ఫోక్సో కేసులో బాధితురాలిని వివాహం చేసుకుంటే.. హైకోర్టు షాకింగ్ కామెంట్స్!
ఫోక్సో కేసు గురించి దాదాపు అందరికీ తెలిసిందే. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి ఈ చట్టం ద్వారా శిక్షలు భారీగా ఉంటాయి.
By: Raja Ch | 1 Oct 2025 9:46 AM ISTఫోక్సో కేసు గురించి దాదాపు అందరికీ తెలిసిందే. మైనర్ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడినవారికి ఈ చట్టం ద్వారా శిక్షలు భారీగా ఉంటాయి. అయితే... వీటికి సంబంధించిన చాలా వ్యవహారాల్లో రాజీ ప్రయత్నాలు.. లేదా, బాధితురాలిని వివాహం చేసుకోవడాలు వంటివి జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
అవును... మైనర్ బాలికను వివాహం చేసుకున్నా, ఆ దంపతులకు పిల్లలు పుట్టినా కూడా పోక్సో చట్టం కింద నమోదైన అత్యాచారం కేసుల నుంచి నిందితుడికి ఎలాంటి విముక్తీ లభించదని బాంబే ఉన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తొలుత దారుణానికి ఒడిగట్టి, అనంతరం బాధితురాలిని చేసుకున్నంత మాత్రాన ఆ చట్టం కింద శిక్షను తప్పించుకోలేరని స్పష్టం చేసింది.
మహారాష్ట్రలోని అకోలాకు చెందిన 29 ఏళ్ల యువకుడు 17 బాలికపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బాలిక తల్లితండ్రులకు తెలియడంతో అతడితోపాటు, అతడి కుటుంబసభ్యులపైనా పోలీసు కేసు నమోదైంది! అనంతరం అతడు ఆ బాలికను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ బిడ్డ కూడా పుట్టాడు. ఈ నేపథ్యంలో కేసు రద్దుకు సదరు బాలిక అంగీకరించింది.
ఈ సమయంలో.. తనపై నమోదైన రేప్ కేసును రద్దు చేయాలని కోరుతూ అతడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే.. ఈ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. 17 ఏళ్ల బాలికతో తనది సమ్మతితో కూడిన సంబంధం అని, ఆమెకు 18 ఏళ్లు నిండిన తర్వాతే వివాహం చేసుకున్నామని నిందితుడు వాదించినా కోర్టు పరిగణలోకి తీసుకోలేదు!
కాగా... బాధితురాలిని వివాహం చేసుకుంటానని పోక్సో చట్టం కింద ఉన్న కేసు నుంచి ఉపశమనం కావాలని కోరిన వ్యక్తి అభ్యర్థనను గతంలో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఇరు పక్షాల మధ్య కుదిరిన రాజీని తిరస్కరించిన జస్టిస్ వీరేందర్ సింగ్.. అలాంటి సెటిల్ మెంట్ ను అంగీకరించడం వల్ల ఇలాంటి దుర్మార్గమైన నేరాలకు పాల్పడే నేరస్థులను ప్రోత్సహించడంగా మారుతుందని అభిప్రాయపడ్డారు.
