కేజ్రీవాల్‌కు భారీ షాక్: మీరు రాకపోయినా.. విచారణ చేస్తాం.. హైకోర్టు
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన రైట్ హ్యాడ్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసో డియాలకు ఢిల్లీ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది.
By: Garuda Media | 5 May 2026 11:40 PM ISTఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీపార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన రైట్ హ్యాడ్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసో డియాలకు ఢిల్లీ హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో విచారణకు కోర్టుకువచ్చేది లేదని తేల్చి చెప్పిన నేప థ్యంలో కేజ్రీవాల్, సిసోడియాలు కోర్టుకు రాకపోయినా.. విచారణను మాత్రం ఆపేది లేదని.. ఒకరు వ్యతిరేకించినంత మాత్రాన న్యాయ వ్యవస్థ పనితీరు నిలిచిపోదని వ్యాఖ్యానించింది. ఈ కేసు విచారణను తాము కొనసాగించే తీరుతామని తేల్చి చెప్పింది.
ఏం జరిగింది?
ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నూతన మద్యం విధానం తీసుకువచ్చారు. అయితే.. ఇది అవినీతి, అక్రమాల కు కేంద్రంగా మారిందని.. గోవా ఎన్నికల్లో 100 కోట్లరూపాయలను సర్దుబాటు చేసి.. ఓ పార్టీ పరాజయానికి ప్రయత్నించారని ఆరోపిస్తూ.. సీబీఐ, ఈడీ అధికారులు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణకు చెందిన కవిత.. ఇలా చాలా మంది జైలుకు కూడా వెళ్లారు. అయితే.. గత నెలలో సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిశీలించిన ఢిల్లీలోనూ స్థానిక రౌస్ ఎవెన్యూ కోర్టు.. ఈ కేసును కొట్టి వేసింది. అత్యంత దారుణమైన రీతిలో అభియోగాలు మోపారని.. దీనిలో వాస్తవం లేదని కూడా ఆనాడు పేర్కొంటూ.. నిందుతులందరిపైనా కేసును కొట్టి వేసింది.
అయితే రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ అధికారులు ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టి న హైకోర్టు.. దీనిని జస్టిస్ స్వర్ణ కాంత శర్మకు అప్పగించింది. ఇదే వివాదానికి.. కేజ్రీవాల్ కోర్టుకు రానని భీష్మించడానికి కారణ మైంది. జస్టిస్ స్వర్ణ కాంత్ ఆర్ ఎస్ ఎస్‌కు అనుకూలంగా ఉన్నారన్నది కేజ్రీవాల్ ఆరోపణ. ఆయన పలు మార్లు.. ఆర్ ఎస్ ఎస్ సమావేశాలకు కూడా హాజరయ్యారని.. ఆయన కుమార్తె, కుమారుడు న్యాయవాదులుగా ఉన్నారని.. వీరు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని కేసులను వాదిస్తున్న నేపథ్యంలో జస్టిస్ స్వర్ణకాంత్ కేంద్ర ప్రభుత్వ సంస్థలకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోరన్నది కేజ్రీవాల్ ఆరోపణ. ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు రానని.. న్యాయమూర్తిని మార్చాలని కోరారు.
కానీ, హైకోర్టు మాత్రం న్యాయమూర్తిని మార్చేది లేదని.. పేర్కొంది. ఈ క్రమంలో తాజాగా కేజ్రీవాల్ సహౄ మనీష్ సిసోడియాలు కోర్టుకు వచ్చినా రాకపోయినా.. ఈ కేసు విచారణ జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కేజ్రీవాల్ నుంచి కోర్టుకు అవసరమైన న్యాయ సహాయం అందించేందుకు(ఆయన కోర్టుకు రాని పక్షంలో) అమికస్ క్యూరీలను నియమించింది. ముగ్గురు సీనియర్ అమికస్ క్యూరీలను ఢిల్లీ హైకోర్టు నియమించింది. నిందితులు విచారణకు సహకరించకపోయినా న్యాయ ప్రక్రియ ఆగదని ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఇప్పుడు కేజ్రీవాల్ వ్యవహారం మరింతరసకందాయంలో పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
