Begin typing your search above and press return to search.

మోడీ అంటే పడదు.. దీపావళి చేసుకొని మరీ విషంకక్కాడు

దీపావళి పండుగ సందర్భంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించి మరోసారి వార్తల్లో నిలిచారు న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ.

By:  A.N.Kumar   |   22 Oct 2025 4:15 PM IST
మోడీ అంటే పడదు.. దీపావళి చేసుకొని మరీ విషంకక్కాడు
X

దీపావళి పండుగ సందర్భంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై తీవ్ర విమర్శలు గుప్పించి మరోసారి వార్తల్లో నిలిచారు న్యూయార్క్ మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీ. అమెరికా న్యూయార్క్ నగరంలోని క్వీన్స్ ప్రాంతంలో హిందూ దేవాలయాలను సందర్శించిన అనంతరం, అక్కడి భారతీయ సమాజంతో మాట్లాడిన మమ్దానీ, భారతదేశంలో బహుత్వవాదం సంకుచితమవుతోందని వ్యాఖ్యానించారు.

“భారతదేశం అందరికీ చెందాల్సిన దేశం. కానీ ఇప్పుడు కొంతమందికే చోటు ఉన్నట్లు మారింది. అదే దార్శనికతతో ప్రధాని మోడీ దేశాన్ని నడిపిస్తున్నారు” అని ఆయన అన్నారు. తాను బహుళత్వాన్ని, సహజీవనాన్ని జరుపుకునే భారతదేశంలో పెరిగిన వ్యక్తినని మమ్దానీ పేర్కొన్నారు. “భారతీయ సాంప్రదాయం, సంస్కృతి నాకు బాగా తెలుసు. అందుకే మోడీ విధానాలపై విమర్శలు చేయడం నా బాధ్యతగా భావిస్తున్నాను,” అని తెలిపారు.

మమ్దానీ ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ తరఫున న్యూయార్క్ మేయర్ ప్రైమరీలో విజయం సాధించి ప్రధాన అభ్యర్థిగా నిలిచారు. న్యూయార్క్ చరిత్రలో ముస్లిం వ్యక్తి మేయర్ అభ్యర్థిగా నిలవడం ఇదే మొదటిసారి. తాను అందరినీ సమానంగా చూడాలనుకుంటున్నానని, మతం లేదా వర్ణం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయనని ఆయన స్పష్టం చేశారు.

ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా మమ్దానీ మోడీ, బీజేపీపై విమర్శలు చేశారు. ఒకసారి మోడీని “యుద్ధ నేరస్థుడు”గా సంబోధించడంతో పెద్ద వివాదం రేగింది. అంతేకాకుండా మోడీని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో పోలుస్తూ, ఇద్దరూ “యుద్ధ నేరాలకు బాధ్యులు” అని ఆరోపించారు.

ఇటీవల 2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన పాత వీడియోను పంచుకున్న మమ్దానీ, “ఆ అల్లర్లలో ముస్లింలు నిర్మూలింపబడ్డారు. భారతదేశంలో ముస్లింల ఉనికి మసకబారిపోతోంది. దీని వెనుక పాలకులే కారణం,” అని తీవ్రంగా వ్యాఖ్యానించారు.

భారతీయ వర్గాల్లో మమ్దానీ వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. కొందరు ఆయన వ్యాఖ్యలను “అతి రాజకీయీకరణ”గా అభివర్ణిస్తే, మరికొందరు “వాస్తవం చెప్పాడని” సమర్థిస్తున్నారు.

దీపావళి పండుగ ఆధ్యాత్మిక ఆనందం మధ్య మమ్దానీ వ్యాఖ్యలు మరోసారి భారత్-అమెరికా రాజకీయ వేదికల్లో చర్చనీయాంశంగా మారాయి.