Begin typing your search above and press return to search.

మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. జగన్ పార్టీ తొలి విజయం!

ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

By:  Tupaki Political Desk   |   21 Oct 2026 12:41 PM IST
మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. జగన్ పార్టీ తొలి విజయం!
X

ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నామినేషన్ల సందర్భంగా హింసాత్మక ఘటనలు నమోదైన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల గడువును మరో 48 గంటలు పెంచాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువు పెంపుపై వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. హింస జరిగిన మున్సిపాలిటీల్లో నామినేషన్‌లకు 48 గంటల అదనపు సమయం ఇవ్వాలని, రేపటిలోగా (అక్టోబర్ 22) నిర్ణయం తీసుకోవాలని ఏపీ ఎన్నికల సంఘాన్ని (SEC) సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిణామం కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఈ నెల 30న జరిగే మున్సిపల్ ఎన్నికలకు 16వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లు స్వీకరించిన విషయం తెలిసిందే. మొత్తం 100 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగియగా, ఈ రోజు సాయంత్రం వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఇచ్చారు. అంటే ఈ రోజు సాయంత్రానికి అభ్యర్థుల తుది జాబితా ప్రకటించాల్సి వుంది. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.

రాష్ట్రంలో 19 మున్సిపాలిటీల్లో ఎన్నికల ప్రక్రియను సవాల్ చేస్తూ విపక్షం వైసీపీ కోర్టును ఆశ్రయించింది. తమ అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని ఫిర్యాదు చేసింది. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టులో సానుకూల నిర్ణయం రాకపోవడంతో వైసీపీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైసీపీ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఫిర్యాదులు అందిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్‌లకు గడువు పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఉత్తర్వులపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ రోజే నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలిచ్చింది. అంతేకాకుండా జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లు నామినేషన్లు తీసుకోవాలని సూచనలు జారీ చేసింది. ఈ నెల 25వరకు అభ్యర్థుల తుది జాబితా ప్రకటించొద్దని స్పష్టం చేసింది.

వైసీపీ పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించింది. హింస జరుగుతున్నప్పుడు లా అండ్ అర్డర్ అదుపు తప్పినప్పుడు నామినేషన్లు వేయడానికి ఎవరు వస్తారంటూ ప్రశ్నించింది. కాగా, ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకుంటూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్వర్వులు హాట్ టాపిక్ అవుతున్నాయి. దీంతో ఏకగ్రీవం అనుకున్న మున్సిపాలిటీలకు మళ్లీ నామినేషన్లు దాఖలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయని అంటున్నారు.

సుప్రీంకోర్టు ఉత్తర్వులు వైసీపీ శ్రేణులకు ఉత్సాహాన్ని ఇచ్చాయని అంటున్నారు. ప్రధానంగా పార్టీ అధినేత జగన్మోహనరెడ్డి సొంత జిల్లా, సొంత నియోజకవర్గంలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం లేకపోవడంపై వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ విషయంలో ఆ పార్టీ చేసిన న్యాయపోరాటానికి కోర్టులు దన్నుగా నిలవడంతో వైసీపీ శ్రేణులకు ధైర్యం వచ్చిందని అంటున్నారు. ఇది వైసీపీకి నైతిక విజయమని, ఎన్నికల్లో పోరాడేందుకు మరింత శక్తి వచ్చినట్లు అయిందని అంటున్నారు.