ప్రిస్కిప్షన్ లో డాక్టర్స్ రైటింగ్ పై కోర్టు కీలక వ్యాఖ్యలు!
తాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. డాక్టర్స్ రాసే ప్రిస్కిప్షన్ ని... ‘కోడి కెలికినట్లు ఉంది’ అంటూ రకరకాల జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే!
By: Raja Ch | 1 Oct 2025 12:29 PM ISTతాజాగా ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. డాక్టర్స్ రాసే ప్రిస్కిప్షన్ ని... ‘కోడి కెలికినట్లు ఉంది’ అంటూ రకరకాల జోకులు పేలుతున్న సంగతి తెలిసిందే! ఈ నేపథ్యంలో.. స్పష్టంగా చదవదగిన ప్రిస్కిప్షన్ ఎంత ముఖ్యమైనదో నొక్కిచెప్పే తాజా ఉత్తర్వులను ఇటీవల పంజాబ్, హరియాణా హైకోర్టు వెలువరించింది. దీంతో... ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
అవును... అత్యాచారం, మోసం ఆరోపణలుపై ఓ మహిళ వేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బెయిల్ కోసం వేసిన పిటిషన్ ను పరిశీలించిన జస్టిస్ జస్గుప్రీత్ సింగ్ పురి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ సందర్భంగా... మందుల చీటి స్పష్టంగా చదవగలిగేలా ఉండటం ఓ ప్రాథమిక హక్కు అని చేసిన వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.
వివరాళ్లోకి వెళ్తే... తనకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానని నమ్మించి డబ్బు తీసుకున్నారని, నకిలీ ఇంటర్వ్యూలు నిర్వహించారని, లైంగిక దోపిడీకి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను ఖండిస్తూ... తామిద్దరి మధ్య సమ్మతితో కూడిన సంబంధం ఉందని, డబ్బు వల్ల ఏర్పడిన వివాదంతో ఆమె ఈ కేసు వేశారని నిందితుడు వాదించారు.
ఈ సమయంలో సదరు మహిళను పరీక్షించిన ప్రభుత్వ వైద్యుడు రాసిన మెడికో లీగల్ నివేదికను పరిశీలించిన జస్టిస్ పురి చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కీలకంగా మారాయి. ఇందులో భాగంగా... ఆ రిపోర్ట్ చూస్తే ఏమీ అర్థం కాలేదని.. ఒక్క పదమైనా, అక్షరమైనా చదవగలిగే స్థితిలో లేకపోవడం కోర్టును కలచివేసిందని జస్టిస్ పురి తన ఉత్తర్యుల్లో పేర్కొన్నారు.
ఇదే సమయంలో.. సాంకేతిక పరిజ్ఞానం, కంప్యూటర్లు సులభంగా అందుబాటులో ఉన్న రోజుల్లో కూడా ప్రభుత్వ వైద్యులు ఇప్పటికీ ప్రిస్క్రిప్షన్లను చేతితో రాయడం ఆశ్చర్యకరమని అన్నారు. బహుశా కొంతమంది కెమిస్టులు తప్ప ఎవరూ వాటిని చదవలేరని జస్టిస్ పూరి రాశారు. మెడికల్ కాలేజీల పాఠ్యప్రణాళికలో చేతిరాత పాఠాలు చేర్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.
స్పందించిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్!:
ఈ వ్యవహారంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ భానుశాలి స్పందిస్తూ... ఈ సమస్య పరిష్కారానికి సహాయపడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. నగరాలు, పెద్ద పట్టణాలలో డాక్టర్లు డిజిటల్ ప్రిస్క్రిప్షన్లకు మారినప్పటికీ.. గ్రామీణ ప్రాంతాలు చిన్న పట్టణాలలో ఇంకా ఈ సమస్య ఉందని అన్నారు.
ఇదే సమయంలో... ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని.. రోగులు, మందులషాపుల వాళ్లు చదవగలిగే పెద్ద అక్షరాలతో ప్రిస్క్రిప్షన్లను రాయాలని తాము తమ అసోసియేషన్ సభ్యులకు (3,30,000 మంది) సిఫార్సు చేశామని అన్నారు. అయితే.. రోజుకు ఏడుగురు రోగులను చూసే వైద్యుడు దీన్ని చేయగలడు కానీ రోజుకు 70 మందిని చూసే డాక్టరు చేయలేడని తెలిపారు.
కోర్టులో పిల్ వేసిన తెలంగాణ వాసి!:
2014లో నోయిడా నగరంలో జ్వరం కోసం తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల మరణించిన మూడేళ్ల చిన్నారి గురించి వార్త చదివిన తర్వాత హైదరాబాద్ హైకోర్టులో ఈ మేరకు ప్రజా ప్రయోజన పిటిషన్ దాఖలు చేశానని తెలంగాణ రాష్ట్రంలోని లోని నల్గొండలో ఫార్మసీ నడుపుతున్న వ్యక్తి చెప్పారు!
ఈ నేపథ్యంలో.. 2016లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా.. ప్రతి వైద్యుడు జనరిక్ పేర్లతో ఉన్న మందులను స్పష్టంగా, ప్రాధాన్యంగా పెద్ద అక్షరాలలో సూచించాలి అని ఆదేశించిందని తెలిపారు. ఈ విషయంపై 2020లో భారత ఆరోగ్య సహాయ మంత్రి అశ్విని కుమార్ చౌబే పార్లమెంటులో మాట్లాడుతూ.. ఈ ఆదేశాన్ని ఉల్లంఘించిన వైద్యుడిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని వైద్య అధికారులకు సూచించారు.
