Begin typing your search above and press return to search.

RSS చీఫ్ మోహన్ భగవత్ సభ.. వీల్లేద‌న్న న్యూయార్క్ మేయర్ లాజిక్!

న్యూయార్క్‌(అమెరికా)లోని మ‌న్‌హ్యాటన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్న సభపై న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దాని కీలక వ్యాఖ్యలు చేశారు.

By:  Sivaji Kontham   |   26 Aug 2026 2:55 PM IST
RSS చీఫ్ మోహన్ భగవత్ సభ.. వీల్లేద‌న్న న్యూయార్క్ మేయర్ లాజిక్!
X

న్యూయార్క్‌(అమెరికా)లోని మ‌న్‌హ్యాటన్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ పాల్గొననున్న సభపై న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దాని కీలక వ్యాఖ్యలు చేశారు. ''యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్'' పేరుతో శనివారం (ఆగస్టు 29న) నిర్వహించతలపెట్టిన ఈ సభకు తాను మద్దతు ఇవ్వడం లేదని వ్యాఖ్యానించారు. అయితే ఒక ప్రైవేట్ ఈవెంట్‌ను రద్దు చేసే అధికారం సిటీ మేయర్‌గా తన పరిధిలో ఉందో లేదో తనకు తెలియదని పేర్కొన్నారు. న్యూయార్క్ సిటీ మేయర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న మొదటి ముస్లిం.. ఇండో-అమెరికన్ అయిన మమ్దాని ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.

ఈ సందర్భంగా మేయర్ మమ్దాని మాట్లాడుతూ.. ''మా కుటుంబం నాకు నేర్పించిన.. నేను చూస్తూ పెరిగిన భారతదేశం ఒక భిన్న‌త్వంలో ఏక‌త్వం ఉన్న స‌మాజం. అది ప్రతీ పౌరుడికి సమాన హక్కులు కల్పించే లౌకిక గణతంత్ర రాజ్యం. అయితే విడ‌దీయ‌డం లేదా మినహాయింపు ప్రాతిపదికన నడిచే ఒక ఉద్యమం విస్తరించడం చూస్తుంటే ఒక ఇండియన్-అమెరికన్‌గా... మేయర్‌గా చాలా ఆందోళనకరంగా ఉంది'' అని వ్యాఖ్యానించారు. అమెరికాలో రంగు, మతం, వ్యక్తిగత విశ్వాసాలతో సంబంధం లేకుండా అందరికీ సమానత్వమే ప్రాతిపదిక అని ఆయన గుర్తుచేశారు.

ఈ సభను ''అమెరికన్ హిందూస్ ఫర్ ఎంగేజ్‌మెంట్ అండ్ డైలాగ్'' (AHEAD) అనే సంస్థ ఇతర హిందూ-అమెరికన్ గ్రూపుల భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది. అంతర్‌మత ఐక్యత- సాంస్కృతిక వారసత్వాన్ని పెంపొందించడమే దీని ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే ఆర్‌ఎస్‌ఎస్ చరిత్ర.. మోహన్ భగవత్ హాజరు కావడంపై అక్కడి పలు స్థానిక సంఘాలు - పౌర సమాజ ప్రతినిధులు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఆర్‌ఎస్‌ఎస్ విదేశీ పర్యటనలపై వస్తున్న విమర్శలను ఖండించింది. తాము సైనిక తరహా లేదా మైనారిటీలకు వ్యతిరేకమైన సంస్థ కాదు అని.. తమది హిందూ కేంద్రీకృత సాంస్కృతిక ఉద్యమమని స్పష్టం చేసింది. హిందువులను ఏకం చేస్తూ.. దేశాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొంటూ విదేశాలలో సంస్థపై ఉన్న ప్రతికూల భావనలను పటాపంచలు చేయడానికే ఈ పర్యటనలు ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న AHEAD మద్దతు ఇస్తున్న దాదాపు 135 కి పైగా హిందూ-అమెరికన్ సంస్థలు ఈ ఆరోపణలను తోసిపుచ్చాయి. ''యూనివర్సల్ వన్‌నెస్ సెలబ్రేషన్'' (సార్వభౌమ ఐక్యతా ఉత్సవం) పేరుతో రాఖీ పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ఈ సభ `వసుధైవ కుటుంబకం` (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సనాతన ధర్మ సందేశాన్ని ఇస్తుందని వారు స్పష్టం చేశారు. సమాజంలో సోదరభావాన్ని.. పరస్పర గౌరవాన్ని పెంపొందించడమే తమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు సమర్థించుకున్నారు.

ఏది ఏమైనా విదేశీ గడ్డపై కూడా భారతీయ సంస్థలు.. నాయకుల పర్యటనలు.. భావజాలాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవ్వడం.. అక్కడ నివసించే భారతీయ సంతతి వారి మధ్య భావజాల విభజనను స్పష్టంగా అర్థ‌మ‌య్యేలా చెబుతోంది.