Begin typing your search above and press return to search.

వైరల్ ఇష్యూ... 100 ఏళ్ల వృద్ధుడికి నాలుగు దశాబ్ధాల తర్వాత న్యాయం..!

భారతీయ న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు దశాబ్ధాలుగా పెండింగులోనే ఉన్నాయని.. మరికొన్ని కేసులో తీవ్రమైన జాప్యం జరుగుతుందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే!

By:  Raja Ch   |   5 Feb 2026 6:00 PM IST
వైరల్ ఇష్యూ... 100 ఏళ్ల వృద్ధుడికి నాలుగు దశాబ్ధాల తర్వాత న్యాయం..!
X

భారతీయ న్యాయస్థానాల్లో ఎన్నో కేసులు దశాబ్ధాలుగా పెండింగులోనే ఉన్నాయని.. మరికొన్ని కేసులో తీవ్రమైన జాప్యం జరుగుతుందనే చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే! ఈ క్రమంలో దాదాపు 40 సంవత్సరాల తర్వాత 100 ఏళ్ల వృద్ధుడికి న్యాయం జరిగిన తీర్పు తాజాగా వెలువడింది. ఈ తీర్పు న్యాయ వ్యవస్థలో జాప్యం గురించిన చర్చను తిరిగి తీవ్రంగా ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ జాప్యాలు నిందితులు, బాధితుల కుటుంబాలకు తీవ్ర పరిణామాలను కలిగిస్తాయని చెబుతున్నారు.

అవును... సుమారు 40 ఏళ్ల తర్వాత ఓ సంచలన కేసులో తాజాగా తీర్పు వెలువడింది. దశాబ్ధాల నిరీక్షణ తర్వాత 100 ఏళ్ల వృద్ధుడికి న్యాయం దక్కింది. ఈ మేరకు అతన్ని నిర్దోషిగా తేలుస్తూ అలహాబాద్ హైకోర్టు తాజాగా తీర్పునిచ్చింది. జస్టిస్ చంద్రదరి సింగ్, జస్టిస్ సంజీవ్ కుమార్ లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెల్లడించింది. ఈ కేసు 1982 ఆగస్టు 9న జరిగిన ఓ హత్యకు సంబంధించినది కాగా.. ఇందులోని మిగిలిన నిందితుడు ఇప్పటికే మరణించడం గమనార్హం.

వివరాళ్లోకి వెళ్తే... 1982లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఓ భూవివాదం చినికి చినికి గాలివానగా మారి ఒకరి హత్యకు దారితీసింది. ఈ కేసులో మైక్ అనే వ్యక్తి ప్రధాన నిందితుడు కాగా.. ధనీరామ్, సత్తిదిన్ లు హత్యకు ప్రేరేపించారని అభియోగాలు నమోదయ్యాయి. అయితే ఈ కేసును విచారించిన హమీర్ పుర్ సెషన్స్ కోర్టు 1984లో ధనీరామ్, సత్తిదిన్ లకు జీవితఖైదు విధించింది. దీంతో... ఈ తీర్పును సవాల్ చేస్తూ వీరిద్దరూ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.

అప్పీలు పెండింగులో ఉన్న సమయంలో వీరికి బెయిల్ మంజూరైంది. ఆ తర్వాత సుమారు నాలుగు దశాబ్ధాలుగా కేసు పెండింగ్ లోనే ఉంది. ఈ కాలంలో సత్తిదిన్ మరణించారు కూడా. దీంతో ధనీరామ్ మాత్రమే జీవించి ఉన్న ఏకైక అప్పీలుదారుగా మిగిలారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో తాజాగా విచారణ జరిగింది. ఈ సందర్భంగా అప్పీల్ పై నిర్ణయంలో అసాధారణ జాప్యం, ప్రాసిక్యూషన్ లోని లోపాలను ప్రస్థావించిన న్యాయస్థానం తాజాగా అతడిని నిర్దోషిగా తేలుస్తూ తీర్పు వెల్లడించింది.