Begin typing your search above and press return to search.

హెచ్ఐవీ వ్యాక్సిన్ కోసం ఎగబడ్డ యువత.. ‘లెనాకాపవిర్' సంచలనం

'లెనాకాపవిర్' అనే ఈ వినూత్న హెచ్ఐవీ నిరోధక ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చిన తొలి దేశాల్లో ఒకటిగా నిలిచి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

By:  A.N.Kumar   |   23 Feb 2026 10:00 PM IST
హెచ్ఐవీ వ్యాక్సిన్ కోసం ఎగబడ్డ యువత.. ‘లెనాకాపవిర్ సంచలనం
X

ఎయిడ్స్ మహమ్మారిపై సాగుతున్న సుదీర్ఘ పోరాటంలో మరో చారిత్రాత్మక మైలురాయి నమోదైంది. రోజూ మాత్రలు మింగే అవసరం లేకుండా కేవలం ఏడాదికి రెండు సార్లు తీసుకునే ఇంజెక్షన్‌తో హెచ్ఐవీని అడ్డుకునే సరికొత్త విధానానికి ఆఫ్రికా దేశం జింబాబ్వే శ్రీకారం చుట్టింది. 'లెనాకాపవిర్' అనే ఈ వినూత్న హెచ్ఐవీ నిరోధక ఔషధాన్ని అందుబాటులోకి తెచ్చిన తొలి దేశాల్లో ఒకటిగా నిలిచి, ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

- యువతలో ఉత్సాహం.. క్యూ కట్టిన జనం

ఫిబ్రవరి 19న జింబాబ్వే రాజధాని హరారే సమీపంలోని ఎప్వర్త్ ప్రాంతంలో ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్యంగా యువత ఈ ఇంజెక్షన్ తీసుకోవడానికి భారీగా తరలిరావడం గమనార్హం. సామాజిక అపోహలు, రోజూ మందులు వాడటంలో ఉండే ఇబ్బందుల వల్ల హెచ్ఐవీ బారిన పడుతున్న యువతకు ఈ 'ఆరు నెలలకో ఇంజెక్షన్' పద్ధతి ఒక వరంగా మారింది.

ఏమిటీ లెనాకాపవిర్? దీని ప్రత్యేకతలేంటి?

ఇప్పటివరకు హెచ్ఐవీ రాకుండా ఉండాలంటే పీఆర్ఈపీ (ప్రీ ఎక్స్ పోసూర్ ప్రోఫైలెక్సిస్ ) పద్ధతిలో రోజూ మాత్రలు వాడాల్సి వచ్చేది. కానీ లెనాకాపవిర్ దీనిని పూర్తిగా మార్చేసింది. ఒకసారి ఇంజెక్షన్ తీసుకుంటే ఆరు నెలల వరకు వైరస్ సోకకుండా రక్షణ కల్పిస్తుంది. క్లినికల్ ట్రయల్స్ ప్రకారం.. ఇది హెచ్ఐవీ నివారణలో దాదాపు 100% ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. ముఖ్యంగా సబ్-సహారా ఆఫ్రికాలో హెచ్ఐవీ ముప్పు ఎక్కువగా ఉన్న యువతులు, గర్భిణీలు, లైంగిక కార్మికులకు ఇది గొప్ప రక్షణ కవచం.

- మొదటి దశలో 46 వేల మందికి..

అమెరికా ప్రభుత్వం, గ్లోబల్ ఫండ్ సహకారంతో జింబాబ్వే ప్రభుత్వం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా 24 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి దశలో 46,000 మందికి ఈ డోసులను పంపిణీ చేస్తున్నారు. అధిక ముప్పు ఉన్న ప్రాంతాల్లోని యువతను, మహిళలను ప్రాధాన్యత క్రమంలో ఎంపిక చేశారు. "ప్రతిరోజూ మాత్రలు వేసుకోవడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు. కానీ జీవిత కాలంలో కేవలం రెండు సార్లు క్లినిక్‌కు వచ్చి ఇంజెక్షన్ తీసుకోవడం చాలా సులభం. ఇది ఎయిడ్స్ రహిత సమాజానికి పునాది." అని జింబాబ్వే ఆరోగ్య శాఖ మంత్రి డగ్లస్ మొంబేశోరా తెలిపారు.

ఇది వ్యాక్సిన్ కాదు.. నివారణ మాత్రమే!

ఈ వార్త వినగానే చాలామంది ఇది హెచ్ఐవీని నయం చేసే 'వ్యాక్సిన్' అని భావిస్తున్నారు. అయితే అధికారులు కొన్ని కీలక విషయాలను స్పష్టం చేశారు. ఇది వ్యాక్సిన్ కాదు.. ఇది హెచ్ఐవీ సోకకుండా అడ్డుకునే ముందస్తు జాగ్రత్త మాత్రమే. హెచ్ఐవీ లేని వారు, వైరస్ సోకకుండా ఉండేందుకు మాత్రమే దీనిని వాడాలి. ఇప్పటికే హెచ్ఐవీ సోకిన వారు దీనిని వాడకూడదు. వారు తమ రెగ్యులర్ ఏఆర్.టీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ)ని కొనసాగించాల్సిందే.

2030 లక్ష్యం దిశగా..

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 4.4 కోట్ల మందిని బలితీసుకున్న ఈ మహమ్మారిని 2030 నాటికి పూర్తిగా అంతం చేయాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. జింబాబ్వే ఇప్పటికే 95-95-95 అంటే 95% మందికి స్థితి తెలియడం, 95% మంది చికిత్స పొందడం, 95% మందిలో వైరస్ అదుపులో ఉండటం లక్ష్యాన్ని చేరువలో ఉంది. లెనాకాపవిర్ విజయవంతమైతే హెచ్ఐవీ చరిత్రలో ఇది అతిపెద్ద మలుపు కానుంది.