Begin typing your search above and press return to search.

వైసీపీ పిటిషన్ డిస్మిస్...40 లక్షల ఓట్లు అంటూ ?

ఏపీలో సర్ ప్రక్రియ జరుగుతోందని, తుది ఓటర్ల జాబితా వచ్చేంతవరకూ ఎన్నికలు జరపవద్దు అని వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని హైకోర్టు విచారించి తీర్పుని రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే

By:  Satya P   |   1 Oct 2026 11:35 AM IST
వైసీపీ పిటిషన్ డిస్మిస్...40 లక్షల ఓట్లు అంటూ ?
X

వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ని హైకోర్టు డిస్మిస్ చేస్తూ తీర్పు వెలువరించింది. ఏపీలో సర్ ప్రక్రియ జరుగుతోందని, తుది ఓటర్ల జాబితా వచ్చేంతవరకూ ఎన్నికలు జరపవద్దు అని వైసీపీ తరఫున ఆ పార్టీ ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ని హైకోర్టు విచారించి తీర్పుని రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 1న కోర్టు తన తీర్పుని వెలువరిస్తూ వైసీపీ అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఆ పిటిషన్ ని డిస్మిస్ చేసింది. దాంతో వైసీపీ శిబిరం ఇపుడు ఏమి చేస్తుంది అన్నదే చర్చగా మారింది.

సర్ ప్రక్రియ పూర్తి చేశాకనే :

వైసీపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నది ఏంటి అంటే సర్ ప్రక్రియ పూర్తి చేశాకనే ఎన్నికలు పెట్టమని. తాజాగా వచ్చే ఓటర్ల జాబితాతో ఎన్నికలకు వెళ్లాలని. సర్ ప్రక్రియలో భాగంగా ఏపీలో నలభై లక్షల దాకా ఓట్లు గల్లంతు అయ్యాయని నివేదికలు ఆధారం చేసుకుని మరీ వైసీపీ తన పిటిషన్లో పేర్కొంది. ఈ ఓటర్లు అంతా డబుల్ ఎంట్రీలుగా, ఏపీని శాశ్వతంగా వీడి వెళ్లిన వారుగా మృతులుగా ఉన్నారని వైసీపీ చెప్పుకొస్తోంది. అలాంటి వారి జాబితాతో ఎన్నికలు పెడితే నలభై లక్షల ఓట్లూ మళ్లీ కలసిపోయి ఫలితాలలో పారదర్శకత ఉండదని వైసీపీ వాదిస్తోంది. దీని మీద కోర్టుకు వెళ్లినా డిస్మిస్ చేయడంతో ఇపుడు వైసీపీ శిబిరం అయితే ఆలోచనల్లో పడిపోయింది అని అంటున్నారు. దీని మీద ఆ పార్టీ ఏమి చేస్తుంది అన్నది అయితే చూడాల్సి ఉంది.

ద్వంద్వ వైఖరినా :

అయితే సర్ ప్రక్రియతో పూర్తి అయిన ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు పెట్టాలని ఒక వైపు కోర్టుని వైసీపీ ఆశ్రయించినా మరో వైపు సర్ ప్రక్రియలోనే ఎక్కువ అర్హులైన ఓట్లు పోయాయన్న వాదనలతో ఏకీభవిస్తోంది. ఈ మధ్యనే వైసీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్ లో కూడా ఏపీలో సర్ ప్రక్రియ సజావుగా సాగలేదని ఆరోపించారు. కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ నిర్ణయాలపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు అసమ్మతి వ్యక్తం చేసినట్లు వచ్చిన కథనాల నేపథ్యంలో ఆయన స్పందిస్తూ ఈ మేరకు చేసిన ట్వీట్ లో సర్ ప్రక్రియ మీద పలు సందేహాలను వ్యక్తం చేశారు. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని వాడుకుంటూ వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఓట్లను ఓటర్ల జాబితా నుండి తొలగించడానికి ప్రయత్నిస్తోందని ఇది ప్రజాస్వామ్య ప్రక్రియకు విరుద్ధమని జగన్ ఆరోపించారు. ఈ విధంగా రెండు విధాలుగా వైసీపీ తీరు ఉండడం మీద టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా మండిపడ్డారు.

రెడీ కావాల్సిందేనా :

ఉన్నత న్యాయ స్థానం వైసీపీ అభ్యంతరాలను పక్కన పెట్టి పిటిషన్ డిసిమిస్ చేసిన నేపథ్యంలో ఇక ఎన్నికలకు ఆ పార్టీ సిద్ధం కావాల్సిందే అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఇదే అంశం మీద వైసీపీ అధినాయకత్వం పార్టీ నాయకులతో చర్చిస్తుందని అంటున్నారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసులో జగన్ ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ మేరకు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి అని అంటున్నారు. ఎన్నికలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం భావిస్తున్నందువల్ల వైసీపీ కూడా పాలుపంచుకోవడానికే ముందుకు రావాల్సి ఉంటుందని అంటున్నారు.