Begin typing your search above and press return to search.

భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..

భరణం చెల్లించేందుకు ఆదాయం లేదని చెప్పిన భర్తకు ఒడిశా హైకోర్టు షాక్ ఇచ్చింది. గతంలో నెలకు రూ.30 వేల జీతం పొందిన ఆయన, 2024 మేలో ఉద్యోగం మానేశారు. అయితే నిరుద్యోగినని చెబుతూనే నెలకు రూ.10 వేల కారు ఈఎంఐ చెల్లిస్తుండటంపై కోర్టు ప్రశ్నించింది. భార్యకు రూ.15 లక్షలు కాకుండా రూ.10 లక్షల శాశ్వత భరణం చెల్లించాలని ఆదేశించింది.

By:  A.N.Kumar   |   7 Nov 2026 7:49 AM IST
భర్త మహాశయులారా? భార్యకు భరణం ఎగ్గొట్టే ప్లాన్ చేయకండి.. ఇలా బుక్కవుతారు..
X

భార్యకు భరణం ఇవ్వాల్సి వస్తే చాలు.. మన మగాళ్లలో చాలామంది సడన్‌గా పేదోళ్లుగా మారిపోతుంటారు. ఉద్యోగం ఊడిపోయిందని.. రోడ్డు మీద పడ్డామని.. కనీసం పూట గడవడానికి కూడా డబ్బులు లేవని కోర్టుల ముందు కన్నీటి పర్యంతం అవుతుంటారు. తాజాగా ఒరిస్సా హైకోర్టు తీర్పు అలాంటి తెలివితేటలు ప్రదర్శించే మహాశయులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. "ఉద్యోగం లేదు.. ఊళ్లో నాథుడు లేడు" అంటూనే మరోవైపు హాయిగా కారు ఈఎంఐలు కడుతున్న ఓ భర్త బండారాన్ని కోర్టు రకరకాల ప్రశ్నలతో బద్దలు కొట్టింది.

ఆ భర్తగారు గతంలో ఓ ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తూ నెలకు ముప్పై వేల జీతం అందుకునేవారు. సడన్‌గా ఆయనకు లాయర్ కావాలనే గొప్ప కోరిక పుట్టి 2024 మే నెలలో ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. ఇంకేముంది కోర్టులో కేసు రాగానే సీన్లోకి వచ్చి పెద్ద డైలాగ్ వదిలారు. "నాకు ఎలాంటి స్థిరమైన ఆదాయం లేదు.. ముసలి తల్లిదండ్రుల పెన్షన్‌ మీద బతుకుతున్నా.. మా ఆవిడ అడుగుతున్న పదిహేను లక్షల భరణం చెల్లించే స్థోమత నాకెక్కడిది?" అని అమాయకపు మొహం పెట్టారు.

కానీ న్యాయమూర్తులు అంత తేలిగ్గా మోసపోతారా? ఆయన ప్లాన్‌లోని డొల్లతనాన్ని ఇట్టే పట్టేశారు. ఉద్యోగం లేదని చెబుతున్న ఈ మహానుభావుడు నెలకు క్రమం తప్పకుండా పది వేల రూపాయల చొప్పున కారు ఈఎంఐలు ఎలా కడుతున్నారంటూ అసలు సిసలు ప్రశ్న సంధించారు. ఆదాయం లేనివాడు కారు ఈఎంఐలు కట్టడం ఏంటని నిలదీశారు. కోర్టును తప్పుదోవ పట్టించడానికి ఇలాంటి కబుర్లు చెబితే కుదరదని.. నిజాలు దాచితే కోర్టు తనదైన శైలిలో తీర్పునిచ్చి జైలుకు పంపుతుందని హెచ్చరించింది.

చివరకు భార్య కోరిన రూ.15 లక్షలలో కాస్త కోత పెట్టి రూ.10 లక్షలను శాశ్వత భరణంగా ఖరారు చేసింది. ఇప్పటికే డిపాజిట్ చేసిన ఐదు లక్షలు పోను.. మిగతా ఐదు లక్షలను మూడు నెలల్లోగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఉద్యోగం మానేశామని సాకులు చెప్పి.. విడాకులు తీసుకున్న భార్యకు ఇవ్వాల్సిన భరణం బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకునే వారికి ఈ తీర్పు కనువిప్పు కావాలి.

జీవితంలో చేసే ఖర్చులు.. లగ్జరీ జీవనశైలే మీ ఆర్థిక పరిస్థితిని అద్దం పడతాయని.. కోర్టు ముందు డ్రామాలు ఆడితే బండారం ఎప్పుడైనా బయటపడక తప్పదని ఈ కేసు మరోసారి రుజువు చేసింది.