Begin typing your search above and press return to search.

బ్రిజ్ భూషణ్‌ ను నిర్ధోషిగా ప్రకటించిన కోర్టు.. వ్యవస్థ అతడిని రక్షిస్తోంది అన్న వినేశ్ ఫొగాట్

దాదాపు మూడేళ్లుగా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ వ్యవహారంలో ఈ తీర్పు ఒక కీలక పరిణామంగా మారింది.

By:  A.N.Kumar   |   3 Aug 2026 3:52 PM IST
బ్రిజ్ భూషణ్‌ ను నిర్ధోషిగా ప్రకటించిన కోర్టు..  వ్యవస్థ అతడిని రక్షిస్తోంది అన్న వినేశ్ ఫొగాట్
X

మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు, బీజేపీ నేత బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. ఈ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. దాదాపు మూడేళ్లుగా దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపిన ఈ వ్యవహారంలో ఈ తీర్పు ఒక కీలక పరిణామంగా మారింది.

మూడేళ్ల సుదీర్ఘ వివాదం.. జంతర్ మంతర్ వద్ద నిరసనలు

2023 ప్రారంభంలో ప్రముఖ ఒలింపియన్లు వినేశ్ ఫొగాట్, సాక్షి మాలిక్, బజరంగ్ పునియాతో పాటు పలువురు మహిళా రెజ్లర్లు బ్రిజ్ భూషణ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తమపై మానసికంగా, లైంగికంగా వేధింపులకు పాల్పడ్డారని పేర్కొంటూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నెలల తరబడి భారీ ఆందోళనలు నిర్వహించారు. ఈ నిరసనలు క్రీడా రంగాన్నే కాకుండా.. దేశ రాజకీయాలను సైతం తీవ్రంగా కుదిపేశాయి. ఆ సమయంలో పోలీసులు బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరిపి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు.

కోర్టు తీర్పుపై వినేశ్ ఫొగాట్ తీవ్ర ఆగ్రహం

తీర్పు అనంతరం ఒలింపియన్ వినేశ్ ఫొగాట్ తన తీవ్ర అసంతృప్తిని, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యవస్థ మొత్తం బ్రిజ్ భూషణ్‌ను కాపాడేందుకే పనిచేస్తోందని ఆమె విమర్శించారు. "న్యాయవ్యవస్థపై మాకు నమ్మకం ఉంది, కానీ ఈ తీర్పు మమ్మల్ని తీవ్రంగా నిరాశపరిచింది. వ్యవస్థ బ్రిజ్ భూషణ్‌ను రక్షిస్తోంది. అయినప్పటికీ మహిళా రెజ్లర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గరు. న్యాయం జరిగే వరకు మా పోరాటం కొనసాగుతుంది." అని వినేశ్ ఫొగాట్ స్పష్టం చేశారు. ఈ కేసు ఇంతటితో ముగియలేదని.. అవసరమైతే హైకోర్టును ఆశ్రయిస్తామని ఆమె స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

సత్యమే గెలిచిందన్న బ్రిజ్ భూషణ్

మరోవైపు కోర్టు తీర్పుపై బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తీవ్ర సంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ కేవలం రాజకీయ ప్రేరేపితమైనవని, నిరాధారమైనవని ఆయన పునరుద్ఘాటించారు. కష్టకాలంలో తనకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ, న్యాయవ్యవస్థకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ముందుముందు మరో న్యాయపోరాటం?

కోర్టు తీర్పుతో బ్రిజ్ భూషణ్‌కు తాత్కాలికంగా ఉపశమనం లభించినప్పటికీ, బాధితులు, రెజ్లర్లు పైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ వివాదం త్వరలోనే హైకోర్టు మెట్లు ఎక్కే అవకాశం ఉందన్ని, మరో విడత సుదీర్ఘ న్యాయపోరాటం తప్పదని క్రీడా, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.