పైరసీ కింగ్‌పిన్ ఐబొమ్మ రవికి మరో షాక్!
పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి తాజాగా మరో షాక్ తగిలింది. బెయిల్ పిటీషన్‌లని నాంపల్లి కోర్టు తిరస్కరించి షాక్‌కు గురి చేసింది.
By: Tupaki Entertainment Desk | 7 Jan 2026 1:16 PM ISTపైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమంది రవికి తాజాగా మరో షాక్ తగిలింది. బెయిల్ పిటీషన్‌లని నాంపల్లి కోర్టు తిరస్కరించి షాక్‌కు గురి చేసింది. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ ఇవ్వాలని రవి ఇటీవల కోర్టుని ఆశ్రయించాడు. అయితే కేసు దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అతడికి విదేశాల్లో పౌరసత్వం ఉందని, అతడికి బెయిల్ మంజూరు చేస్తే తను దేశం దాటిపోయే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఐబొమ్మ రవి బెయిల్ పిటీషన్‌కు కొట్టివేసింది.
ఇటీవల అనూహ్యంగా పోలీసులకు చిక్కిన ఐబొమ్మ రవి కేసలు కీలక మలుపులు తిరుగుతూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. విదేశాల నుంచి హైదరాబాద్ తిరిగొచ్చిన రవి కూకట్‌పల్లిలోని తన నివాసంలో ఉన్నట్టుగా సమాచారం అందడంతో అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. తన ఇంటికి వెళ్లారు. పోలీసుల సరాసరి ఇంటికే వచ్చేశారని తెలియడంతో డోర్ తెరవడానికి ఇమంది రవి పోలీసుల్ని కొంత సమయం వరకు ఇబ్బంది పెట్టి తరువాత డోర్ తెరవడం, పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడం, నాంపల్లి కోర్టులో హాజరు పరిచి చెంచల్ గూడ జైలుకు తరలించడం తెలిసిందే.
ఆ తరువాత రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీలోకి తీసుకోవడంతో రవి పొంతన లేని సమాధానాలు చెప్పడం.. పోలీసులు తలలు పట్టుకోవడం.. తెలిసిందే. ఆ తరువాత నుంచి పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకుని తమదైన పద్దతిలో ఇంటరాగేషన్ మొదలు పెట్టడంతో ఐబొమ్మ రవి కేసు రసవత్తర మలుపులు తిరుగుతూ తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందు ఈ వ్యవహారం వెనక ఎవరూ లేరని, తానొక్కడినే ఇదంతా చేశానని చెబుతూ వచ్చాడు. ఆ తరువాత చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ తెలియదు, గుర్తు లేదు అని తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు.
కరేబియన్‌దీవుల్లో శాశ్వతంగా ఉండిపోయేందుకు ప్లాన్ చేసుకున్న ఇమంది రవి ఈ కేసు నుంచి బయట పడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ అడ్డంగా బుక్కవుతున్నాడు. ఈజీగా తప్పించుకుని తిరగాలనే ప్లాన్‌లో భాగంగా నకిలీ గుర్తింపు కార్డ్‌లని పొందినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించడంతో రవి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. వెల్లెల ప్రహ్లాద్ కుమార్, అంజయ్య, కాళీ ప్రసాద్ పేర్లు, వివరాలు వాడి నకిలీ గుర్తింపు కార్డుల్ని తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ అమీర్‌పేట్ హాస్టల్‌లో రూమ్‌లో ఉన్న సమయంలో ప్రహ్లాద్‌తో కలిసి ఉన్నాడు. ఆ సమయంలోనే ప్రహ్లాద్ టెన్ట్ క్లాస్ మార్కుల మెమో, ఆధార్‌కార్డ్ కలర్ జిరాక్స్ తీసి వాటి ఆధారంగానే డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ తీసుకున్నాడట.
ఇక కరీంనగర్‌కు చెందిన అంజయ్య పేరుతోనూ రవి నకిలీ గుర్తింపు కార్డుల్ని తయారు చేసుకున్నాడని పోలీసులు గుర్తించడంతో కేసు మరో మలుపు తిరిగింది. రవి వెనక విదేశాల్లో పెద్ద బెట్టింగ్ ముఠానే ఉందని గ్రహించిన పోలీసులు దానికి సంబంధించిన వివరాల్ని రవి నుంచి రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీస్ కస్టడీ నుంచి బయటపడాలనే ఆలోచనతో ఐదు కేసుల్లో బెయిల్ కోసం ఐబొమ్మ రవి నాంపల్లి కోర్టుని ఆశ్రయించడం.. కోర్టు బెయిల్ నిరాకరిస్తూ షాక్ివ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
