Begin typing your search above and press return to search.

హోమం.. ఏడడుగులు వేయకుంటే హిందూ వివాహం కాదంతే.. తేల్చిన గుజరాత్ హైకోర్టు

రోటీన్ కు భిన్నంగా జరిగిన ఒక ఉదంతానికి సంబంధించిన వివాదంలో గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టత ఇవ్వటమే కాదు.. కింది కోర్టు చేసిన తప్పునకు ఆక్షింతలు వేసింది.

By:  Garuda Media   |   1 July 2026 11:21 AM IST
హోమం.. ఏడడుగులు వేయకుంటే హిందూ వివాహం కాదంతే.. తేల్చిన గుజరాత్ హైకోర్టు
X

రోటీన్ కు భిన్నంగా జరిగిన ఒక ఉదంతానికి సంబంధించిన వివాదంలో గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టత ఇవ్వటమే కాదు.. కింది కోర్టు చేసిన తప్పునకు ఆక్షింతలు వేసింది. హిందూ చట్టం ప్రకారం పెళ్లి చేసుకునే వారు కచ్ఛితంగా ఆచారాలు.. సంప్రదాయాలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. అంతేకాదు.. సర్టిఫికేట్ ఉన్నంత మాత్రాన హోమం.. ఏడడుగులు.. ఇలాంటి హిందూ పెళ్లిళ్లలో జరిగే క్రతువులు ఏమీ జరగకుండానే.. వివాహమైపోయిందని చెబితే కుదరదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఒక సర్టిఫికేట్ పట్టుకొని పెళ్లి జరిగిపోయిందని వాదిస్తున్న మహిళ మాటల్ని పరిగణలోకి తీసుకోమని చెప్పేసింది.

అదే సమయంలో బాధిత వ్యక్తి కోరినట్లుగా విడాకులు మంజూరు చేసింది. ఆసక్తికరంగా మారిన ఈ కేసులోకి వెళితే.. ఒక్కోసారి మన ప్రమేయం లేకుండానే మనకు సంబంధించిన ఎన్నో అంశాలు జరిగిపోతాయా? అన్న సందేహానికి గురి చేసేలా తాజా ఉదంతం ఉందని చెప్పాలి. ఇంతకూ ఈ కేసేంటి? గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ ఏం చెప్పింది? దీనికి ముందు ఇదే కేసుకు సంబంధించి ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన తీర్పును ఎందుకు తప్పు పట్టింది? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే.. ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.

బ్రిటన్ లో నివసించే కౌశల్ సోనార్ అనే వ్యక్తి భారత్ కు వచ్చాడు. అతను బ్రిటన్ లో చదువుకుంటూ.. అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు. ఇదిలా ఉండగా అతను భారత్ కు వచ్చినప్పుడు అహ్మదాబాద్ కు చెందిన ఒక మహిళను కలిశాడు. ఈ క్రమంలో సదరు మహిళ కొన్ని పత్రాలపై సంతకాల్ని సేకరించింది. అతను బ్రిటన్ కు తిరిగి వెళ్లిపోయిన తర్వాత.. తనకు.. కౌశల్ కు పెళ్లి జరిగినట్లుగా పేర్కొంటూ అతడి తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. తమ పెళ్లి జరిగిన దానికి ఆధారంగా తన వద్ద ఉన్న రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ చూపించి.. తామిద్దరం భార్యభర్తలమని క్లెయిమ్ చేయటంతో వారి నోట మాట రాలేదు.

తమ కొడుకు తమకు చెప్పకుండా పెళ్లి చేసుకోవటమా? అని ఆశ్చర్యపోయారు. అదే సమయంలో బ్రిటన్ లో ఉన్న కౌశల్ కూడా షాక్ కు గురయ్యాడు. వెంటనే అతను అహ్మదాబాద్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించాడు. తమ మధ్య ఎలాంటి వివాహ ఆచారాలు జరగలేదని.. మోసపూరితంగా సర్టిఫికేట్ సేకరించారని.. అందుకే పెళ్లి జరిగినట్లుగా ఉన్న పత్రాన్ని రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు విచారణలో సదరు మహిళ రాతపూర్వకంగా తమ మధ్య ఎలాంటి పెళ్లి క్రతువు జరగలేదని.. తాము భార్యాభర్తలుగా ఒక్క రోజు కూడా కలిసి బతకలేదని ఒప్పుకుంది. ఇలా ఇద్దరు తమకు పెళ్లి జరగలేదని మొత్తుకున్న.. ఫ్యామిలీ కోర్టు ఈ పెళ్లిని రద్దు చేయాల్సిందిపోయి.. అందుకు భిన్నంగా స్పందించింది.

ప్రభుత్వ అధికారి జారీ చేసిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంది కాబట్టి.. దీనిపై పూర్తిస్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించి..సుదీర్ఘ విచారణ జరపాల్సిందేనని 2025 నవంబరులో కౌశల్ పిటిషన్ ను కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసు గుజరాత్ హైకోర్టును కౌశల్ ఆశ్రయించాడు. ఈ కేసును విచారించిన గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ తాజాగా కీలక తీర్పును ఇచ్చింది. హిందూ వివాహ చట్టం ప్రకారం సాంప్రదాయక ఆచారాలు పాటించకుండా కేవలం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన సదరు పెళ్లి చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. జస్టిస్ ఇలేష్ జె.వోరా, జస్టిస్ ఆర్టీ వచ్చానీలతో కూడిన డివిజన్ బెంచ్ తాజా తీర్పును ఇచ్చింది. సదరు పెళ్లిని మొదట్నించీ చెల్లనిదిగా ప్రకటించింది.

