జెప్టోను అలారంలా వాడేశాడు.. ఇదీ వాడకమంటే!
మొదట రీల్ స్టోరీ చెప్పి.. రియల్ స్టోరీకి వచ్చేస్తాం. కొన్నాళ్ల క్రితం ఒక మూవీ వచ్చింది.
By: Garuda Media | 12 Feb 2026 9:59 AM ISTమొదట రీల్ స్టోరీ చెప్పి.. రియల్ స్టోరీకి వచ్చేస్తాం. కొన్నాళ్ల క్రితం ఒక మూవీ వచ్చింది. అందులో తన ఫ్యామిలీని విలన్లు టార్గెట్ చేసిన వేళ.. తనకుటుంబాన్ని కాపాడుకోవటం కోసం స్విగ్గీ.. జొమాటో.. ఓలా.. ఉబర్ డెలివరీ ఏజెంట్లను ఇంటికి పెద్ద ఎత్తున పంపి.. విలన్ ప్లాన్ కు చెక్ పెట్టేస్తాడు.
ఇప్పుడు చెప్పేది రియల్ స్టోరీ. తన చెల్లి ఎక్కాల్సిన విమానం మిస్ కాకుండా ఉండేందుకు ఒక అన్న తన తెలివిని వాడేసి.. జెప్టోను అలారంలా వాడేసిన వైనం ఆసక్తికరంగా మారింది. తన స్వీయ అనుభవాన్ని సదరు అన్న లింక్డిన్ లో పోస్టు చేయటంతో అది కాస్తా వైరల్ గా మారటమే కాదు..జెప్టో సైతం స్పందించింది. రీల్ మాదిరి రియల్ సీన్ ఉండటం ఈ మొత్తం ఉదంతంలో విశేషం.
ముంబయికి చెందిన రిషబ్ అగర్వాల్ పరేల్ లో ఉంటాడు. అతడి సోదరి పోవాయ్ లో ఉంటుంది. ఉదయం ఆరు గంటలకు ఆమె ఫ్లైట్. దీంతో తెల్లవారుజామున తనను నిద్ర లేపాలని తల్లికి చెప్పింది. అయితే.. తల్లి తెల్లవారుజామున మూడు గంటలకు ఎంత ఫోన్ చేసినా.. ఆమె నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో కొడుకును నిద్ర లేపి కంగారుగా విషయాన్ని చెప్పింది. తాను ఉన్న ప్లేస్ నుంచి చెల్లి ఉండే ఇంటి ప్రాంతానికి వెళ్లటానికి కనీసం 40 నిమిషాలు పట్టే పరిస్థితి. దీంతో.. రిషన్ తన మెదడుకు పని చెప్పాడు. ఫ్లాష్ లా తట్టిన ఐడియాతో తన చెల్లి ఉన్న ఇంటికి జెప్టో ఆర్డర్ పెట్టేశాడు. తెల్లవారుజామున 3.20 గంటలకు సామాన్లు ఆర్డర్ పెడితే 3.30 గంటలకు ఇంటి వద్ద ఉన్నాడు.
సదరు డెలివరీ బాయ్ కు విషయాన్ని చెప్పి.. తనకు సాయం చేయాలని కోరాడు. అందుకు తగ్గట్లే స్పందించిన సదరు డెలివరీ బాయ్ ఇంటికి వెళ్లి బెల్ కొట్టాడు. చెప్పినట్లే డెలివరీ చేశాడు. అంతేకాదు ఆమె క్షేమ సమాచారాన్ని తెలియజేయటంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. అనుకున్నట్లే ఫ్లైట్ మిస్ కాకుండా ఎయిర్ పోర్టుకు వెళ్లగలిగింది. తన అనుభవాన్నిపంచుకోవటంతో అది కాస్తా వైరల్ గా మారింది. దీనికి జెప్టోె చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ స్పందిస్తూ.. తాము అలారమ్ క్లాక్ లు డెలివరీ చేస్తామని ఇంతకాలం అనుకున్నామని.. తమను అలారమ్ క్లాక్లా కూడా పని చేస్తామని తనకు ఇప్పుడే తెలిసినట్లుగా చమత్కరించాడు. ఏమైనా.. రిషబ్ అగర్వాల్ తెలివిని మెచ్చుకోవాల్సిందే.
