Begin typing your search above and press return to search.

సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి నియామకం.. ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?

జస్టిస్‌ సూర్యకాంత్‌ సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు.

By:  A.N.Kumar   |   24 Nov 2025 4:31 PM IST
సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తి నియామకం.. ఎవరు? బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
X

భారత అత్యున్నత న్యాయస్థానానికి నూతన నాయకత్వం లభించింది. జస్టిస్‌ సూర్యకాంత్‌ సుప్రీంకోర్టు 53వ ప్రధాన న్యాయమూర్తిగా సోమవారం ఉదయం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో అధికారికంగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించగా.. ఈ వేడుకకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్రమంత్రులు, గవర్నర్లు, పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

అంతర్జాతీయ న్యాయమూర్తుల హాజరు.. తొలిసారి చరిత్ర!

ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో మొదటిసారిగా అనేక దేశాల న్యాయమూర్తులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకావడం. భారత న్యాయవ్యవస్థ గ్లోబల్‌గా సాధిస్తున్న ప్రాధాన్యాన్ని ఇది ప్రతిబింబించింది.

ఎవరు జస్టిస్‌ సూర్యకాంత్?

హర్యానాలోని హిసార్‌ జిల్లా పెట్వార్‌ గ్రామానికి చెందిన జస్టిస్‌ సూర్యకాంత్‌ సాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారు. చదువులో, న్యాయవాద వృత్తిలో ప్రతిభ కనబరుస్తూ అంచెలంచెలుగా ఎదిగి నేడు దేశ అత్యున్నత న్యాయస్థానానికి అధిపతిగా ఎదిగారు. హర్యానా నుండి వచ్చిన తొలి సీజేఐగా ఆయన చరిత్రలో నిలిచిపోనున్నారు.

కెరీర్‌లో కీలక ఘట్టాలు

అతి పిన్న వయసులోనే హర్యానా అడ్వకేట్‌ జనరల్‌గా సేవలు అందించారు. పంజాబ్ & హర్యానా హైకోర్టుల్లో అనేక ప్రముఖ కేసులు విచారణ. 2019లో సుప్రీంకోర్టుకు పదోన్నతి పొందారు. 2024లో సుప్రీంకోర్టు లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.

చరిత్రాత్మక తీర్పుల్లో పాత్ర

జస్టిస్‌ సూర్యకాంత్‌ పలు కీలక రాజ్యాంగ, జాతీయ ప్రాధాన్యత గల కేసుల్లో విచారణ బెంచ్‌లో సభ్యులుగా ఉన్నారు. వాటిలో ఆర్టికల్‌ 370 రద్దుపై చారిత్రాత్మక తీర్పునిచ్చిన బెంచ్‌లో భాగస్వామ్యం... దేశద్రోహ చట్టం (సెక్షన్ 124-A) నిలిపివేత ప్రక్రియలో సభ్యత్వం... కోర్టు బార్ అసోసియేషన్లలో మూడు వంతుల సీట్లు మహిళలకు కేటాయించాలని ఆదేశం జారీ చేశారు. సైనికుల కోసం వన్ ర్యాంక్ వన్ పెన్షన్ పథకాన్ని రాజ్యాంగపరంగా చెల్లుబాటంటూ తీర్పు.

భవిష్యత్ లక్ష్యాలు.. పెండింగ్ కేసులే తొలి ప్రాధాన్యత

ప్రమాణస్వీకారం అనంతరం జస్టిస్‌ సూర్యకాంత్‌ మాట్లాడుతూ “కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించడం నా తొలి ప్రాధాన్యత. కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసే నూతన మెకానిజాన్ని ప్రవేశపెడతాం” అన్నారు. భారత న్యాయవ్యవస్థలో దీర్ఘకాలంగా ఉన్న కేసుల పెండెన్సీ సమస్యను తగ్గించాలనే సంకల్పం ఆయన వ్యాఖ్యల ద్వారా వెలుగుచూసింది.

2027 ఫిబ్రవరి వరకు పదవీ కాలం

జస్టిస్‌ సూర్యకాంత్‌ దాదాపు 15 నెలలపాటు అంటే 2027 ఫిబ్రవరి వరకు, దేశానికి ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించనున్నారు.

సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి దేశ అత్యున్నత న్యాయస్థానం నాయకత్వం వరకు చేరిన జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రయాణం ఎంతో ప్రేరణాత్మకం. న్యాయవ్యవస్థలో సమర్థత, వేగవంతమైన న్యాయం, సమాన అవకాశాలు అనే ఆయన ఆశయాలు భారత న్యాయవ్యవస్థను మరింత బలోపేతం చేయనున్నాయి.