ఫస్ట్ లంచ్ లో దక్షిణాసియా రుచులు టేస్ట్ చేసిన జోహ్రాన్ మమ్దానీ..
తొలి రోజు షెడ్యూల్‌లో భాగంగా మమ్దానీ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఫైర్‌బ్రాండ్ నాయకురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్తో లంచ్ మీట్‌లో పాల్గొన్నారు.
By: A.N.Kumar | 6 Nov 2025 7:00 PM ISTఅమెరికాలోని అతిపెద్ద నగరంలో తొలి ముస్లిం, తొలి దక్షిణాసియా అత్యంత పిన్నవయస్కుడైన (34 ఏళ్లు) మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ చరిత్ర సృష్టించారు. న్యూయార్క్ రాజకీయాలలో కొత్త అధ్యాయానికి నాంది పలికిన మమ్దానీ, తన పదవీ ప్రారంభాన్ని ఓ ప్రత్యేకమైన, సాంస్కృతిక ప్రతీకగా నిలిచే విధంగా జరుపుకున్నారు.
* ఫైర్‌బ్రాండ్ నేతతో ప్రత్యేక భేటీ
తొలి రోజు షెడ్యూల్‌లో భాగంగా మమ్దానీ డెమోక్రాటిక్ పార్టీకి చెందిన ఫైర్‌బ్రాండ్ నాయకురాలు అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్తో లంచ్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశం ఎక్కడా ఆడంబరం లేకుండా న్యూయార్క్‌లోని ప్రసిద్ధ దక్షిణాసియా ప్రాంతమైన జాక్సన్ హైట్స్లో జరిగింది. ప్రముఖ భారత-నేపాలీ రెస్టారెంట్ ‘లాలిగురాస్ బిస్ట్రో’ లో ఈ భేటి జరిగింది..
మమ్దానీ తన ‘ఎక్స్’ పోస్టులో ఈ అనుభవాన్ని పంచుకుంటూ “జాక్సన్ హైట్స్‌లోని లాలిగురాస్ బిస్ట్రోలో మా కాంగ్రెస్ మహిళా నేత అలెగ్జాండ్రియా ఒకాసియో కోర్టెజ్‌తో కలిసి భోజనం చేయడం ఎంతో ప్రత్యేకమైన అనుభవం” అని పేర్కొన్నారు.
* లంచ్ టేబుల్‌పై దక్షిణాసియా రుచులు
ఈ లంచ్ మీట్ కేవలం రాజకీయ చర్చకు మాత్రమే పరిమితం కాకుండా, మమ్దానీ తన దక్షిణాసియా మూలాలను గౌరవించుకునే విధానంగా నిలిచింది. వారి టేబుల్‌పై భారతీయ రుచులు ప్రధానంగా కనిపించాయి. మోమోలు , దమ్ ఆలూ , పనీర్ టిక్కా , చివరగా, వేడివేడి భారతీయ చాయ్ తాగారు.
భారతీయ వంటకాలతో కూడిన ఈ లంచ్, ఇద్దరు నేతల మధ్య ఉన్న స్నేహం, సమాన ఆలోచనల దృక్పథానికి నిదర్శనంగా మారింది. మేయర్ ఎన్నికల్లో ఒకాసియో కోర్టెజ్ మమ్దానీకి బహిరంగ మద్దతు తెలిపిన అరుదైన నేతల్లో ఒకరు కావడం గమనార్హం.
* నెహ్రూ ప్రసంగం, ‘ధూమ్’ బీట్స్
తొలి రోజు నుంచే అందరి దృష్టిని ఆకర్షించిన మమ్దానీ, తన నాయకత్వ శైలిలో సంప్రదాయం, ఆధునికత, వైవిధ్యానికి మేళవింపును చూపారు. తన తొలి ప్రసంగంలో భారతదేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చేసిన చారిత్రక “ట్రైస్ట్ విత్ డెస్టినీ” ప్రసంగంలోని మాటలను స్మరించుకున్నారు. న్యూయార్క్ నగరానికి ఒక కొత్త దిశను ఇవ్వాలన్న తన సంకల్పాన్ని దీని ద్వారా వ్యక్తం చేశారు.
అంతేకాకుండా ఆయన విజయోత్సవ కార్యక్రమంలో బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ధూమ్’ సినిమా బీట్స్ వినిపించడం విశేషం. ఈ వేడుక యువతరాన్ని, కొత్త ఆలోచనలను స్వాగతించే ఆయన పంథాను ప్రతిబింబించింది.
