Begin typing your search above and press return to search.

మేనరికం పెళ్లిళ్లు.. మనకు ఎన్నాళ్లీ బాధ?

మేనరికం వివాహాల వల్ల పిల్లలకు జన్యుపరమైన సమస్యలు వచ్చే ప్రమాదంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 20 ఏళ్ల న్యాయ విద్యార్థిని చార్వి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. జన్యుపరమైన సమస్యలపై పాఠశాల స్థాయి నుంచే అవగాహన కల్పించాలని సూచించింది.

By:  A.N.Kumar   |   21 Nov 2026 10:34 PM IST
మేనరికం పెళ్లిళ్లు.. మనకు ఎన్నాళ్లీ బాధ?
X

మన ఇంట్లో ఆడపిల్ల మన కళ్లముందే ఉండాలనో.. ఆస్తులు పరాయి ఇంటికి వెళ్లకూడదనో.. లేక తరతరాలుగా వస్తున్న ఆచారాన్ని గౌరవించాలనో మనం తీసుకునే కొన్ని నిర్ణయాలు.. రేపటి తరం పిల్లల జీవితాల్లో చీకట్లు నింపుతున్నాయంటే నమ్మగలరా? అవును.. రక్త సంబంధీకుల మధ్య జరిగే మేనరికం వివాహాలు ఇప్పుడు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఒక భావోద్వేగపూరితమైన కీలకమైన చర్చకు దారితీశాయి.

ఈ చర్చకు కారణం 20 ఏళ్ల న్యాయ విద్యార్థిని చార్వి. పుట్టుకతోనే 40 శాతం దృష్టి లోపంతో బాధపడుతున్న ఆ యువతి.. తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదనే తపనతో సుప్రీంకోర్టు తలుపు తట్టారు. ఆచారాల పేరుతో హిందూ వివాహ చట్టంలో ఉన్న మినహాయింపుల వల్ల మేనరికం పెళ్లిళ్లు యథేచ్ఛగా జరుగుతున్నాయని.. దీనివల్ల ఎంతోమంది చిన్నారులు జన్యుపరమైన లోపాలతో నరకం అనుభవిస్తున్నారని ఆమె తన పిటిషన్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దగ్గరి రక్త సంబంధీకుల మధ్య వివాహాల వల్ల పుట్టబోయే పిల్లలకు వినికిడి.. చూపు సమస్యలు.. ఇతర జన్యుపరమైన వ్యాధులు వచ్చే ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న విషయాన్ని కోర్టు గుర్తుచేసింది. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో 23 నుంచి 28 శాతం వరకు ఇలాంటి వివాహాలే జరుగుతుండటం ఆందోళన కలిగించే అంశం.

వివాహ ఆచారాలను నియంత్రించే అధికారం పార్లమెంటుకు ఉందని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తూ నోటీసులు జారీ చేసింది. అయితే కేవలం కఠిన చట్టాలు చేయడం వల్ల సమాజంలో మార్పు రాదని ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రజల ఆలోచనా విధానంలో మార్పు రావాలంటే పాఠశాల.. కళాశాల స్థాయి నుంచే జన్యుపరమైన సమస్యలపై పాఠ్యాంశాలను చేర్చాలని సూచించింది. గ్రామీణ ప్రాంతాల్లోని అంగన్‌వాడీ కార్యకర్తలు.. పంచాయతీల ద్వారా ప్రతి ఇంటికీ ఈ శాస్త్రీయ సత్యాన్ని చేరవేయాలని పేర్కొంది.

జీవిత భాగస్వామిని ఎంచుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛే కావచ్చు. కానీ ఆ నిర్ణయం రేపు ఈ భూమిపైకి రాబోయే ఒక పసిపాప ఆరోగ్యాన్ని పణంగా పెట్టేదిగా ఉండకూడదు. పెద్దల మాటకో.. ఆస్తుల కోసమో కాకుండా.. విజ్ఞానంతో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. సంప్రదాయాలను గౌరవిస్తూనే.. శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకున్నప్పుడే మనం భావితరాలకు ఒక ఆరోగ్యకరమైన, అందమైన జీవితాన్ని కానుకగా ఇవ్వగలం..