50 ఏళ్లుగా పెండింగ్ లో రూ.7 చోరీ కేసు..కోర్టు ఏం చెప్పిందంటే?
న్యాయం కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే.. కేసులు ఎంత సుదీర్ఘంగా సా...గుతూ ఉంటాయన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు.
By: Garuda Media | 19 Jan 2026 1:00 PM ISTన్యాయం కోసం న్యాయస్థానాల్ని ఆశ్రయిస్తే.. కేసులు ఎంత సుదీర్ఘంగా సా...గుతూ ఉంటాయన్న దానికి నిదర్శనంగా ఈ ఉదంతాన్ని చెప్పొచ్చు. ఇప్పుడంటే రూ.7 విలువే లేదు. కానీ.. 1977లో మాత్రం అది కాస్తంత పెద్ద మొత్తంగా చెప్పాలి. ఈ సమయంలో కేజీ బియ్యం రూ.4, పంచదార కేజీ రూ.3, గోధుమలు కేజీ రూ.2.50, కందిప్పుడు కేజీ రూ.5గా ఉండేది. పోలీసులు తమ దృష్టికి వచ్చిన చోరీ ఫిర్యాదును కేసు కట్టారు. కట్ చేస్తే.. గడిచిన యాభై ఏళ్లుగా ఈ కేసు క్లోజ్ కాని పరిస్థితి
ఈ కేసు సంబంధించిన ఫిర్యాదుదారు మాత్రమే కాదు.. నిందితుల ఆచూకీ కూడా తెలియని పరిస్థితి. వీరి కోసం పోలీసులు వెతుకున్నా.. ఫలితం లభించటం లేదు. ఇంతకూ ఈ కేసు నమోదైంది దక్షిణ ముంబయిలోని మజగావ్ కోర్టు పరిధిలో. తాజాగా పాత కేసుల పరిష్కారం మీద ఫోకస్ చేసిన న్యాయస్థానం.. ఈ కేసును టేకప్ చేసింది.
ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులకు పోలీసులు అనేకమార్లు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసినా వారి ఆచూకీ లభించలేదని.. దీంతో..దశాబ్దాలుగా ఈ కేసు అలా ఉండిపోయినట్లుగా కోర్టుకు తెలిపారు. దశాబ్దాల తరబడి ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేని నేపథ్యంలో.. దీన్ని కొనసాగించటంలో అర్థం లేదన్న న్యాయస్థానం.. రికవరీ చేసిన రూ.7.65 మొత్తాన్ని ఫిర్యాదుదారుకు అందజేయాలని సూచన చేసింది. అప్పీలు గడువు ముగిసే నాటికి ఫిర్యాదుదారు ఆచూకీ లభించకుంటే.. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాలో జమ చేయాలని పేర్కొంటూ.. కేసును క్లోజ్ చేశారు. ఇలా.. యాభై ఏళ్ల నాటి రూ.7 చోరీ కేసు ఎట్టకేలకు క్లోజ్ అయిన పరిస్థితి.
