భారత్ లో విదేశీయులు నిరసనల్లో పాల్గొనకూడదా? చట్టం ఏం చెబుతోంది?
ఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం చూపకుండానే దేశంలో 13 కోట్ల ఓట్లు చోరీ జరిగిందన్న పేరుతో భారీ ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే.
By: Garuda Media | 19 Oct 2026 4:03 PM ISTఒక్కటంటే ఒక్క బలమైన ఆధారం చూపకుండానే దేశంలో 13 కోట్ల ఓట్లు చోరీ జరిగిందన్న పేరుతో భారీ ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. నిజంగానే ‘సర్’ కార్యక్రమంలో 13 కోట్ల ఓట్ల చోరీ జరిగిందా? లేదా? అన్న దానిపై ఇప్పటికి స్పష్టత లేదు. విపక్షాలు.. సీజేపీ నేతలు ఈ వాదనను బలంగా వినిపిస్తూ పెద్ద ఎత్తున నిరసనలు.. ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా..ఈ ఆందోళనల్లో పాలు పంచుకుంటున్న కొందరిపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దేశంలో జరుగుతున్న నిరసనలు. ఆందోళనల్లో విదేశీయులు ఎలా పాల్గొంటారన్న ప్రశ్నలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో భారత పౌరసత్వం లేని బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ ఆందోళనల్లో పాల్గొనటం.. ఆయన్ను దేశం విడిచి వెళ్లాంటూ నోటీసులు జారీ చేయటం తెలిసిందే. దీనిపై స్టే కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయస్థానం తన స్పందనను తెలియజేయాల్సి ఉంది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. అసలు విదేశీయులు ఎవరూ భారత్ లో జరిగే ఏ నిరసనల్లోనూ.. ఆందోళనల్లోనూ పాల్గొనకూడదా? దానికి సంబంధించిన రూల్ ఎక్కడ ఉంది? చట్టం దీనికి సంబంధించి ఏం చెబుతోంది? లాంటి ప్రశ్నలు ఇప్పుడు తెర మీదకు వచ్చాయి.
ఇలాంటి వేళ.. అసలు చట్టం చెప్పేదేంటి? రాజ్యాంగంలో విదేశీయులకు ఉండే పరిమితులు ఏంటి? అన్న విషయాల్లోకి వెళితే.. కొత్త అంశాలు కనిపిస్తాయి. సూటిగా.. స్పష్టంగా చెప్పాలంటే విదేశీయులు ఎవరూ కూడా భారతదేశంలో జరిగే రాజకీయ నిరసనలు.. ఆందోళనల్లో పాల్గొనకూడదు. భారత రాజ్యాంగం.. ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం విదేశీ పౌరులకు.. ఓవర్ సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఐఓసీ కార్డు హోల్డర్లు) కార్డు ఉన్న విదేశీ పౌరులు సైతం రాజకీయ నిరసనల్లోనూ.. ఆందోళనల్లోనూ పాల్గొనకూడదు.
భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1) (ఏ) ప్రకారం, ఆర్టికల్ 19(1)(బి) ద్వారా లభించే ప్రాథమిక హక్కులు కేవలం భారత పౌరులకు మాత్రమే వర్తిస్తాయి. ఇంతకూ ఆర్టికల్ 19(1) (ఏ) ఏం చెబుతుందన్నది చూస్తే.. భావ ప్రకటనా స్వేచ్ఛ గురించి ప్రస్తావిస్తే.. ఆర్టికల్ 19(1) (బి)లో శాంతియుతంగా సమావేశం కావటం.. నిరసన తెలపటం లాంటివి కూడా భారత పౌరులకు మాత్రమే లభిస్తాయి.
ఆర్టికల్ 14, 21 ప్రకారం విదేశీయులకు చట్టం ముందు సమానత్వం, జీవించే హక్కు.. వ్యక్తిగత స్వేచ్చ మాత్రమే వర్తిస్తాయి. అంతే తప్పించి భారత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేసే హక్కు వారికి దఖలు పర్చలేదు. ఇక.. ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ చట్టం ప్రకారం భారతదేశంలో విదేశీయుల రాకపోకలు.. ప్రవర్తనను నియంత్రించటానికి ఇమ్మిగ్రేషన్ ఫారినర్స్ చట్టంలోని సెక్షన్ 7, సెక్షన్ 29 ప్రకారం భారతదేశంలో విదేశీయుల ఉనికి.. వారు చేసే కార్యాకలాపాలన నియంత్రించే అధికారంతో పాటు.. పరిమితం చేసే విస్తృత అధికారాలు ప్రభుత్వానికి ఉన్నాయి. సెక్షన్ 29 ప్రకారం నిబంధనలను ఉల్లంఘనకు పాల్పడే విదేశీయులను దేశం నుంచి బహిష్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంది.
అంతేకాదు విదేశీయులు భారతదేశానికి వచ్చేటప్పుడు వారు తీసుకున్న వీసాలో పేర్కొన్న నిబంధనలకు కట్టుబడి ఉండాలి. దేశ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవటం.. ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనలలో పాల్గొనటం వీసా నిబంధనలను తీవ్రంగా ఉల్లంఘించటమే అవుతుంది. ఓసీఐ కార్డు హోల్డర్లు భారత్ లో నివాసం ఉండేందుకు.. వ్యాపారాలు చేసుకోవటానికి కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. అయినప్పటికి వారు విదేశీ పౌరుల కిందకే వస్తారు. వారికి భారతదేశంలో ఓటుహక్కుకానీ రాజకీయ కార్యకలాపాల్లోనూ.. నిరసనల్లోనూ పాల్గొనే హక్కు ఉండదు.
ఎవరైనా విదేశీయుడు లేదంటే ఓసీఐ కార్డు హోల్డర్ నిరసనల్లో పాల్గొంటే వారిపై తీసుకునే చర్యలు ఎలా ఉంటాయంటే.. వీసా రూల్స ను బ్రేక్ చేసిన కారణానికి వారు నిర్దేశిత గడువు లోపు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ నోటీసులు జారీ చేస్తారు. వారి వీసా లేదంటే ఓసీఐ హోదాను రద్దు చేస్తారు. భవిష్యత్తులో వారు మళ్లీ భారతదేశంలోకి అడుగు పెట్టకుండా బ్లాక్ లిస్ట్ లో పెడతారు. చట్టంలో వివరాలు ఇంత స్పష్టంగా ఉన్న తర్వాత కూడా నిబంధనల్ని ఉల్లంఘించేలా ఎందుకు వ్యవహరిస్తున్నట్లు? అన్నది అసలు ప్రశ్న.
