Begin typing your search above and press return to search.

‘సిబిల్’ కేసులో రిజర్వు బ్యాంకుకు టీ హైకోర్టు ఫైనల్ వార్నింగ్

ఇదిలా ఉండగా సిబిల్ సంస్థ పని తీరుపై సందేహాలతో కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు.

By:  Garuda Media   |   29 Jan 2026 9:24 AM IST
‘సిబిల్’ కేసులో రిజర్వు బ్యాంకుకు టీ హైకోర్టు ఫైనల్ వార్నింగ్
X

సూపర్ పవర్ లో ఉన్న వ్యక్తి మొదలు సామాన్యుడి వరకు వారి వ్యక్తిగత ఆర్థిక క్రమశిక్షణ ఎంతలా ఉందన్న విషయాన్ని తేల్చే సిబిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ సంస్థను ప్రైవేటు వర్గాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సిబిల్ స్కోర్ కు సంబంధించి పలు సందేహాల్ని వ్యక్తం చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తమకు సంబంధం లేని పలు అంశాలు తమ సిబిల్ రిపోర్టులో ఉంటున్నాయని.. వీటిపై సదరు సంస్థకు ఫిర్యాదు చేసినా స్పందించటం లేదన్న ఆరోపణల గురించి తెలిసిందే.

ఇదిలా ఉండగా సిబిల్ సంస్థ పని తీరుపై సందేహాలతో కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తున్నారు. తెలంగాణ హైకోర్టులోనూ ఈ కోవకు చెందిన ఒక కేసు విచారణలో ఉంది. సిబిల్ స్కోర్ రిపోర్టులో ప్రజల వ్యక్తిగత డేటా పరిరక్షణకు చర్యలు చేపట్టేలా ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషన్ దాఖలు చేయటం.. దీనిపై విచారణకు హైకోర్టు ఓకే చేయటం తెలిసిందే. అయితే.. ఈ పిటిషన్ కు సంబంధించి భారత రిజర్వు బ్యాంకు, కేంద్ర ఆర్థిక శాఖలు కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది.

కానీ.. ఇప్పటివరకు అవేమీ ఆ పని చేయలేదు. ఈ తీరుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుకు సంబంధించి కౌంటర్ దాఖలు చేసేందుకు ఇదే చివరి ఛాన్సుగా స్పష్టం చేసిన కోర్టు.. కౌంటర్ దాఖలు చేయకుంటే ఫైన్ విధించాల్సి వస్తుందని పేర్కొంది. పిటిషన్ తరఫు న్యాయవాది తన వాదనలను వినిపిస్తూ సిబిల్ పై పారదర్శక, స్వతంత్ర యంత్రాంగం రూపొందించే వరకు క్రెడిట ఇన్ఫర్మేషన్ సేవా కంపెనీలు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. సిబిల్ రూపంలో ప్రచురించి.. దానిని వ్యాప్తి చేయకుండా అడ్డుకోవాలని కోరారు.

ఈ వాదనలు విన్న టీహైకోర్టు ధర్మాసనం స్పందిస్తూ.. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేసినా కేంద్ర ఆర్థిక శాఖ, ఆర్ బీఐలు తమ కౌంటర్ దాఖలు చేయని వైనాన్ని ప్రస్తావించారు. వారికి ఇదే చివరి అవకాశంగా పేర్కొన్న న్యాయస్థానం.. వారు స్పందించకుంటే ఫైన్ వేస్తామని హెచ్చరించారు. హైకోర్టు ఆగ్రహం నేపథ్యంలో ఇప్పటికైనా వారు స్పందిస్తారా? అన్నది ప్రశ్నగా మారింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 17కు వేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.