Begin typing your search above and press return to search.

ట్రంప్ పరువు తీసేస్తున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు.. ఇది లేటెస్ట్!

తాను ఏది అనుకుంటే అది జరగాలి.. ఇప్పటికే జరిగింది.. ఇంకా జరుగుతుంది అంటూ తనదైన ఆలోచనతో ముందుకుపోతూ..

By:  Raja Ch   |   9 Aug 2025 5:16 PM IST
ట్రంప్ పరువు తీసేస్తున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు.. ఇది లేటెస్ట్!
X

తాను ఏది అనుకుంటే అది జరగాలి.. ఇప్పటికే జరిగింది.. ఇంకా జరుగుతుంది అంటూ తనదైన ఆలోచనతో ముందుకుపోతూ.. ఉగ్రవాద సానుభూతి దేశాలను ప్రేమిస్తూ.. పలు శాంతికాముక దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు.. అవకాశం వచ్చినప్పుడల్లా, తనను ఓ ఆటాడించాలని భావించినప్పుడల్లా షాకులు ఇస్తూనే ఉన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఈ క్రమంలో తాజాగా మరొకటి ఇచ్చారు.

అవును... ఇరాన్ - ఇజ్రాయెల్, భారత్ - పాకిస్థాన్, థాయిలాండ్ - కంబోడియా, అర్మేనియా - అజర్‌ బైజాన్ మొదలైన దేశాల మధ్య యుద్ధాలు ఆపానని, శాంతి ఒప్పందాలు చేయించానని చెబుతున్న ట్రంప్.. సుమారు మూడున్నరేళ్లకు పైగా కొనసాగుతోన్న రష్యా – ఉక్రెయిన్ యుద్ధాన్ని మాత్రం ఆపలేకపొతున్నారు. పైగా ఈ విషయం ఎన్నికల్లో హామీ కూడా ఇచ్చారు. అయినప్పటికీ ఆ ఇరుదేశాల ప్రెసిడెంట్లు ట్రంప్ కు లొంగడం లేదు.

ఈ క్రమంలో తాజాగా మరోసారి మరో ప్రయత్నానికి ట్రంప్ ప్రయత్నించగా... ఆ ప్రయత్నానికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో కనిపించీ కనిపించగానే జెలెన్ స్కీ నుంచి సమాధానం వచ్చేసింది. ఈ సమయంలో.. ట్రంప్ రష్యా నుంచి నరుక్కొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఆ కథాకమీషేమిటో ఇప్పుడు చూద్దామ్..!

ఈ నెల 15న అలస్కా వేదికగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తో భేటీ కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తన ట్రూత్‌ సోషల్ లో వెల్లడించారు. ఈ క్రమంలో... రష్యా, ఉక్రెయిన్‌ ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. శాంతి ఒప్పందం కోసం కొన్ని భూభాగాలు వెనక్కి తీసుకోవడం, మార్చుకోవడం జరుగుతుందని.. ఈ మార్పిడి ఇరుపక్షాలకు మేలు జరిగే విధంగానే ఉంటుందని తెలిపారు.

దీంతో వెంటనే జెలెన్ స్కీ స్పందించారు. ఇందులో భాగంగా.. ఉక్రెయిన్‌ ప్రాదేశిక సమగ్రతను దెబ్బతీసే చర్చలను ఆమోదించబోమని.. శాంతి కోసం నిర్వహించే సమావేశాల్లో మా గళాన్ని వినిపించాల్సిందేనని మొదలుపెట్టి... ఆక్రమణదారులకు ఉదారంగా మా భూభాగాన్ని వదులుకోలేమని.. ఉక్రెయిన్‌ లేకుండా జరిపే చర్చల్లో ఏ పరిష్కారాలు నిర్ణయించినా అవన్నీ శాంతికి వ్యతిరేకమే అని అన్నారు.

అలాంటి వాటితో ఏ సమస్యా పరిష్కారం కాదని.. నిర్జీవ పరిష్కారాలు ఏమాత్రం పనిచేయవని జెలెన్‌ స్కీ మండిపడ్డారు. ట్రంప్ – పుతిన్ భేటీ మరో వారం రోజుల్లోపు ఉందనగా ఆయన ఈ స్థాయిలో స్పందించడం గమనార్హం. దీంతో.. ట్రంప్ కు జెలెన్ స్కీ ఏ విషయంలోనూ లొంగడం లేదు సరికదా.. సరికొత్త షాకులు ఇస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇది లేటెస్ట్.