వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి షాక్.. కోర్టు సంచలన తీర్పు
వివాహం అనేది నమ్మకాలు, భావోద్వేగాలు, పరస్పర గౌరవం మీద నిలబడి ఉండే పవిత్రమైన బంధం.
By: A.N.Kumar | 24 Sept 2025 9:54 AM ISTవివాహం అనేది నమ్మకాలు, భావోద్వేగాలు, పరస్పర గౌరవం మీద నిలబడి ఉండే పవిత్రమైన బంధం. అయితే ఈ బంధంలోకి మూడో వ్యక్తి ప్రవేశించినప్పుడు, ఆ దాంపత్య జీవితం తీవ్రంగా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో వివాహేతర సంబంధాలపై ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు చట్టపరమైన కొత్త చర్చకు దారితీసింది.
అడల్టరీ: నేరం కాదు కానీ…
2018లో జోసెఫ్ షైన్ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో అడల్టరీ లేదా వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరాల జాబితా నుంచి తొలగించింది. అంటే ఇప్పుడు ఇది క్రిమినల్ అఫెన్స్ కాదు. దీనికి జైలుశిక్ష లేదా ఇతర శిక్షలు లేవు. అయితే, సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. ఇది నేరం కాకపోయినా, వివాహ వ్యవస్థకు హానికరం అవుతుందని స్పష్టం చేసింది..
ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పు
ఇటీవల ఢిల్లీ హైకోర్టులో ఒక కేసు విచారణకు వచ్చింది. 2012లో పెళ్లి అయిన ఒక మహిళ, తన భర్త 2021లో మరో మహిళతో సంబంధం పెట్టుకోవడం వల్ల తమ వైవాహిక జీవితం పూర్తిగా దెబ్బతిందని కోర్టులో వాదించింది. తన భర్త ఆ మహిళతో ట్రిప్స్‌కి వెళ్ళడం, తరచూ కలవడం, చివరికి విడాకులు కోరడం వల్ల తాను మానసికంగా, భావోద్వేగపరంగా నష్టపోయానని పిటిషన్‌లో పేర్కొంది.
దీనిపై ఢిల్లీ హైకోర్టు సంచలనాత్మకంగా స్పందించింది. అడల్టరీ క్రిమినల్ నేరం కాకపోయినా ఇది సివిల్ కోర్టుల్లో కేసుల పరిధిలోకి వస్తుంది అని స్పష్టం చేసింది.
‘ఎలియనేషన్ ఆఫ్ అఫెక్షన్’ కాన్సెప్ట్
ఈ కేసుతో ‘ఎలియనేషన్ ఆఫ్ అఫెక్షన్ ’ (ఆప్యాయత దూరం చేయడం) అనే కొత్త లీగల్ కాన్సెప్ట్ భారతదేశంలో చర్చకు వచ్చింది. అమెరికా వంటి పాశ్చాత్య దేశాల్లో ఇది సాధారణమైన చట్టపరమైన ప్రావధానం. దీని ప్రకారం, ఒక మూడో వ్యక్తి చర్యల వల్ల వివాహ బంధం విచ్ఛిన్నం అయితే, అతనిపై లేదా ఆమెపై సివిల్ కేసు వేసి నష్టపరిహారం కోరవచ్చు.
ఢిల్లీ హైకోర్టు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తూ మూడో వ్యక్తి కారణంగా భార్యాభర్తల బంధం పాడైందా? నిజంగా ఆ వ్యక్తి జోక్యం వల్లనే విడాకులు వచ్చాయా? అన్న విషయాలను విచారణలో తేలుస్తామని స్పష్టం చేసింది.
ప్రభావం
ఈ తీర్పుతో స్పష్టమైంది ఏమిటంటే.. వివాహేతర సంబంధం క్రిమినల్ నేరం కాదు. కానీ దాని వల్ల నష్టపోయిన జీవిత భాగస్వామి సివిల్ కోర్టులో కేసు వేసి నష్టపరిహారం కోరే హక్కు కలిగి ఉంటుంది. భారతీయ చట్టంలో ఇది కొత్త కాన్సెప్ట్ అయినా, భవిష్యత్తులో ఇలాంటి కేసులకు ఇది ఒక న్యాయ పరమైన మార్గదర్శకం అవుతుంది.
వివాహ బంధం పవిత్రమైనది. దానిలోకి మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటే, కేవలం వ్యక్తిగత స్థాయిలోనే కాకుండా చట్టపరంగానూ బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఢిల్లీ హైకోర్టు తాజా తీర్పు వివాహేతర సంబంధాలపై కొత్త చర్చకు తెరతీస్తూ, భారతీయ న్యాయ వ్యవస్థలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభించిందని చెప్పవచ్చు.
