పవన్ విడాకులు.. అసలు చట్టం ఏం చెబుతోంది!
పవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా విడాకుల వార్తల నేపథ్యంలో మ్యూచువల్ కన్సెంట్ డివోర్స్‌పై చర్చ జరుగుతోంది. భారత చట్టాల ప్రకారం విడిపోవాలని ప్రకటన చేసినంత మాత్రాన విడాకులు పూర్తికావు. కోర్టులో పిటిషన్ దాఖలు చేసి, నిర్దేశిత ప్రక్రియ పూర్తి చేసిన తర్వాతే విడాకులు మంజూరవుతాయి. పిల్లల కస్టడీ, భరణం, ఆస్తుల అంశాలను కూడా కోర్టు పరిశీలిస్తుంది.
By: M Prashanth | 10 Nov 2026 6:21 PM ISTపవన్ కళ్యాణ్, అన్నా లెజ్నెవా 13 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు రిపోర్ట్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇద్దరూ పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. అయితే భార్యాభర్తలు ఇద్దరూ విడిపోవడానికి అంగీకరిస్తే వెంటనే విడాకులు వచ్చేస్తాయా, కోర్టులో ఎలాంటి ప్రక్రియ ఉంటుంది, పిల్లల బాధ్యతలు, భరణం వంటి విషయాలను ఎలా నిర్ణయిస్తారనేది అందరిలో కలుగుతున్న సందేహాలు.
ఇక భారత చట్టాల ప్రకారం భార్యాభర్తలు ఇద్దరూ అంగీకరించి విడాకులు తీసుకునే విధానాన్ని 'డివోర్స్ బై మ్యూచువల్ కన్సెంట్' అంటారు. ఇందుకోసం ఇద్దరూ కలిసి కోర్టులో పిటిషన్ దాఖలు చేయవచ్చు. అయితే కేవలం విడిపోతున్నట్లు ప్రకటన ఇచ్చినంత మాత్రాన చట్టపరంగా వివాహ బంధం ముగిసినట్లు కాదు. కోర్టు విడాకుల ఉత్తర్వులు ఇచ్చిన తర్వాతే ఆ ప్రక్రియ పూర్తవుతుంది.
స్పెషల్ మ్యారేజ్ యాక్ట్‌లోని సెక్షన్ 28 ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకులు కోరుకునే దంపతులు కనీసం ఏడాది పాటు విడిగా జీవించి ఉండాలి. ఒకే ఇంట్లో ఉన్నా భార్యాభర్తలుగా కలిసి జీవించకపోతే కొన్ని సందర్భాల్లో దానిని విడిగా ఉన్నట్లుగానే పరిగణిస్తారు. అయితే ఆ పరిస్థితులను కోర్టు పరిశీలిస్తుంది. నార్మల్ గా పిటిషన్ దాఖలు చేసిన ఆరు నెలల తర్వాత ఇద్దరూ మరోసారి తమ అంగీకారాన్ని కోర్టుకు తెలియజేయాలి. దీనిని సెకండ్ మోషన్ అంటారు.
దంపతులు తమ నిర్ణయాన్ని మరోసారి ఆలోచించుకోవడానికి ఈ గడువు ఉంటుంది. అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆరు నెలల గడువును మినహాయించే అవకాశం కూడా ఉంది. ఇద్దరి మధ్య సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదని కోర్టు భావిస్తే, వర్తించే చట్టం ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. ఇక భరణం, పిల్లల కస్టడీ, ఆస్తుల వ్యవహారాలను కూడా విడాకుల సమయంలో పరిష్కరించుకుంటారు.
భార్యాభర్తలు వీటిపై ముందుగానే అంగీకారానికి రావచ్చు. పిల్లల విషయంలో వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తారు. తల్లిదండ్రులు చేసుకున్న ఒప్పందాన్ని కూడా కోర్టు పరిశీలించవచ్చు. పవన్, అన్నా వేర్వేరు మతాలకు చెందినవారు కావడంతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రస్తావన వస్తోంది. అయితే వారి వివాహం ఏ చట్టం కింద నమోదైందనే దానిపైనే విడాకులకు వర్తించే నిబంధనలు ఆధారపడి ఉంటాయి. ఇక ఇద్దరూ పిల్లల బాధ్యతలను కలిసి చూసుకుంటామని ప్రకటనలో ఉంది. ఇక నెక్స్ట్ ఈ విషయంలో ఈ ఇద్దరి నుంచి మరో క్లారిటీ ఏమైనా వస్తుందేమో చూడాలి.
