Begin typing your search above and press return to search.

బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్‌!

తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ ప్రధాన చర్చగా మారింది.

By:  A.N.Kumar   |   16 Oct 2025 2:30 PM IST
బీసీ రిజర్వేషన్లు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు షాక్‌!
X

తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల అంశం మళ్లీ ప్రధాన చర్చగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినా, ఆ నిర్ణయానికి న్యాయపరంగా పెద్ద ఆటంకం ఎదురైంది. హైకోర్టు తర్వాత సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర దెబ్బతిన్నట్టైంది.

చట్టపరమైన అడ్డంకులు – న్యాయపరంగా వెనకడుగు

ప్రభుత్వం మొదట శాసనసభలో బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించి, గవర్నర్ ఆమోదం తీసుకుంది. అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. కానీ, హైకోర్టు ఆ నిర్ణయాన్ని నిలిపివేయడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టులో కూడా అదే ఫలితం రావడంతో కాంగ్రెస్ నేతలకు తల ఎత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది.

వాస్తవానికి భారత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు. తమిళనాడులో మాత్రం ప్రత్యేక పరిస్థితుల కారణంగా మినహాయింపు ఉంది. తెలంగాణలో బీసీ జనాభా అధికంగా ఉన్నా, చట్టపరంగా 42 శాతం రిజర్వేషన్ ఇచ్చే అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

రాజకీయ ప్రతిస్పందన – రేవంత్ రెడ్డి ముందున్న సవాలు

ఈ పరిణామాలతో కాంగ్రెస్‌కి రాజకీయంగా గట్టి దెబ్బ తగిలింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ, న్యాయనిపుణులతో గంటలకొద్దీ చర్చించినా ఫలితం రాలేదు. ఇప్పుడు పార్టీ లోపల, వెలుపల రేవంత్ నాయకత్వంపై ప్రశ్నలు లేవుతున్నాయి.

సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన వెంటనే ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్‌) ప్రభుత్వం బీసీలను మోసం చేసిందని తీవ్ర విమర్శలు ప్రారంభించింది. ఈ విమర్శలకు ఎదురుగా రేవంత్ ప్రభుత్వం ఇప్పుడు కొత్త వ్యూహం ఆలోచిస్తోంది.

‘పార్టీ పరంగా’ రిజర్వేషన్లు.. కొత్త మార్గం?

చట్టపరంగా సాధ్యం కాని స్థితిలో, రేవంత్ రెడ్డి పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వాలని యోచిస్తున్నారని సమాచారం. అంటే, కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల టికెట్ల కేటాయింపులో 42 శాతం బీసీ అభ్యర్థులకు ఇవ్వాలన్న ఆలోచనలో ఉందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనపై కేబినెట్‌లో చర్చించి, ముఖ్యమంత్రి త్వరలో కీలక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

అయితే, ఈ నిర్ణయం మిగతా సామాజిక వర్గాలకు నచ్చుతుందా, లేక అంతర్గత అసంతృప్తి కలిగిస్తుందా అన్నది చూడాలి.

బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొన్న ఈ షాక్ రాజకీయంగా కీలక మలుపుగా మారింది. న్యాయపరంగా వెనకడుగు వేసినా, రాజకీయంగా ముందడుగు వేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఈ నిర్ణయం బీసీల విశ్వాసాన్ని నిలబెడుతుందా, లేక కాంగ్రెస్‌కు మరోసారి ఇబ్బందులు తెస్తుందా — అనేది రానున్న రోజుల్లో తేలనుంది.

*తెలంగాణ ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు ఏంటి?

బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏ దిశలో ముందుకు సాగబోతోందనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం పాస్ చేసిన బిల్లుపై గవర్నర్ ఆమోదం కోసం ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూసే వ్యూహం కూడా పరిశీలనలో ఉంది. హైకోర్టు “రిజర్వేషన్లు 50 శాతం పరిమితిలోనే ఉండాలి” అని తీర్పు ఇస్తే, ఆ నిర్ణయంపై ప్రభుత్వం మరోసారి సమీక్ష చేపట్టి, ఆ తరువాతే ఎన్నికల దిశగా అడుగులు వేయవచ్చు. అయితే, ఈ ప్రక్రియలో ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమయ్యే అవకాశం ఉన్నదని అంచనా. అలాంటి పరిస్థితిలో రాజకీయ పరంగా బీసీ వర్గాలను సమతుల్యం చేయడానికి పార్టీ 42 శాతం పదవులు ఇవ్వడం ద్వారా వారిని బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది.