Begin typing your search above and press return to search.

ఎయిరిండియా దుర్ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. కేంద్రానికి నోటీసులు!

అహ్మదాబాద్‌ లో టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్ప కూలిపోయి 260 మంది మృతి చెందిన ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌ లైనర్ విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే.

By:  Raja Ch   |   7 Nov 2025 3:42 PM IST
ఎయిరిండియా దుర్ఘటనపై సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. కేంద్రానికి నోటీసులు!
X

అహ్మదాబాద్‌ లో టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్ప కూలిపోయి 260 మంది మృతి చెందిన ఎయిరిండియా బోయింగ్ డ్రీమ్‌ లైనర్ విమాన ప్రమాదం దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన ప్రధాన పైలట్‌ సుమీత్‌ సభర్వాల్‌ తండ్రి పుష్కరాజ్‌ సభర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.

అవును.. దేశం మొత్తాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిన అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాద ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టులో నేడు కీలక పరిణామ చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... ప్రధాన పైలట్‌ సుమీత్‌ సభర్వాల్‌ తండ్రి పుష్కరాజ్‌ సభర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ పై విచారణ జరిపింది. ఈ సందర్భంగా.. పైలట్-ఇన్-కమాండ్‌ ను ఎవరూ నిందించలేరని న్యాయస్థానం పేర్కొంది.

ఈ సందర్భంగా... జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌ మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం.. 91 ఏళ్ల తండ్రికి.. 'మీపై భారాన్ని మోయకూడదు.. విమాన ప్రమాదానికి పైలట్‌ ను నిందించకూడదు.. ఇది ఒక ప్రమాదం.. ప్రాథమిక నివేదికలో కూడా అతనిపై ఎటువంటి ఆరోపణ లేదు' అని చెప్పింది. ఈ క్రమంలో కేంద్రంతో పాటు డీజీసీఏకు నోటీసులు జారీ చేసింది.

ఎయిరిండియా ప్రమాదంలో మృతి చెందినవారిలో కెప్టెన్‌ సుమీత్‌, కో-పైలట్ క్లైవ్ కుందర్‌ లు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఈ కేసును న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ.. సుమీత్‌ తండ్రి కోర్టును ఆశ్రయించారు. ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధరించడంతోపాటు ఘటనపై స్వతంత్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఈ క్రమంలోనే పిటిషన్‌ పై స్పందన తెలియజేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంతోపాటు డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (డీజీసీఏ), ఇతర అధికారులకు నోటీసులు జారీ చేసింది. దీనిపై తదుపరి విచారణ నవంబరు 10కి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక!:

ఈ కేసులో పైలట్ తండ్రి తరపున వాదించిన సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్.. కెప్టెన్ సుమీత్ సభర్వాల్ పై వాల్ స్ట్రీట్ జర్నల్‌ లో ప్రచురితమైన వార్తా కథనాన్ని హైలైట్ చేశారు. ఈ సమయంలో ఎయిర్‌ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బోర్డ్ (ఏఏఐబీ) జూలై 12 ప్రాథమిక నివేదికను కలిగి ఉన్న వ్యాసం నుండి ఒక పేరాను సుప్రీం చదివి వినిపించింది.

ఈ సందర్భంగా... ప్రమాదానికి పైలట్‌ ను నిందించాలని ఎక్కడా చెప్పలేదని.. ఇది విమానంలోని ఇద్దరు పైలట్ల మధ్య జరిగిన సంభాషణను మాత్రమే సూచిస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. ఇదే సమయంలో వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదికపై స్పందిస్తూ... భారతదేశాన్ని నిందించడానికి మాత్రమే ఉన్న దుష్ట నివేదిక అది అని తెలిపింది!