Begin typing your search above and press return to search.

'అత్యాచారం చేయడానికి స్నేహం ఎలాంటి లైసెన్స్ ఇవ్వదు'!

ఇటీవల కాలంలో మైనర్ బాలికలపై రకరకాల కారణాలతో లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే! తాజాగా ఏపీలోని తునిలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసి తీవ్ర కలకలం రేపింది.

By:  Raja Ch   |   24 Oct 2025 6:00 AM IST
అత్యాచారం చేయడానికి స్నేహం ఎలాంటి లైసెన్స్  ఇవ్వదు!
X

ఇటీవల కాలంలో మైనర్ బాలికలపై రకరకాల కారణాలతో లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరుగుతున్న సంగతి తెలిసిందే! తాజాగా ఏపీలోని తునిలోనూ అలాంటి ఘటనే వెలుగు చూసి తీవ్ర కలకలం రేపింది. మరోవైపు మైనర్లపై స్నేహం పేరు చెప్పి అత్యాచారాలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయని అంటున్నారు. అలాంటి ఘటనలోనే తాజాగా ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.

అవును.. 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికి ముందస్తు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు.. తామిద్దరమూ స్నేహితులమే అనే వాదనను సూటిగా తోసిపుచ్చింది! బాధితురాలిపై పదే పదే అత్యాచారం చేయడానికి, ఆమెను నిర్బంధించడానికి లేదా ఆమెను కనికరం లేకుండా కొట్టడానికి స్నేహం అనుమతి ఇవ్వదని పేర్కొంది.

వివరాళ్లోకి వెళ్తే... మైనర్ అయిన బాధితురాలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. కొన్నేళ్లుగా నిందితుడితో ఆమెకు పరిచయం ఉంది. ఈ క్రమంలో... అతడు తన స్నేహితుడి ఇంట్లో ఆమెను బంధించి.. కనికరం లేకుండా కొట్టి.. లైంగికంగా వేధించాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించాడు. దీనిపై ఆమె కోర్టును ఆశ్రయించింది!

ఈ సందర్భంగా స్పందించిన నిందితుడు... తామిద్దరం ఇష్టపూర్వకంగా ఆ బంధాన్ని కొనసాగించామని, ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదులో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించాడు. దీనిపై తాజాగా విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ ఈ ముందస్తు బెయిల్ పిటిషన్‌ ను తిరస్కరించారు.

ఈ సందర్భంగా... సంబంధిత పార్టీలు స్నేహితులు అయినప్పటికీ.. బాధితురాలిపై పదే పదే అత్యాచారం చేయడానికి, ఆమెను తన స్నేహితుడి ఇంట్లో బంధించడానికి, ఆమెను కనికరం లేకుండా కొట్టడానికి స్నేహం ఎటువంటి లైసెన్స్ ఇవ్వదని.. ఫిర్యాదుదారు తన వాంగ్మూలంలో ప్రాథమికంగా వెల్లడించినట్లుగా వైద్య రికార్డుల ద్వారా ఇది ధృవీకరించబడిందని న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు.

మరోవైపు.. ఎఫ్.ఐ.ఆర్ దాఖలు చేయడంలో 11 రోజుల జాప్యం జరిగిందని.. తనకు, బాధితురాలికి మధ్య సంబంధం ఏకాభిప్రాయంతో ఉందని పేర్కొంటూ నిందితుడు బెయిల్ కోరిన విషయంపైనా స్పందించిన జస్టిస్ స్వర్ణ కాంత శర్మ... సహజంగానే భయం, తన మనసుకు తగిలిన గాయం.. ఈ ఘటన గురించి తల్లిదండ్రులకు చెప్పడానికి బాధితురాలు నిరాకరించిందని అన్నారు!

అందువల్ల, పైన పేర్కొన్న పరిస్థితుల దృష్ట్యా ప్రస్తుత కేసులో మోపబడిన ఆరోపణల తీవ్రతతో పాటు, ప్రాథమికంగా రికార్డులో ఉన్న అంశాల ద్వారా ధృవీకరించబడినందున, ముందస్తు బెయిల్ మంజూరు చేయడానికి ఎటువంటి అవకాశం లేదని ఈ కోర్టు గుర్తించిందని.. దీని ప్రకారం, ప్రస్తుత ముందస్తు బెయిల్ దరఖాస్తు కొట్టివేయబడిందని న్యాయమూర్తి అన్నారు!