న్యాయవాదుల వేషధారణలో నేరగాళ్లు.. సుప్రీం సంచలన వ్యాఖ్యలు..
న్యాయస్థానాలు న్యాయం అందించే పవిత్ర ప్రదేశాలు. కానీ, ఇటీవలి కాలంలో కోర్టు ప్రాంగణాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ఆ పవిత్రతను దెబ్బతీస్తున్నాయి.
By: Tupaki Political Desk | 11 Nov 2025 1:54 PM ISTన్యాయస్థానాలు న్యాయం అందించే పవిత్ర ప్రదేశాలు. కానీ, ఇటీవలి కాలంలో కోర్టు ప్రాంగణాల్లో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలు ఆ పవిత్రతను దెబ్బతీస్తున్నాయి. న్యాయవాదుల వేషంలో కోర్టుల వద్దకు వస్తున్న నేరగాళ్లు పోలీసులు, కక్షిదారులపై దాడులు చేయడం దేశవ్యాప్తంగా ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితిని సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు సోమవారం (10.11.25) స్పష్టమైన హెచ్చరికలతో పాటు కఠిన వ్యాఖ్యలు చేసింది.
పంజాబ్, హరియాణా, ఢిల్లీ ఘటనలు వివరిస్తూ..
‘జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి’ ధర్మాసనం నేతృత్వంలోని బెంచ్ పంజాబ్, హరియాణా, ఢిల్లీల్లో జరిగిన ఘర్షణలను ప్రస్తావిస్తూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ‘కోర్టు ప్రాంగణం అనేది న్యాయపరమైన వాదనల స్థలం, కానీ ఇటీవల అది హింసాత్మక ఘర్షణల వేదికగా మారుతోంది. న్యాయవాదుల వస్త్రధారణలో నేరగాళ్లు ప్రవేశించి, పోలీసులపై, కక్షిదారులపై దాడులు చేస్తున్నారు. ఈ ప్రమాదాన్ని ముందుగానే గుర్తించడానికి యంత్రాంగం లేకపోవడం తీవ్రమైన లోపం’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
భద్రతా వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాలి..
కోర్టు స్పష్టంగా తెలిపింది దేశ వ్యాప్తంగా ట్రయల్ కోర్టుల వద్ద భద్రతా వ్యవస్థను పునర్ వ్యవస్థీకరించాల్సిన సమయం ఆసన్నమైందని. ప్రతి కోర్టు వద్ద భద్రతా సిబ్బంది, గుర్తింపు తనిఖీలతో కూడిన నియంత్రణ వ్యవస్థలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా, కోర్టు ప్రాంగణంలో ఎవరినైనా అరెస్ట్ చేయడం, అదుపులోకి తీసుకోవడం వంటి చర్యలను సంబంధిత జడ్జి అనుమతి లేకుండా చేపట్టరాదని పునరుద్ఘాటించింది.
ఈ వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఇదే..
ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడడం. ఇటీవల పలు రాష్ట్రాల్లో న్యాయవాదుల వేషధారణలో వచ్చిన గ్యాంగ్ సభ్యులు, లాయర్ల మధ్య జరిగిన ఘర్షణలు న్యాయస్థానాల భద్రతా వ్యవస్థల బలహీనతను బయటపెట్టాయి. న్యాయమూర్తులు, న్యాయవాదులు, పోలీసులు ఒకే ప్రాంగణంలో పనిచేసే చోట అల్లర్లు, హింస చోటు చేసుకోవడం ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీస్తోంది.
చేతులు కట్టేసిన కేరళ కోర్టు..
ఇక మరోవైపు, కేరళ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. కోర్టు ప్రాంగణంలో పోలీసులు ఎవరిపైన అయినా చర్యలు తీసుకోవాలంటే సంబంధిత జడ్జి అనుమతిని తప్పనిసరిగా పొందాలని పేర్కొన్న ఆదేశాలను రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. వారి వాదన ఏంటంటే అలాంటి గంపగుత్త నియమాలు కొన్నిసార్లు పోలీస్ విధులను అడ్డుకుంటాయని. ఈ వాదనపై సుప్రీంకోర్టు స్పందించింది. ఇది కేవలం కేరళ సమస్య కాదు.. దేశ వ్యాప్తంగా ఉన్న న్యాయ భద్రతా వ్యవస్థకు సంబంధించిన ప్రశ్న అని పేర్కొంది.
సుప్రీంకోర్టు ఇప్పుడు స్పష్టంగా చెప్పింది. ఈ విషయంలో ‘దేశవ్యాప్త మార్గదర్శకాలు అవసరం’ అని పేర్కొంది. న్యాయస్థానాలు భయపడే ప్రదేశాలు కాకూడదు. భరోసా కలిగించే ప్రదేశాలుగా ఉండాలి. కోర్టు గోడల మధ్య భయం కాకుండా న్యాయం వినిపించాలనే దృష్టితో ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కాపాడడమే కాదు.. న్యాయ వృత్తి గౌరవాన్ని నిలబెట్టడానికి సంబంధించినవి. ఎందుకంటే న్యాయవాది వేషం అంటే అది నమ్మకానికి చిహ్నం. కానీ అదే వేషం నేరానికి ఆయుధంగా మారితే, న్యాయ వ్యవస్థ మీదున్న విశ్వాసం కూలిపోతుంది.
అందుకే సుప్రీంకోర్టు సూచించిన మార్గదర్శకాలు కేవలం భద్రతా చర్యలు కాదు. అవి ప్రజా విశ్వాసాన్ని పునరుద్ధరించే మొదటి అడుగు. న్యాయస్థానం గోడల మధ్య సత్యం మాత్రమే ప్రతిధ్వనించాలి, హింస కాదు. ఇప్పుడు ఆ సత్యాన్ని రక్షించాల్సిన సమయం వచ్చింది.