హిందూ వివాహ చట్టం, 1955లోని సెక్షన్ 7 ప్రకారం సాంప్రదాయక ఆచారాలు (హోమం, ఏడడుగులు) పూర్తి కాకుండా హిందూ వివాహం చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. చట్టంలోని సెక్షన్ 8 కింద ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కేవలం ఇప్పటికే జరిగిన వివాహానికి ఒక సాక్ష్యం మాత్రమే తప్పించి.. మూల క్రతువులేవీ జరగనప్పుడు.. కేవం సర్టిఫికేట్ భార్యభర్తల చట్టపరమైన హోదాను సృష్టించలేదని పేర్కొంది. ఇరుపక్షాలు అసలు పెళ్లే జరగలేదని అంగీకరించినప్పుడు.. కేవలం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉందన్న సాకుతో ఫ్యామిలీ కోర్టులు కేసులను ఏళ్ల కొద్దీ లాగకూడదని డివిజన్ బెంచ్ పేర్కొంది.

‘‘ఇరు పక్షాలు అసలు పెళ్లే జరగలేదని అంగీకరించినప్పుడు, కేవలం ప్రభుత్వ సర్టిఫికేట్ ఉందనే ఒకే ఒక్క కారణంతో.. కేసులను సంవత్సరాల తరబడి లాగి, ప్రజల సమయాన్ని వృధా చేయకూడదు’’ అని ఫ్యామిలీ కోర్టులను గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ మందలించింది. ప్రాథమికమైన 'పెళ్లి' అనే పునాది లేనప్పుడు, సదరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది చెల్లని ఒక కాగితం ముక్కతో సమానమని తేల్చింది. గుజరాత్ హైకోర్టు న్యాయమూర్తులు న్యాయమూర్తులు జస్టిస్ ఇలేష్ జె. వోరా, జస్టిస్ ఆర్.టి. వచ్ఛానీల బెంచ్.. హిందూ వివాహ పవిత్రతను వివరించడానికి 'ఋగ్వేదం' లోని శ్లోకాలను, సంప్రదాయాలను ప్రస్తావించింది.

‘‘భౌగోళికంగా, సాంస్కృతికంగా హిందూ పెళ్లిళ్లలో ఆచారాలు మారవచ్చు. ఓ వ్యక్తి ఆత్మను, జీవితాన్ని పవిత్రంగా మార్చే ప్రక్రియలు. అగ్నిసాక్షిగా జరిగే హోమం, వరుడు వధువు చేయి పట్టుకునే 'పాణిగ్రహణం', ఏడడుగులు నడిచే 'సప్తపది'.. ఇవన్నీ పూర్తయినప్పుడే ఆ బంధానికి ఆధ్యాత్మిక, సామాజిక, చట్టపరమైన హోదా వస్తుంది’’ అని కోర్టు వ్యాఖ్యానించింది హిందూ సంప్రదాయంలో పెళ్లి అన్నది ఒక పవిత్రమైన సంస్కారమని.. వివాహం అంటే పాటలు.. డ్యాన్సులు లేదంటే విందు వినోదాల కోసం చేసుకునేది కాదని పేర్కొంది.

ఒక పురుషుడు.. స్త్రీ పరస్పర అంగీకారం.. సమానత్వంతో కుటుంబ వ్యవస్థను నిర్మించుకోవటానికి జీవితాంతం కలిసి నడిచే ఒక పవిత్రబంధమని హైకోర్టు స్పష్టం చేసింది. కేవలం సర్టిఫికేట్లతోనో.. సీక్రెట్ గా రిజిస్ట్రేషన్లు చేసుకొని ఆచారాలు పాటించకుండా హిందూ చట్టం ప్రకారం భార్యభర్తలుగా క్లెయిమ్ చేసుకోవటం కుదరదని తాజా తీర్పు వేళ స్పష్టం చేసింది. అదే సమయంలో బాధితుడు తన వివాహ రిజిస్ట్రేషన్ ను రద్దు చేయించుకునేందుకు సంబంధిత అధికారులను ఆశ్రయించే స్వేచ్ఛను కోర్టు కల్పించింది.

ఈ కేసు తీర్పు వేళ గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. హిందూ వివాహ చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే పెళ్లి జరగకుండా.. కేవలం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ పొందినంత మాత్రాన సదరు పెళ్లి చట్టబద్ధం కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గతంలో స్పష్టం చేసింది. ఈ కేసు తీర్పు సందర్భంగా ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఒకవేళ ఏ ఆచారాలు పాటించకుండా కేవలం రిజిస్టర్ ఆఫీసులోనే పెళ్లి చేసుకోవాలని భావిస్తే.. అందుకు దేశంలో అమల్లో ఉన్న ప్రత్యేక వివాహ చట్టం, 1954 ఉందన్నది తెలిసిందే. ఈ చట్టం కింద రిజిస్ట్రార్ సమక్షంలో సంతకాలు చేయిస్తే.. ఎలాంటి సాంప్రదాయక ఆచారాలు లేకున్నా.. సదరు పెళ్లి నూటికి నూరు శాతం చట్టబద్ధం అవుతుందన్నది మర్చిపోకూడదు. మొత్తంగా చూస్తే.. గుజరాత్ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పులో కీలక అంశం.. హిందూ సంప్రదాయాలు.. ఆచారాలు పాటించకుండా కేవలం హిందూ చట్టం కింద చేసుకునే రిజిస్ట్రేషన్ పెళ్లి చట్టం దృష్టిలో చెల్లదని స్పష్టం చేసిందని చెప్పాలి.