బ్రేకింగ్.. తెలంగాణ స్థానిక ఎన్నికలు.. బీసీ రిజర్వేషన్ పై స్టే
ఓవైపు ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండగానే.. మరోవైపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం మరో మలుపు తిరిగింది.
By: Tupaki Political Desk | 9 Oct 2025 4:54 PM ISTఓవైపు ఎన్నికలకు సన్నాహాలు జరుగుతుండగానే.. మరోవైపు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం మరో మలుపు తిరిగింది. రెండు రోజులు.. బుధ, గురువారాల్లో సుదీర్ఘ వాదనల అనంతరం గురువారం తెలంగాణ హైకోర్టు స్టే ఇచ్చింది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 9 జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కొందరు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం జీవో అమలును నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కౌంటర్లపై అభ్యంతరాల దాఖలుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. తర్వాతి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది. రెండు రోజుల వాదనలో అటు ప్రభుత్వం, ఇటు పిటిషనర్ల తరఫున న్యాయవాదులు సుదర్ఘీ వాదనలు వినిపించారు.
57 శాతం జనాభాకు 42 శాతం రిజర్వేషన్లు..
తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) సుదర్శన్ రెడ్డి వాదిస్తూ తెలంగాణలో బీసీ జనాభా 57.6 శాతం అని వారికి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. బీసీల్లో రాజకీయ వెనుకబాటుతనం ఉందని, దానిని నివారించేందుకే ఈ రిజర్వేషన్ అని పేర్కొన్నారు. బీసీ కులగణనకు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసిన సంగతిని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం తర్వాత సమగ్ర కుల గణన సర్వే తెలంగాణలోనే జరిగిందన్నారు. దీనిపై ఎవరికీ అభ్యంతరాలు లేని విషయాన్ని ప్రస్తావించారు.
కాగా, న్యాయవాది రవివర్మ వాదిస్తూ 50 శాతం రిజర్వేషన్లపై రాజ్యాంగంలో 50 శాతం పరిమితి లేని విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ జనాభాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 85 శాతం ఉన్నారని.. ఈ జనాభా మొత్తానికి 67 శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని తెలిపారు. మిగిలిన 15 శాతం జనాభాకు 33 శాతం రిజర్వేషన్ ఓపెన్ కోటాలోనే ఉందని వివరించారు. అయితే, వాదనల అనంతరం జీవో నంబర్ 9పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కాగా, హైకోర్టు తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు అవకాశం ఉంది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం సుప్రీం కోర్టు తలుపు తట్టనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో నంబర్ 9పై స్టే ఇచ్చినందున.. స్థానిక సంస్థల ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం జరిగితే 2018 నాటి పంచాయతీరాజ్ చట్టం రిజర్వేషన్ వర్తిస్తుందని తెలుస్తోంది.
