బెయిల్ రద్దు : డ్రైవర్ హత్య కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు షాక్
డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దు చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది.
By: Tupaki Political Desk | 13 May 2026 1:11 PM ISTడ్రైవర్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు బెయిల్ రద్దు చేస్తూ ప్రత్యేక కోర్టు తీర్పునిచ్చింది. బెయిలు షరతులకు విరుద్ధంగా సాక్ష్యులను బెదిరించారనే కారణంతో ఆయన బెయిలును రద్దు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. దీంతో హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు ఎమ్మెల్సీ అనంతబాబు జైలులోనే ఉండాల్సివుంటుందని అంటున్నారు. 2022 మే 19న ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్యకు గురయ్యారు. హతుడి మృతదేహాన్ని ఎమ్మెల్సీ కారులో తీసుకువచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. ఈ కేసులో అప్పట్లోనే అనంతబాబు అరెస్టు అవ్వగా, కేసు దర్యాప్తు పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది.
అయితే ఎమ్మెల్సీ అనంతబాబుతోపాటు మరికొందరికి నేరంతో సంబంధం ఉందని హతుడి కుటుంబ సభ్యులు న్యాయపోరాటం చేయడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు పునర్విచారణకు ఆదేశించడంతో ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గను సైతం నిందితుల జాబితాలో చేర్చారు. అదే సమయంలో కేసు విచారణ త్వరగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఏప్రిల్ లో రోజువారి ట్రైల్ ప్రారంభించి నవంబరు నాటికి తీర్పు వెలువరించాలని ఆదేశించింది. ఈ పరిస్థితుల్లో గత నెలలో రాజమండ్రిలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేశారు. సాక్ష్యుల విచారణకు కోర్టు నిర్ణయించడంతో ఎమ్మెల్సీ అనంతబాబు వారిని ప్రలోభాలకు గురిచేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది.
దీంతో గత నెలలో సాక్ష్యులను బెదిరించారనే ఆరోపణలపై అనంతబాబుపై మరో కేసును కాకినాడలోని సర్పవరం పోలీసులు నమోదు చేశారు. ఆ తర్వాత కోర్టు విచారణకు హాజరైన అనంతబాబును రాజమహేంద్రవరంలో అరెస్టు చేశారు. అప్పటి నుంచి రాజమహేంద్రవరం ప్రత్యేక జైలులోనే అనంతబాబు ఉన్నారు. ఈ కేసు ఇలా నడుస్తుండగా, పాత కేసులో ఆయన బెయిలు రద్దు అయింది. దీంతో ఇప్పట్లో అనంతబాబు జైలు నుంచి బయటపడే మార్గం కనిపించడం లేదని అంటున్నారు.
డ్రైవర్ హత్య కేసులో ఏ1 ఎమ్మెల్సీ అనంతబాబు బెయిల్ పై ఉంటూ సాక్ష్యులను బెదిరించినట్లు పోలీసులు ఆధారాలు సమర్పించారు. సాక్ష్యులకు డబ్బులు ఇవ్వడంతోపాటు చంపేస్తామని బెదిరించారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఆయన బయట ఉంటే హత్య కేసు విచారణకు ఆటంకం కలుగుతుందని, హత్య కేసు విచారణను ఈ ఏడాది నవంబరులోగా ముగించాలని సుప్రీంకోర్టు షరతు పెట్టిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేసు విచారణ వేగంగా పూర్తి చేయాలన్నా, సాక్ష్యులకు రక్షణ కల్పించాలన్నా అనంతబాబును జైలులో ఉంచాల్సిందేనని పోలీసులు స్పష్టం చేయడంతో వారి వాదనతో ప్రత్యేక కోర్టు న్యాయాధికారి ఏకీభవించారని న్యాయవాద వర్గాలు చెప్పాయి. దీంతో అనంతబాబు బెయిలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
