Begin typing your search above and press return to search.

సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి షాక్.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ నివేదిక

సీనియర్ ఐఏఎస్ వై.శ్రీలక్ష్మికి సీబీఐ షాక్ ఇచ్చింది. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో శ్రీలక్ష్మి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

By:  Tupaki Political Desk   |   6 Dec 2025 1:27 PM IST
సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి షాక్.. తెలంగాణ హైకోర్టులో సీబీఐ నివేదిక
X

సీనియర్ ఐఏఎస్ వై.శ్రీలక్ష్మికి సీబీఐ షాక్ ఇచ్చింది. మాజీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల్లో శ్రీలక్ష్మి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పెన్నా సిమెంట్స్‌కు లీజుల మంజూరులో అప్పటి పరిశ్రమలశాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీలక్ష్మి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, దీనిపై పూర్తి ఆధారాలున్నాయని స్పష్టం చేస్తూ సీబీఐ తెలంగాణ హైకోర్టులో నివేదిక సమర్పించింది. శ్రీలక్ష్మిపై కేసు మూసివేయాలని ఆమె పిటిషన్ వేయగా, ఆమెపై కొనసాగించడానికి అన్ని ఆధారాలు సేకరించామని సీబీఐ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వు చేస్తూ కేసును 11వ తేదీకి వాయిదా వేసింది.

శ్రీలక్ష్మి పిటిషన్ పై అభ్యంతరం వ్యక్తం చేసిన సీబీఐ, ఇప్పటికే నిర్ధారించిన అంశాలపై మళ్లీ పిటిషన్‌ వేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెన్నా సిమెంట్స్‌కు చెందిన పెన్నా ప్రతాప్‌రెడ్డికి అనంతపురం జిల్లా యాడికిలో 231 ఎకరాలు భూములు కేటాయించారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం కౌలపల్లిలో 304.70 హెక్టార్లలో ప్రాస్పెక్టింగ్‌ లీజు మంజూరు చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా తాండూరులో 822.13 ఎకరాల్లో లీజు రెన్యువల్‌ చేశారు. వీటితోపాటు హైదరాబాద్‌లో పయనీర్‌ హోటళ్ల నిర్మాణాలకు రాయితీలు మంజూరు చేశారు. వీటిన్నటిలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని, అప్పటి పరిశ్రమల కార్యదర్శి శ్రీలక్ష్మిపై కేసులు నమోదు అయ్యాయి.

పెన్నా సిమెంట్స్ కు మేలు చేసినందుకు గాను అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుమారుడైన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి చెందిన కంపెనీల్లో ప్రతాప్‌రెడ్డి రూ.68 కోట్లు పెట్టుబడులు పెట్టినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. దీనిపై చాలాకాలంగా విచారణ కొనసాగుతోంది. ఇందులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిని .శ్రీలక్ష్మి తన పై ఉన్నా కేసును కొట్టివేయాలంటూ గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతుండగా, సీబీఐ శ్రీలక్ష్మికి వ్యతిరేకంగా నివేదిక సమర్పించడం చర్చనీయాంశం అవుతోంది.

గురువారం శ్రీలక్ష్మి పిటిషన్ పై జస్టిస్ జూకంటి అనిల్ కుమార్ విచారణ జరిపారు. సీబీఐ ప్రత్యేక న్యాయవాది శ్రీనివాస్ కపాటియా తన వాదనలు వినిపిస్తూ చార్జిషీటు కాగ్నిజెన్స్ తీసుకుంటూ సీబీఐ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ శ్రీలక్మి గతంలోనే పిటిషన్ దాఖలు చేశారని ఎత్తిచూపారు. ఇరుపక్షాల వాదనలు పూర్తయి తీర్పు రిజర్వు అయిన తరువాత ఉపసంహరించుకున్నారని అన్నారు. అంటే అవే తుది ఉత్తర్వులని మళ్లీ అదే కాగ్నిజెన్స్ ఉత్తర్వులను సవాలు చేస్తూ మళ్లీ పిటిషన్ వేయడానికి వీలు లేదన్నారు. ప్రాసిక్యూషన్ అనుమతిస్తూ కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులపై అభ్యంతరాలు ఉంటే కింది కోర్టులో తేల్చుకోవాలని స్పష్టం చేశారు. శ్రీలక్ష్మి పిటిషన్ కొట్టివేయాలని కోరారు.

ఇక నిందితురాలు శ్రీలక్ష్మి తరఫున సీనియర్ న్యాయవాిది వివేక్ రెడ్డి వాదనలు వినిపిస్తూ గత పిటిషనులో వాదనలు పూర్తయ్యాక ప్రాసిక్యూషన్ కు అనుమతి మంజూరైందని, ఇదే విషయాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకువెళ్లి పిటిషన్ ను ఉపసంహరించుకుని మళ్లీ దాఖలు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అవినీతి నిరోధక చట్టం కింద మాత్రమే అనుమతి ఉందన్నారు. ఐపీసీ కింద అభియోగాలపై విచారణకు అనుమతి మంజూరు కాలేదన్నారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయమూర్తి ఉత్తర్వుల నిమిత్తం ఈ కేసు విచారణను ఈ నెల 11వ తేదీకి వాయిదా వేశారు.