Begin typing your search above and press return to search.

క్రిస్మస్ ప్రసంగంలో పుతిన్ చావు కోరిక.. జెలెన్ స్కీ ప్రసంగం వైరల్!

తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో సందేసంలో జెలెన్ స్కీ... రష్యా ఎన్ని బాధలు తెచ్చిపెట్టినప్పటికీ అది అత్యంత ముఖ్యమైన వాటిని ఆక్రమించలేదని.. బాబు దాడి చేయలేదని అన్నారు.

By:  Raja Ch   |   26 Dec 2025 12:15 AM IST
క్రిస్మస్  ప్రసంగంలో పుతిన్  చావు కోరిక.. జెలెన్  స్కీ ప్రసంగం వైరల్!
X

ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు క్రిస్మస్ వేడుకలను అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాల నడుమ, అత్యంత పరిశుద్ధంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆర్థికంగా అణగారిన దేశాల నుంచి అగ్రరాజ్యం వరకు భక్తి గీతాలు, ప్రత్యేక ప్రార్థనలు, శాంతాక్లాజ్ వేషదారణలు, క్రిస్మస్ ట్రీలు, స్టార్ లు, అలంకరణలు, విందులతో సందడి నెలకొంది. ఈ సమయంలో జెలెన్ స్కీ ఓ ఆశ్చర్యకరమైన విషయాన్ని వెల్లడించారు.

అవును... రష్యాతో జరుగుతున్న యుద్ధంలో అవిరామంగా పోరాడుతున్న ఉక్రెయిన్ పై క్రిస్మస్ ముందు రోజు కూడా దాడులు జరిగాయి. ఇందులో భాగంగా... రష్యా ఉక్రెయిన్ క్షిపణులు, డ్రోన్ లతో దాడి చేయడంతో.. కనీసం ముగ్గురు వ్యక్తులు చనిపోయారని, విద్యుత్ అంతరాయం కలిగించారని అంటున్నారు. ఈ సందర్భంగా.. తన క్రిస్మస్ ప్రసంగంలో స్పందించిన జెలెన్ స్కీ తన క్రిస్మస్ కోరికను వెల్లడించారు.

"అతను నశించాలి"!:

తాజాగా ఎక్స్ లో పోస్ట్ చేసిన వీడియో సందేసంలో జెలెన్ స్కీ... రష్యా ఎన్ని బాధలు తెచ్చిపెట్టినప్పటికీ అది అత్యంత ముఖ్యమైన వాటిని ఆక్రమించలేదని.. బాబు దాడి చేయలేదని అన్నారు. అదే తమ ఉక్రేనియన్ హృదయమని.. ఒకరిపై ఒకరికి ఉన్న విశ్వాసం, మన ఐక్యత అని పేర్కొన్నారు. ఇదే సమయంలో.. పుతిన్ పేరు చెప్పకుండానే.. ఈ రోజు మనమంతా ఒకే కలను పంచుకుంటున్నాము.. మన అందరికీ ఒకే కోరిక ఉంది.. "అతను నశించాలి" అని తాము చెప్పుకుంటున్నామని అన్నారు.

ఇదే సమయంలో... మనం దేవుని వైపు తిరిగినప్పుడు, మనం అంతకంటే గొప్పదే కోరుకుంటాము.. ఉక్రెయిన్ కు శాంతిని ప్రసాదించమని అడుగుతాము.. దాని కోసం మనం పోరాడుతాము.. దాని కోసం ప్రార్థిస్తాము.. దానికి మనం అర్హులము అని అన్నారు. అయితే క్రిస్మస్ సందర్భంగా రష్యన్లు మరోసారి తాము నిజంగా ఎవరో చూపించారని.. భారీ షెల్లింగ్, వందలాది షాజెద్ లు, బాలిస్టిక్ క్షిపణులు.. ప్రతీదీ ప్రయోగించబడిందని తెలిపారు.

మాస్కో కూడా వెనక్కి తగ్గితేనే...!:

ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్పందించిన జెలెన్ స్కీ.. 20 అంశాల ప్రణాళిక వివరాలను కూడా పంచుకున్నారు. యుద్ధాన్ని ముగించే ప్రణాళికలో భాగంగా కైవ్ తన దళాలను దేశ తూర్పు పారిశ్రామిక కేంద్ర ప్రాంతం నుంచి ఉపసంహరించుకుంటుందని.. అయితే, మాస్కో కూడా వెనక్కి తగ్గితేనే ఇది సాధ్యమవుతుందని.. ఆ ప్రాంతం అంతర్జాతీయ దళాల పర్యవేక్షణలో సైనిక రహిత జోన్ గా మారుతుందని అన్నారు.

కాగా... తాను స్వాధీనం చేసుకున్న భూమి నుంచి ఎలాంటి ఉపసంహరణకు సిద్ధంగా ఉన్నట్లు రష్యా ఇంకా సూచించలేదు. ఇప్పటివరకూ రష్యా లుహాన్స్క్ లో ఎక్కువ భాగాన్ని, డొనెట్స్క్ లో 70% ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంది. అయితే.. జెలెన్ స్కీ వదులుకోవాలని పుతిన్ పట్టుబడుతున్న ప్రాంతం ఇదే కాగా.. ఈ అల్టిమేటంను ఉక్రెయిన్ తిరస్కరించింది.