ఓర్నీ... లోకంలో ఇన్ని రకాల విడాకులు ఉన్నాయా..!
జీవితాంతం కలిసి ఉంటామని, కష్టసుఖాల్లో తోడుంటామని ప్రమాణాలు చేసుకుని వివాహ బంధంతో ఒకటైన జంటలు.. రకరకాల కారణాల కారణంగా మధ్యలోని విడిపోతుంటారు.
By: Raja Ch | 20 Dec 2025 2:00 PM ISTజీవితాంతం కలిసి ఉంటామని, కష్టసుఖాల్లో తోడుంటామని ప్రమాణాలు చేసుకుని వివాహ బంధంతో ఒకటైన జంటలు.. రకరకాల కారణాల కారణంగా మధ్యలోని విడిపోతుంటారు. ఈ క్రమంలో న్యాయస్థానాలను ఆశ్రయించి చట్టబద్ధంగా విడిపోవడమే విడాకులు అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే.. చాలామందికి తెలియని ఇంకా ఎన్నో రకాల విడాకులు ఉన్నాయన్న విషయం మీకు తెలుసా..?
అవును... చట్టబద్ధంగా న్యాయస్థానం నుంచి అనుమతి తీసుకొని విడిపోవడం గురించి అందరికీ తెలిసిందే. ఆ విడాకుల అనంతరం ఎవరి జీవితం వారు జీవిస్తుంటారు. మాగ్జిమం అక్కడ నుంచి ఇద్దరి మధ్యా కమ్యునికేషన్ ఆల్ మోస్ట్ ఉండదు! అయితే అవి రెగ్యులర్ విడాకులు. ఇప్పుడు మనం చెప్పుకోబోయేవి ఏమిటంటే.. ఒకే దగ్గర కలిసి ఉంటూనే వేర్వేరుగా జీవిస్తూ ఉండే విడాకులన్నమాట.
అయితే... కష్టమైనా కలిసి ఉండాలి.. లేదంటే, ఒకరికి ఇష్టం లేకున్నా విడిపోవాలి.. అంతే కానీ ఇలా కలిసి ఉండి విడిపోవడం ఏమిటి? అనే సందేహాలు ఎవరికైనా వస్తే వీటినే డివోర్స్ ట్రెండ్స్ అంటున్నారనే సమాధానం వస్తుంది. అసలు అవేమిటి.. ఎన్ని రకాలు.. దేని లెక్క ఏమిటి అనేది ఇప్పుడు చూద్దామ్..!
స్లీప్ డివోర్స్!:
కొంతమంది గురక కారణం అని చెబుతారు.. మరికొంతమంది సంతృప్తికరమైన శృంగారం లభించక అని అంటారు. కారణం ఏమైనా, కారకులు ఎవరైనా.. ఈ రెండు సమస్యల ప్రభావం సంసార జీవితంపై పడకూడదనే ఆలోచనతో కొంతమంది వేర్వేరు పడక గదుల్లో నిద్రించడానికి మొగ్గు చూపుతున్నారు. ఇలా ఒకే ఇంట్లో ఉంటూనే.. దంపతులు ఇద్దరూ వేర్వేరు గదుల్లో నిద్రించడాన్నే స్లీప్ డివోర్స్ అని పిలుస్తారు.
సైలెంట్ డివోర్స్!:
దీని ప్రకారం.. దంపతులు చట్టబద్ధంగా విడాకులూ తీసుకోరు.. అలా అని ఒకే ఇంట్లో ఉన్నప్పటికీ అటు శారీరకంగానూ, ఇటు భావోద్వేగాల పరంగానూ దగ్గరగా ఉండరు.. ఒకరితో ఒకరు మాట్లాడనూకోరు.. ఇంట్లో పనులు చేసుకుంటూనే విడిగా జీవిస్తారు.. రెండు కుటుంబాల్లోని వ్యక్తులు, బంధువుల వద్ద మాత్రం కలిసి ఉన్నట్లుగా కెమెరా స్మైల్ తో కనిపిస్తారు. దీన్నే సైలెంట్ డివోర్స్ అంటారు.
అయితే ఈ ఎంపికకు రకరకాల కారణాలు ఉంటాయి. సమాజానికో, పెద్దలకో భయపడి విడాకులు తీసుకునే ధైర్యం లేక కొందరు ఈ ట్రెండ్ ను సెలక్ట్ చేసుకుంటే.. పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరికొందరు ఈ ట్రెండ్ ని ఫాలో అవుతుంటారు.
మెనో డివోర్స్!:
మహిళల్లో మధ్య వయసుకొచ్చాక మెనోపాజ్ మొదలవుతుంది. ఆ సమయంలో తమ వైవాహిక జీవితాన్ని సమీక్షించుకుంటున్న మహిళలు, ఏ మాత్రం అసంతృప్తిగా ఉన్నా.. భర్త నుంచి విడిపోవాలని భావిస్తున్నారంట. నూన్ అనే ఓ సంస్థ నిర్వహించిన సర్వేలో.. ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు ఈ ఆలోచనతోనే ఉన్నారని అంటున్నారు. ఇలా మేనోపాజ్ రాగానే విడాకుల గురించి ఆలోచిస్తున్నారనే ఈ ట్రెండ్ కు మెనో డివోర్స్ అని పేరొచ్చింది!
గ్రే డివోర్స్!:
కారణాలు ఏవైనా, కారకులు ఎవరైనా.. సాధారణంగా పెళ్లైన కొత్తలోనో, పదేళ్ల లోపులోనో విడాకులకు ఎక్కువగా వెళ్తుంటారు దంపతులు! అలాకాకుండా దశాబ్ధాల పాటు కలిసి ఉండి.. 50 ఏళ్లు దాటిన తర్వాత కూడా కొంతమంది విడాకులకు వెళ్తున్నారు. వీటినే గ్రే డివోర్స్ అంటున్నారు. వీటికి పలు రకాల కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
ఇందులో భాగంగా... ఇంతకాలం కలిసి ఉన్నా ఇద్దరిలోనూ సంతృప్తి లేకపోవడం.. మరికొంతమందికి జీవితాన్ని తిరిగి కొత్తగా ప్రారంభించాలని కోరుకోవడం.. ఇంకొంతమంది విషయంలో భాగస్వామి అనారోగ్యానికి గురికావడం వంటివని చెబుతున్నారు. మరికొంతమంది.. పిల్లలు సెటిల్ అయిపోయారనే ధైర్యంతో ఈ ఆలోచన చేస్తున్నారని చెబుతున్నారు.
