Begin typing your search above and press return to search.

చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !

చంద్రబాబుపై గతంలో సీఐడీ నమోదు చేసిన కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతూ దాఖలైన పిల్‌పై ఏపీ హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. సీఐడీ క్లోజర్ రిపోర్టులను పిటిషనర్ సవాల్ చేస్తూ, స్వతంత్ర దర్యాప్తు కోసం కేసులను సీబీఐకి బదిలీ చేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గీ పిల్‌ను వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను నవంబర్ 10కి వాయిదా వేసింది.

By:  Satya P   |   6 Nov 2026 9:17 AM IST
చంద్రబాబు మీద కేసులు.... సీబీఐకి అప్పగించాలి !
X

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీద సీఐడీ గతంలో విచారించిన కేసులను సీబీఐకి అప్పగించాలని కోరుతో ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టులో గురువారం వాదనలు జరిగాయి. బాబు అధికారంలో లేనపుడు ఆయన మీద సీఐడీ కేసులు నమోదు చేసింది అని అయితే ఇపుడు ప్రభుత్వం మారింది కాబట్టి బాబు సీఎం గా ఉండడంతో ఆయన మీద పెట్టిన కేసులు అన్నీ నీరు కారిపోతాయని పేర్కొంటూ కొట్టి బాలగంగాధర తిలక్ పిల్ ని దాఖలు చేశారు. దీని మీద హైకోర్టులో ఇరు పక్షాల వాదనలు విన్న తరువాత ఈ విచారణను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నేతృత్వంలోని ధర్మాసనం నవంబర్ 10వ తేదీకి వాయిదా వేసింది.

పిల్ లో ఏముంది :

బాబు మీద గతంలో అంటే వైసీపీ హయాంలో సీఐడీ కేసులు నమోదు చేసింది. వాటిలో ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూముల బదలాయింపు కేసు ఒకటి అయితే ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ టెండర్లలో అవకతవకలు అని ఆరోపణలతో మరొకటి, ఏపీలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ భూసేకరణ, 2014 నుంచి 2019 మధ్యలో ఎక్సైజ్ పాలసీ నిర్ణయాలు, ఉచిత ఇసుక విధానం రూపకల్పన వంటి కీలకమైన అంశాలలో సీఐడీ ఆనాడు కేసులను నమోదు చేసింది అని పిల్ లో గుర్తు చేశారు. అయితే ఈ పిల్ విచారణలో ఉండగానే పలు కేసులను వాస్తవ దోషాలుగా పరిగణించి సీఐడీ మూసివేయడాన్ని ఈ సందర్భంగా పిటిషనర్ సవాల్ చేశారు. సీఐడీ రాష్ట్ర ప్రభుత్వం నియంత్రంలో ఉంటుంది అని అందుకే ఈ కేసులలో ఫిర్యాదుదారులుగా ఉన్నది ప్రభుత్వ అధికారులేనని కానీ చంద్రబాబు అధికారంలో ఉండటంతో వారు కేసుల మూసివేత నివేదికలను సవాలు చేయడానికి ముందుకు రావడం లేదని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది రంజిత్ కోర్టు దృష్టికి తెచ్చారు.

అందుకే సీబీఐకి

ఏపీలో సీఐడీ స్వతంత్రంగా వ్యవహరించలేకపోతోంది కాబట్టి సీబీఐకి ఈ కేసులను అప్పగించాలని పిటిషనర్ తరఫున వాదనలు వినిపించారు. అంతే కాదు దర్యాప్తు సమయంలో స్వాధీనం చేసుకున్న పత్రాలు ఎలక్ట్రానిక్ పరికరాలను సంబంధిత వ్యక్తులకు తిరిగి ఇవ్వకుండా విజయవాడ ఏసీబీ కోర్టును ఆదేశించాలని కోరుతూ ఒక మధ్యంతర పిటిషన్‌ను కూడా ఇదే సందర్భంలో దాఖలు చేశారు. నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా విచారణ జరిపించాలన్నదే పిటిషనర్ కోరిక అని కోర్టుకు సీనియర్ న్యాయవాది రంజిత్ తెలిపారు. కేసు స్టేటస్ చార్ట్ ప్రకారం చూస్తే ఇప్పటికే అనేక కేసుల్లో సీఐడీ క్లోజర్ రిపోర్టులు దాఖలు చేసిందని ఇక వాటిని కోర్టులు సైతం ఆమోదించాయని ప్రస్తావించారు.

కోర్టులకే అధికారం :

ఇక ఆయా పరిస్థితులను బట్టి దర్యాప్తును ఆదేశించే అధికారం రాజ్యాంగబద్ధమైన కోర్టుగా హైకోర్టుకు ఉందని సీనియర్ న్యాయవాది రంజిత్ వాదించారు. అంతే కాదు నిర్దోషిగా తేలిన తర్వాత కూడా లేదా నిష్పాక్షిక విచారణ కోసం కేసును సీబీఐకి బదిలీ చేయవచ్చని వాదించారు. ప్రభుత్వం తరఫున సీఐడీ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీఈ పిల్‌ను కొట్టివేయాలని కోర్టుని కోరారు. చంద్రబాబుపై నమోదైన కేసుల్లో తగిన ఆధారాలు లభించలేదని ప్రత్యేక దర్యాప్తు బృందం విజయవాడ ఏసీబీ కోర్టులో తుది నివేదికలు దాఖలు చేసిందని ఆయన తెలిపారు.