మీరు జెన్ జెడ్ లే కాదు: ఢిల్లీ హైకోర్టు
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
By: A.N.Kumar | 21 Oct 2026 6:16 PM ISTకాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలపై ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నిషేధాజ్ఞలు అమల్లో ఉన్న సమయంలో జంతర్ మంతర్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి నిరసన చేపట్టిన ఘటనకు సంబంధించి విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో నేతల వయసును ప్రస్తావిస్తూ.. వారిని జెన్-జీగా పరిగణించలేమన్నట్లుగా వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది. అనుమతులు లేకుండా నిరసన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని కోర్టు హెచ్చరించింది.
జెన్-జీపై కోర్టు వ్యాఖ్యలు.. ఏం జరిగిందంటే?
కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్ (27), అశుతోష్ రాంకా (32) తమ జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే వారి కస్టడీ గడువు అదే రోజుతో ముగియనుండటం.. ప్రత్యేక కోర్టులో విచారణ జరగాల్సి ఉండటంతో ఈ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని హైకోర్టు సూచించింది. దీంతో వారు తమ పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారు.
ఈ విచారణ సందర్భంగా నేతల వయసుల ప్రస్తావన వచ్చింది. 1997 తర్వాత జన్మించిన వారిని జెన్-జీగా పరిగణిస్తారనే విషయాన్ని ప్రస్తావిస్తూ వారి వయసును బట్టి చూస్తే అందులోకి రారని కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం. దీంతో ‘మీరు జెన్-జీ కాదు’ అంటూ కోర్టు చురకలు వేయడం చర్చనీయాంశమైంది.
అనుమతులు లేకుండా నిరసనలు వద్దు
నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు పోలీసుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిన అవసరాన్ని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. నిరసనల సమయంలో పరిస్థితులు అదుపు తప్పే అవకాశం ఉంటుందని.. అలాంటి సందర్భాల్లో శాంతిభద్రతలను కాపాడటం అత్యంత ముఖ్యమని పేర్కొంది. విద్యార్థుల నిరసనల్లోకి ఇతర శక్తులు ప్రవేశించి విధ్వంసానికి పాల్పడే ప్రమాదం కూడా ఉందని అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న నిరసనలు, హింసాత్మక ఘటనలను కోర్టు ప్రస్తావించినట్లు సమాచారం. ఆందోళనల పేరుతో ఆస్తుల ధ్వంసం, దోపిడీలు జరిగితే వాటి ప్రభావం సమాజంపై తీవ్రంగా ఉంటుందని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అందుకే ఏ కార్యక్రమమైనా చట్టపరిధిలో.. అవసరమైన అనుమతులతో నిర్వహించాలని సూచించింది.
జంతర్ మంతర్ వద్దకు ఎందుకు వెళ్లాలి?
నిరసనలకు వేదికగా జంతర్ మంతర్ ను తొలగించినప్పుడు.. అక్కడ నిబంధనలు అమల్లో ఉన్నప్పుడు అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.. పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్ల వెనుక ఒక ఉద్దేశం ఉంటుందని.. వాటిని బలవంతంగా తొలగించడం సరికాదని పేర్కొంది. అలా చేయడం వల్ల నిరసనకారులతో పాటు ఇతర వ్యక్తులు కూడా అక్కడికి చేరి పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
చట్టాన్ని గౌరవించాల్సిందే
నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో కీలకమైనదే అయినప్పటికీ అది చట్టబద్ధమైన పరిమితులకు లోబడి ఉండాలని ఈ పరిణామం మరోసారి గుర్తుచేస్తోంది. పోలీసుల అనుమతులు, నిషేధాజ్ఞలు, శాంతిభద్రతలకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాక్రోచ్ జనతా పార్టీ నేతల కేసులో ఢిల్లీ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చకు దారితీశాయి.
అయితే పిటిషన్‌ను ఉపసంహరించుకోవడం అనేది కేసులోని ఆరోపణలపై తుది తీర్పు వెలువడినట్లుగా భావించరాదు. తదుపరి విచారణలో ప్రత్యేక కోర్టు తీసుకునే నిర్ణయాలు ఈ కేసులో కీలకం కానున్నాయి.
