Begin typing your search above and press return to search.

ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న

కాక్రోచ్ జనతా పార్టీ అన్నది సోషల్ మీడియా వేదికగా పుట్టిన పార్టీ. ఆ తరువాత నీట్ పేపర్ లీకేజి మీద విద్యార్ధులలో ఉన్న భావోద్వేగాలకు ఒక వేదికగా మారింది.

By:  Satya P   |   21 Oct 2026 7:58 PM IST
ఇంతకీ మీరెవరు....సీజేపీకి న్యాయమూర్తి సూటి ప్రశ్న
X

కాక్రోచ్ జనతా పార్టీ అన్నది సోషల్ మీడియా వేదికగా పుట్టిన పార్టీ. ఆ తరువాత నీట్ పేపర్ లీకేజి మీద విద్యార్ధులలో ఉన్న భావోద్వేగాలకు ఒక వేదికగా మారింది. అలా జంతర్ మంతర్ లో సీజేపీ తొలి నిరసన సాగింది. జెన్ జీలు తోడు కావడం, తమ కెరీర్ భవిష్యత్తు కోసం యువత వారి తల్లిదండ్రుల ఆవేదన ఆగ్రహం అనీ కలసి సీజేపీ జంతర్ మంతర్ ఉద్యమాన్ని సూపర్ హిట్ చేశాయి. దాని ఫలితం కూడా ఎవరూ ఊహించని విధంగా వచ్చింది. ఏకంగా కేంద్ర మంత్రి ఒకరు రాజీనామా చేశారు. అంతవరకూ బాగానే ఉంది కానీ ఇపుడు ఓటు చోరీ సర్ ప్రక్రియలో లోపాలు అంటూ విపక్షాలు చేపట్టిన రాజకీయ ఉద్యమం మధ్యలోకి సీజేపీ దూసుకుని వచ్చింది. దాంతో అసలు సీజేపీ మోటివ్ ఏమిటి దాని విధానాలు ఏమిటి అది ఎందుకు ఏర్పాటు అయింది అన్న సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అదే సూటి ప్రశ్న న్యాయ స్థానం నుంచి కూడా సీజేపీకి ఎదురైంది.

ఆలోచించాల్సిందే :

ఇది సీజేపీకి లోతైన ప్రశ్న. తనను తాను విశ్లేషించుకోవాల్సిన అవసరం కల్పించే ప్రశ్న కూడా. సీజేపీ అన్నది ఒక సంస్థనా లేక అసోసియేషన్ నా లేక లక్ష్యం కోసం పనిచేసే విభాగమా ఇలాంటి ప్రశ్నలనే ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎస్ ప్రసాద్ సంధించారు. దీనికి జవాబులు సీజేపీ వద్ద ఉన్నాయో లేవో తెలియదు. కానీ సీజేపీలోని గందరగోళాన్ని ఈ సూటి ప్రశ్న అయితే బయటపెట్టే లాగానే ఉంది అని అంటున్నారు. అవే మనుషులు, కానీ మీ నినాదం మారుతోంది, కారణం మారుతోంది. అలాంటప్పుడు మీరెవరు అని న్యాయమూర్తి కరెక్ట్ గానే అడిగారు అని అంటున్నారు. అంతే కాదు మీ అసోసియేషన్ ఏంటి, అసలు దేని కోసం మీరు పని చేస్తున్నారు, అలాగే మీ మోటివ్ ఏంటి అన్న ప్రశ్నలు కూడా సంధించారు. ఇక సీజేపీ నేతలు రెజీమ్ ఛేంజ్ అంటున్నారు అయితే అది ఓట్ల ద్వారా జరుగుతుందని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. సీజేపీ నేతలు సౌరవ్, అశుతోష్‌ల పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు.

సీజేపీ మధించాల్సిందే :

సీజేపీలో ఈ ప్రశ్నల మీద అంతర్మధనం రావాల్సిందే అని అంటున్నారు. ఎందుకంటే దేశంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటి మీద పోరాటం చేయడానికి ఎటూ రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇక కొన్ని నిర్దిష్టమైన అంశాలను పట్టుకుని ఉద్యమించడానికి ప్రజా సంఘాలు, మేధావులు నిపుణులు ఉన్నారు. సీజేపీ అయితే అటు ప్రజా సంఘాల లెక్కలోకి వస్తోందా లేక రాజకీయ పార్టీల జాబితాలోకి వెళ్తుందా అంటే ఆ సంస్థ నేతలే ఆలోచించాలని అంటున్నారు. నిజానికి రాజకీయ పార్టీగా సీజేపీని మారి పోరాడుతామంటే ఎవరికీ అభ్యంతరం లేదు, కానీ సీజేపీ అలా కాదంటోంది. ఇదే వేదిక మీద అన్ని సమస్యలు ఎత్తుకుంటోంది. జెన్ జీ అంటోంది. రెజీమ్ ఛేంజ్ అంటోంది. కొత్త తరం పడికట్టు పదజాలం వాడుతోంది, చూస్తే గందరగోళంగానే ఇది ఉందని భావించే వారూ ఉన్నారు.

అదే వ్యూహమా :

అయితే సీజేపీ చేస్తోంది రాజకీయ పోరాటమే అన్నది చాలా మందికి అర్ధం అవుతోంది. కానీ తమది రాజకీయ వేదిక కాదు అని సీజేపీ చెబుతోంది. ఇలా ఎందుకు అంటే ఎపుడైతే రాజకీయ వేదికగా సీజేపీ మారుతుందో అపుడే దాని మద్దతు ఏమైనా ఉంటే పూర్తిగా పోతుందన్న కలవరం ఉంది అంటున్నారు. జెన్ జీ అంటూ చెబుతూ వారికి తాము గొంతుకగా పేర్కొంటూ ఏ సమస్య మీదనైనా వీధులకెక్కి పోరాటం చేస్తామన్న తీరులో సీజేపీ ఆలోచిస్తే మాత్రం న్యాయమూర్తి సంధించిన సూటి ప్రశ్నకు ఎప్పటికీ జవాబు చెప్పుకోలేని సంస్థగా మారిపోతుంది. అదే సమయంలో ఈ అయోమయం గందరగోళం మరింతగా కొనసాగితే అసలుకే ఎసరు వచ్చినా రావచ్చు అని కూడా విశ్లేషణలు ఉన్నాయి.