ మాటకు వస్తే.. సిట్టింగ్ కోర్టులు కూడా సుప్రీంకోర్టు తీర్పులను తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి. మదురై బెంచ్.. ఇటీవల సుప్రీంకోర్టు ఒకవిధంగా ఆదేశించి.. మేం ఒక తీర్పు ఇస్తే.. ఎలా అంటూ.. ప్రశ్నించింది. ఇక, సామాజిక వేత్తలు.. ఇతర తటస్థ వర్గాలు కూడా సుప్రీంకోర్టు తీర్పులను, న్యాయవ్యవస్థను ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి. అయితే.. ఇప్పటి వరకు సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులుగా ఉన్నవారు ఎవరూ కూడా ఈ వ్యవస్థను తప్పుబట్టిన సందర్భాలు లేవు. పైగా.. కేంద్రంపై విమర్శలు చేసిన వారే ఉన్నారు.
అయితే.. ప్రస్తుత సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ గత రెండు రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. న్యాయవ్యవస్థలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్ధం కావడం లేదని ఆయన చెప్పడం ఒకరకంగా న్యాయవ్యవస్థలో భూకంపాన్ని పుట్టించిందనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన కొలిజీయం వ్యవస్థ.. దీని తీరుతెన్నులు.. తీసుకునే నిర్ణయాలను ఆయన నిలదీశారు. ''కొలీజియం వ్యవస్థ పారదర్శకంగా ఉంటుందని భారత పౌరులు అనుకుంటారు. కానీ.. అక్కడ అలా లేదు. మేడి పండు మాదిరిగా ఉంది. దీనిని ఎవరు సరిచేయాలి. ఇంత దారుణ వ్యవస్థ న్యాయానికి న్యాయం ఎలా చేస్తుంది.'' అని ఆయన వ్యాఖ్యానించారు.
అక్కడితోకూడా ఆగలేదు. దేశవ్యాప్తంగా హైకోర్టులకు జరిగే న్యాయమూర్తుల నియామకాల్లో కొలీజియం.. `సీల్డ్‌కవర్` వ్యవహార శైలిని కూడా ఆయన తప్పుబట్టారు. సీల్డ్ కవర్‌లో ఏముందో ఎవరికీ తెలియదని చెప్పారు. దీనిని అంత గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ''ఒక న్యాయమూర్తి నియామకానికి సంబంధించిన వివరాలు సాధారణ ప్రజలు తెలుసుకోవాలి. కానీ, కొలీజియం అలా లేదే!. అంతా గోప్యత. అసలు కొలీజియంలో ఉన్న సభ్యులైనా .. ఈ విషయాలు తెలుసుకుంటున్నారా? అంటే అది కూడా లేదు. వారికి కూడా తెలియకుండానే అన్నీ చక్కదిద్దుతున్నారు. అలాంటప్పుడు న్యాయ వ్యవస్థలో పారదర్శకత ఎలా వస్తుంది.'' అని ఆయన మృదువైన మాటలతోనే కడిగేశారు.
మరీ ముఖ్యంగా సాధారణ ప్రజలను చీమలతో పోలుస్తూ.. కొన్నాళ్ల కిందట ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ తర్వాత.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం.. యువతను బొద్దింకలతోను.. పరాన్నజీవులతోనూ పోల్చారు. ఇవి రెండూ దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అలానే.. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో 500 నోట్ల కట్లలు.. గుట్టలుగా బయట పడ్డాయి. ఈ కేసు ఏమైందో తెలియదు.. వీటిని పరోక్షంగా ప్రస్తావించిన జస్టిస్ భూయాన్.. న్యాయవ్యవస్థలో ఉన్న ఈ మరకలు.. ప్రజాస్వామ్య దేశానికి మంచివా కాదా? అనే విషయాలపై చర్చ జరగడమే కాదని.. చర్యలు కూడా ముఖ్యమని వ్యాఖ్యానించడం గమనార్హం. మొత్తంగా భూయాన్ చేసిన వ్యాఖ్యలు.. దేశవ్యాప్తంగా న్యాయవ్యవస్థపై చర్చించేలా చేస్తున్నాయి.
