Begin typing your search above and press return to search.

52 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్... ఈ స్టైలిష్ షూటర్ మామూలోడు కాదు!

అవును... సాధారణంగా షూటింగ్‌ లో పాల్గొనే అథ్లెట్లు తమ చెవులకు ఇయర్ ప్రొటెక్టర్లు, లక్ష్యాన్ని గురిచూసేందుకు సాయపడే లెన్సులు, బ్లైండర్ల వంటివి ధరిస్తారు.

By:  Raja Ch   |   5 Oct 2025 6:10 PM IST
52 ఏళ్ల వయసులో గోల్డ్ మెడల్... ఈ స్టైలిష్ షూటర్ మామూలోడు కాదు!
X

పారిస్‌ లో గత ఏడాది తుర్కిష్ షూటర్ యూసుఫ్ డికెక్ స్టైల్‌ నెట్టింట సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. మను, సరబ్‌ జోత్‌ లు కాంస్య పతకం గెలుచుకున్న అదే మ్యాచ్‌ లో తన షూటింగ్ పార్టనర్ సెవ్వల్ ఇల్యాదా తర్హాన్‌ తో కలిసి యూసుఫ్ డికెక్.. ఒక చేతిని జేబులో పెట్టుకుని షూటింగ్ చేసి రజత పతకం సాధించారు. ఈ క్రమంలో తాజాగా మరో రికార్డ్ సృష్టించాడు డికెక్.

అవును... సాధారణంగా షూటింగ్‌ లో పాల్గొనే అథ్లెట్లు తమ చెవులకు ఇయర్ ప్రొటెక్టర్లు, లక్ష్యాన్ని గురిచూసేందుకు సాయపడే లెన్సులు, బ్లైండర్ల వంటివి ధరిస్తారు. ఇందులో భాగంగా... కంటిపై పడే వెలుతురుని తగ్గించేందుకు ఒక కన్నుపై వైజర్, స్పష్టమైన దృష్టి కోసం మరో కంటిపై బ్లైండర్ ధరిస్తారు. పైగా... వీటిని షూటింగ్‌ కు తప్పనిసరైన అవసరాలుగా పరిగణిస్తారు.

అయితే... యూసుఫ్ డికెక్ మాత్రం ఇవేవీ ధరించడు. ఇవేవీ లేకుండానే షూటింగ్ రేంజ్‌ కు వెళ్లి, లక్ష్యాన్ని ఛేదించి రజతం సాధించాడు. ఈ క్రమంలో తాజాగా తుర్కియే లో జరుగుతున్న యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్‌ - 2025లో ఐకానిక్ షూటర్ యూసుఫ్ డికెక్ తుర్కియేకు స్వర్ణం అందించాడు. దీంతో... ఇతడి పెర్ఫార్మెన్స్ మరోసారి సంచలనంగా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... ఇస్తాంబుల్‌ లో జరిగిన యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్ ఆఫ్ ఎయిర్ వెపన్స్‌ లో తుర్కియే జాతీయ షూటింగ్ జట్టు మూడు బంగారు పతకాలను గెలుచుకుంది. ఈ సమయంలో తన విలక్షణమైన శైలితో పారిస్ - 2024 ఒలింపిక్స్‌ లో ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయిన షూటర్ యూసుఫ్ డికెక్.. మరోసారి స్వదేశంలోని విజయాలలో ముందంజలో ఉన్నాడు.

ఇందులో భాగంగా... పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్‌ లో ముస్తఫా ఇనాన్‌ తో కలిసి డికెక్.. జర్మనీకి చెందిన క్రిస్టియన్ రీట్జ్, పాల్ ఫ్రోహ్లిచ్‌ లను 2-0 తేడాతో ఓడించి, తుర్కియేకు స్వర్ణం సాధించిపెట్టాడు. దీంతో మరోసారి ఇతడి పెర్ఫార్మెన్స్ సంచలనంగా మారుతోంది.

ఈ సందర్భంగా స్పందించిన డికెక్.. విజయం, సొంత గడ్డపై పోటీ పడే అవకాశం రెండింటి పట్ల గర్వం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా... యూరోపియన్ ఛాంపియన్స్ లీగ్ అనేది అత్యుత్తమ అథ్లెట్ల కోసం కేటాయించబడిన ప్రత్యేక వేదిక అని అన్నారు. ఇదే సమయంలో.. ఇస్తాంబుల్‌ లో తొలిసారిగా జరుగుతున్న ఈ టోర్నమెంట్‌ తో తన దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవం అని తెలిపారు.

మరోవైపు తుర్కియే విజయం మహిళల ఈవెంట్లకు కూడా విస్తరించింది. ఇందులో భాగంగా... 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ విభాగంలో డామ్లా కోస్, ఎలిఫ్ బెర్ఫిన్ ఆల్టున్ నార్వేను ఓడించి స్వర్ణం సాధించారు. ఇదే సమయంలో... 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఫైనల్‌ లో ఫ్రాన్స్‌ ను ఓడించి ఎస్రా బోజబలి, సెవ్వాల్ ఇలైడా తర్హాన్ కూడా స్వర్ణం సాధించారు! ఈ విజయాలతో తుర్కియే మూడు స్వర్ణ పతకాలను సాధించినట్లయ్యింది.