Begin typing your search above and press return to search.

‘టానిక్’ వివాదం.. హై కోర్టు కీలక తీర్పు..

వ్యాపార రంగంలో బ్రాండ్ అనేది కేవలం పేరు మాత్రమే కాదు. అది కస్టమర్ల విశ్వాసానికి ప్రతీక.

By:  Tupaki Political Desk   |   30 Sept 2025 2:00 PM IST
‘టానిక్’ వివాదం.. హై కోర్టు కీలక తీర్పు..
X

వ్యాపార రంగంలో బ్రాండ్ అనేది కేవలం పేరు మాత్రమే కాదు. అది కస్టమర్ల విశ్వాసానికి ప్రతీక. ఒక ఉత్పత్తి మార్కెట్లో నిలబడేందుకు నాణ్యతతో పాటు గుర్తింపు కూడా ముఖ్యమే. ఒక బ్రాండ్ పేరు కాపీ చేస్తే, వినియోగదారుడు మోసపోవడమే కాకుండా కంపెనీకి ఆర్థిక నష్టం కలుగుతుంది. అందుకే భారతీయ చట్టాలు ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు వ్యతిరేకంగా కఠిన నిబంధనలు తీసుకువచ్చాయి.

దాఖలైన పిటిషన్..

బ్రాండ్ విలువ, ట్రేడ్‌మార్క్ రక్షణ ఎంత ప్రాముఖ్యతను సంతరించుకుందో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు రుజువు చేసింది. టానిక్ (TONIQUE) పేరుతో మూడు రాష్ట్రాల్లో లిక్కర్ విక్రయాలు నిర్వహిస్తున్న ఎలైట్ స్టోర్ బ్రాండ్ తమ ఒరిజినల్ ట్రేడ్‌మార్క్‌ను కాపీ చేస్తూ ద టానిక్ (The Tonic) పేరుతో నెల్లూరులో మద్యం విక్రయాలు చేస్తుందని కోర్టులో పిటిషన్ దాఖలైంది.

స్పష్టమైన ఆదేశాలిచ్చిన హై కోర్టు..

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. టానిక్ అనే ట్రేడ్‌మార్క్‌ను ఎవరూ వాడకూడదని, దానికి సమానంగా లేదా కాపీగా ఉన్న పేర్లతో మార్కెటింగ్‌ చేయవద్దని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా నెల్లూరులో ద టానిక్ పేరుతో లిక్కర్ అమ్మకాలు జరుగుతుండడం గమనార్హమని, ఇది స్పష్టమైన ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన అని హైకోర్టు స్పష్టం చేసింది. అందువల్ల ఆ ప్రాంతంలో ఉన్న అన్ని హోర్డింగులు, ఫ్లెక్సీలు వెంటనే తొలగించాలని ఆదేశించింది. టానిక్ కేసు బ్రాండ్ కు విలువను ప్రతిబింబిస్తోంది. దశాబ్దాలుగా మార్కెట్లో బలమైన గుర్తింపు సంపాదించుకున్న ఒక బ్రాండ్‌ను అనుకరిస్తే, అది కేవలం వ్యాపార నైతికతకు విరుద్ధం మాత్రమే కాదు, చట్టపరమైన నేరం అవుతుంది.

ప్రాధాన్యత సంతరించుకున్న కోర్టు తీర్పు

ఏపీ హైకోర్టు వెలువరించిన ఈ తీర్పు కేవలం టానిక్ లిక్కర్ బ్రాండ్‌కే పరిమితం కాదు. ఇది సమాజంలో అన్ని వ్యాపారాలకు ఒక సందేశం. ట్రేడ్‌మార్క్ హక్కులను గౌరవించకపోతే కఠిన చర్యలు తప్పవని, చట్టాన్ని ఎవరూ తప్పించుకోలేరని హైకోర్టు తెలిపింది. చిన్న వ్యాపారాలు, పెద్ద సంస్థలు అన్న తేడా లేకుండా ప్రతిఒక్కరూ బ్రాండ్ హక్కులను గౌరవించడం అవసరం ఉందని తీర్పును చూస్తే అర్థం అవుతుంది.

బ్రాండ్ పేరు కాపీనా.. సహించం..

ఒక బ్రాండ్ పేరు కాపీ చేస్తే.. వినియోగదారులు కూడా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. టానిక్ (TONIQUE) అనే ఒరిజినల్ బ్రాండ్ నాణ్యతను నమ్మి కొనే వినియోగదారులు ద టానిక్ (The Tonic) అనే పేరుతో అమ్మే ఉత్పత్తులను కూడా అదే స్థాయి నాణ్యతగా భావించవచ్చు. అందుకు ఆస్కారం లేకపోలేదు. ఇది కేవలం వ్యాపార సమస్య మాత్రమే కాదు, వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమస్య కూడా.. అందువల్ల ఇలాంటి కేసులు వినియోగదారుల ప్రయోజనాలను కూడా కాపాడుతున్నాయి.

వ్యాపార సంస్థలకు గట్టి మెసేజ్..

హై కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఒక ముఖ్యమైన సందేశం ఇచ్చింది. బ్రాండ్ విలువలకు కాపలాదారీగా నిలిచింది. వ్యాపారంలో విశ్వసనీయత అనేది ప్రధాన మూలధనం. ఆ విశ్వసనీయత కేవలం బ్రాండ్ వల్లనే వస్తుంది. నకిలీ పేర్లతో కష్టమర్లను, బ్రాండ్లను మోసగించాలనే ప్రయత్నం ఎంతకాలం కొనసాగదు. ఇలాంటి వాటిపై చట్టం కఠినంగా స్పందిస్తుందని ఈ తీర్పు స్పష్టం చేసింది. ఈ ఘటన అన్ని రంగాల వ్యాపారాలకు హెచ్చరికగా మారాలి.