Begin typing your search above and press return to search.

రియ‌ల్ ఎస్టేట్ లో భూకంపం.. బ్యాంకులు-బిల్డ‌ర్ల మిలాఖ‌త్‌: సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

బిల్డర్లు, బ్యాంకుల మధ్య అక్రమ ఒప్పందాలతో ఇబ్బందులు పడుతున్న గృహ కొనుగోలుదారుల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. నిర్మాణాలు పూర్తికాని ప్రాజెక్టుల విషయంలో కొనుగోలుదారులపై ఈఎంఐల కోసం ఒత్తిడి చేయవద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.

By:  Garuda Media   |   23 Nov 2026 8:07 AM IST
రియ‌ల్ ఎస్టేట్ లో భూకంపం.. బ్యాంకులు-బిల్డ‌ర్ల మిలాఖ‌త్‌:  సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఆదేశాలు
X

''దేశ‌వ్యాప్తంగా రియ‌ల్ ఎస్టేట్ రంగంలో భూకంపం వ‌చ్చిన‌ట్టుగా ఉంది. ఈ వ్య‌వ‌హారం చాలా సీరియ‌స్‌. దీనిని ఉపేక్షించేది లేదు. అస‌లు ఏం జ‌రుగుతోందో తేలుస్తాం.'' అంటూ.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డంతోపాటు.. అపార్టు మెంటులో ఫ్లాట్లు, విల్లాలు కొనుగోలు చేసిన వారు బిల్డ‌ర్ల‌పై అనుమానం వ‌స్తే.. ఈఎంఐలు నిలుపుద‌ల చేయాల‌ని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ వ్య‌వ‌హారం తేలే వ‌ర‌కు బ్యాంకులు కూడా ఈఎంఐల విష‌యంలో వినియోగ‌దారుల‌ను ఒత్తిచేయ‌డానికి వీల్లేద‌ని ఆదేశాలు జారీ చేసింది. దీంతో దేశ‌వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ రియ‌ల్ ఎస్టేట్ వ్య‌వ‌హారం-బ్యాంకుల‌తో బిల్డ‌ర్లు లోపాయికారీ ఒప్పందాలు చేసుకోవ‌డం వంటివి ఆస‌క్తిగా మారాయి.

ఏం జ‌రిగింది?

రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డర్లు, బ్యాంకుల మధ్య సాగే లోపాయికారీ ఒప్పందాలు సామాన్య గృహ కొనుగోలుదారులను ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తాజాగా ఈ వ్య‌వ‌హారంపై నిగ్గు తేలుస్తామ‌ని చెప్పిన‌ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ కుంభకోణంపై దర్యాప్తు ముమ్మరం చేప‌ట్టింది. బ్యాంకులు-బిల్డ‌ర్ల మ‌ధ్య జ‌రిగిన‌ ఒప్పందాల వెనుక ఉన్న ప్రధాన అంశాలు, కొనుగోలుదారులు ఎదుర్కొంటున్న సమస్యలు, చట్టపరమైన రక్షణ వంటి అంశాల‌పై సీబీఐ లోతుగా ద‌ర్యాప్తు చేస్తోంది.

ఏంటి మోసం..

ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా వెంచ‌ర్ వేయ‌డానికి ముందు.. వెంచ‌ర్ ప్రారంభ‌ స‌మ‌యంలో రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డ‌ర్లు.. కొనుగోలు దారుల‌ను ఆక‌ర్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో.. "ఇల్లు అప్పగించే వరకు మీరేమీ కట్టాల్సిన పనిలేదు, వాయిదాలను మేమే కడతాం" అంటూ బిల్డర్లు 80:20 లేదా 75:25 వంటి పథకాల పేరుతో కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ఈ క్ర‌మంలో బ్యాంకు, బిల్డర్, కొనుగోలుదారుడి మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటున్నారు. అయితే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం, నిర్మాణ పురోగతిని బట్టి దశలవారీగా మాత్రమే బ్యాంకులు బిల్డర్లకు రుణ మొత్తాన్ని విడుదల చేయాలి.

కానీ, లోపాయికారీ ఒప్పందాలతో కొన్ని బ్యాంకులు ప్రాజెక్ట్ పూర్తి కాకముందే, కొన్నిసార్లు అసలు పనులు ప్రారంభం కాకముందే .. మొత్తం రుణాన్ని ఒకేసారి బిల్డర్ల ఖాతాల్లోకి జమ చేస్తున్నాయి. కొంతకాలం తర్వాత బిల్డర్లు చేతులెత్తేయడం లేదా నిర్మాణాన్ని మధ్యలోనే ఆపేయడం జరుగుతోంది. బిల్డర్లు బ్యాంకులకు వడ్డీలు చెల్లించడం ఆపేయగానే, బ్యాంకులు అసలు అప్పు తీసుకున్న కొనుగోలుదారులపై ఒత్తిడి తెచ్చి ఈఎంఐలు కట్టాలని నోటీసులు పంపుతున్నాయి. ఫలితంగా చేతికి ఇల్లు రాక, మరోవైపు అప్పు కట్టలేక కొనుగోలుదారులు నలిగిపోతున్నారు.

ఈ వ్య‌వ‌హారంపై దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. బిల్డర్లు, బ్యాంకుల మధ్య ఉన్న ఈ సంబంధంపై విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఢిల్లీ-ఎన్‌సీఆర్, ముంబై, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టులపై సీబీఐ కేసులు నమోదు చేసి సోదాలు నిర్వహించింది. మ‌రోవైపు.. నిర్మాణాలు పూర్తికాని ప్రాజెక్టుల విషయంలో బిల్డర్లు చేసిన తప్పులకు కొనుగోలుదారులను బాధ్యులను చేస్తూ వారిపై బలవంతపు రికవరీ చర్యలు తీసుకోవద్దని, ఈఎంఐల కోసం వేధించవద్దని కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా ప్రాజెక్టులో ఇల్లు కొనే ముందు దానికి రాష్ట్ర రెరా రిజిస్ట్రేషన్ ఉందో లేదో, అలాగే భూమికి సంబంధించిన చట్టపరమైన పత్రాలు సరిగ్గా ఉన్నాయో లేదో తప్పనిసరిగా తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు స్ప‌ష్టం చేసింది.

బిల్డర్లు, ఏజెంట్లు ఏకపక్ష నిబంధనలతో ఒప్పందాలు రూపొందించకుండా కేంద్ర ప్రభుత్వం ఏకరీతి ఒప్పందాల దిశగా చర్యలు తీసుకుంటోందని, అయినప్పటికీ, త్రైపాక్షిక ఒప్పందంపై సంతకం చేసే ముందు బిల్డర్ డిఫాల్ట్ అయితే బాధ్యత ఎవరిదనే నిబంధనలను న్యాయ నిపుణులతో పరిశీలించాల‌ని సూచించింది. ఈ ప్ర‌భావంతో దేశ‌వ్యాప్తంగా రియ‌ల్ ఎస్టేట్ రంగం ఈ నెల‌లో 40 శాతం మేర‌కు దెబ్బ‌తిన్న‌ట్టు తాజాగా అసోచామ్ సంస్థ త‌న నివేదిక‌లో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం.