Begin typing your search above and press return to search.

సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీం తీర్పు ఏం ఇవ్వనుంది?

సినీ నటి ప్రత్యూష అంటే ఇప్పటి తరానికి.. ముఖ్యంగా జెన్ జీలకు అస్సలు తెలీనే తెలియదు.

By:  Garuda Media   |   20 Nov 2025 11:34 AM IST
సినీ నటి ప్రత్యూష మృతి కేసు.. సుప్రీం తీర్పు ఏం ఇవ్వనుంది?
X

సినీ నటి ప్రత్యూష అంటే ఇప్పటి తరానికి.. ముఖ్యంగా జెన్ జీలకు అస్సలు తెలీనే తెలియదు. రెండు దశాబ్దాల క్రితం తెలుగు సినీ ప్రపంచంలో ఆమె ఒక సంచలనం. వెండితెర మీద ఆమె నటించిన చిత్రాలు తక్కువే అయినప్పటికీ.. వాటికే ఆమె పొందిన ప్రేక్షకాదరణ.. అంతలోనే ఆమె మరణించిన తీరు అప్పట్లో పెను సంచలనంగా మారాయి. ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్ని సైతం ప్రభావితం చేసిన ఈ కేసుకు సంబంధించిన తుది తీర్పును రిజర్వు చేసింది సుప్రీంకోర్టు. ఇంతకూ అప్పుడేం జరిగింది? సినీ నటి ప్రత్యూష ఎందుకు సూసైడ్ చేసుకుంది? ఇంతకూ ఆమెది ఆత్మహత్య? హత్య? లాంటి అంశాల్లోకి వెళితే..

ప్రత్యూష.. సిద్ధార్థ రెడ్డిలు హైదరాబాద్ లో ఇంటర్ చదువుతున్న వేళలో ప్రేమించుకున్నారు. ఇంటర్ తర్వాత ప్రత్యూష సినిమాల్లోకి వెళితే.. సిద్ధార్థరెడ్డి బీటెక్ చేసేందుకు కాలేజీలో చేరాడు. ప్రత్యూష నటించిన సినిమాలు తక్కువే అయినా.. ఆమె నటన.. అందంతో తక్కువ సమయంలోనే ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. పెద్ద హీరోయిన్ అవుతుందన్న అంచనాలు అప్పట్లో ఉండేవి. ఇదిలా ఉండగా 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం ఏడున్నర -ఎనిమిది గంటల వేళలో ప్రత్యూష.. సిద్ధార్థ రెడ్డిలు ఇద్దరు విషం తాగిన పరిస్థితుల్లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ప్రత్యూష ఫిబ్రవరి 24న మరణిస్తే.. చికిత్స అనంతరం మార్చి తొమ్మిదిన సిద్ధార్థరెడ్డి డిశ్చార్జి అయ్యాడు.

వారిద్దరూ కూల్ డ్రింక్ లో పురుగుమందు కలిపి తాగినట్లుగా గుర్తించారు. ఆర్గోనోఫాస్పేట్ కారణంగా ప్రత్యూష మరణించినట్లుగా తేలింది. అప్పట్లో ప్రత్యూష మరణంపై బోలెడన్ని వాదనలు.. సందేహాలు వినిపించాయి.రాజకీయంగా రచ్చ నడిచింది. దీంతో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల టీం ఇచ్చిన నివేదిక ప్రకారం.. ఆమెను ఊపిరాడకకుండా చేయటం.. మరణానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరగలేదని స్పష్టం చేసింది. దీని ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేసింది.

అనంతరం ఆత్మహత్యకు పురికొల్పడటం.. ఆత్మహత్యకు యత్నించటం లాంటి సెక్షన్ల కింద ఛారజిషీట్ దాఖలు చేసింది. నిందితుడికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఐదేళ్ల జైలుశిక్ష.. రూ.5వేల ఫైన్ విధిస్తూ 2004లో తీర్పును ఇచ్చింది. దీనిపై సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించగా.. జైలుశిక్షను రెండేళ్లకు తగ్గిస్తూ.. ఫైన్ 50 వేలకు పెంచుతూ తీర్పు వచ్చింది. దీనిపై ప్రత్యూష తల్లి సుప్రీంకోర్టుకు అప్పీలుకు వెళ్లారు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా ఉసిగొల్పినందుకు గరిష్ఠ శిక్ష విధించాలని కోరారు.దీనికి భిన్నంగా సిద్ధార్థరెడ్డి లాయర్లు వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా తీర్పును రిజర్వు చేసింది. త్వరలో తమ తీర్పును వెలువరించనున్నారు.