స్వామీ ఈ మౌనమేమీ ?
వైసీపీలో ఆయన గురించి ఒక్కటే చర్చ. ఆయన ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉండి పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుని వెళ్ళేవారు. వైసీపీ పునాది లాంటి నాయకుడు.
By: Satya P | 13 Jun 2026 9:52 AM ISTవైసీపీలో ఆయన గురించి ఒక్కటే చర్చ. ఆయన ఫుల్ యాక్టివ్ మోడ్ లో ఉండి పార్టీని దూకుడుగా ముందుకు తీసుకుని వెళ్ళేవారు. వైసీపీ పునాది లాంటి నాయకుడు. ఆయనే విజయనగరం జిల్లా మాజీ ఎమ్మెల్యే మాజీ ఉప సభాపతి కోలగట్ల వీరభద్రస్వామి. ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ రెండు సార్లు కోట మీదనే జెండా ఎగరేశారు. ఆయన 2004లో తొలిసారి అప్పటి మంత్రిగా ఉన్న పూసపాటి అశోక్ గజపతిరాజుని ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడించారు. తిరిగి 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి అశోక్ కుమార్తె అదితి గజపతి రాజుని ఓడించారు. ఇక వైసీపీని జగన్ స్థాపించినపుడు విజయనగరం జిల్లాలో మొదట చేరిన నాయకుడు ఆయన. అందుకు గానూ జగన్ ఆయనను ఎమ్మెల్సీగా చేశారు. జిల్లా అధ్యక్ష పదవి కూడా కట్టబెట్టారు.
మంత్రి కావాలనుకుని :
ఇక వైసీపీ 2019లో అధికారంలోకి వచ్చాక తొలి విడతలో బొత్స సత్యనారాయణ మంత్రి అయ్యారు. మలి విడతలో అయినా తనకు చాన్స్ వస్తుందని ఆశించినా బొత్సనే కంటిన్యూ చేశారు. దాంతో పాటు సామాజిక సమీకరణల నేపథ్యం కూడా కలసి రాలేదని అన్నారు. ఇక ఉప సభాపతి పదవితోనే ఆయనకు సరిపుచ్చారు. ఈ అసంతృప్తి అలా ఉండగానే 2024 ఎన్నికల్లో తన కుమార్తెకి పోటీ కోసం టికెట్ అడిగితే అధినాయకత్వం ఇవ్వలేదు. దాంతో అన్యమనస్కంగా కోలగట్ల పోటీ చేశారు. ఇక ఓటమి తరువాత నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
పిలిస్తేనే తప్ప పలకరు :
ఒకనాడు విజయనగరం నియోజకవర్గంలో అన్నీ తానై పార్టీని నడిపిన కోలగట్ల ఇపుడు మాత్రం ఎందుకో మౌన ముద్ర దాల్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. పిలిస్తేనే కార్యక్రమాలకు హాజరవుతున్న ఆయన ఆ తరువాత మాత్రం ఇంటికే పరిమితం అవుతున్నారని గుర్తు చేస్తున్నారు. అయితే కోలగట్ల మౌనం వెనక వ్యూహం ఉందని అంటున్నారు. అందుకే ఆయన అలా వ్యవహరిస్తున్నారు అని చెబుతున్నారు.
మేయర్ కోసమే పట్టు :
కోలగట్ల తన రాజకీయ వారసురాలిగా కుమార్తె కోలగట్ల శ్రావణిని ముందుకు తీసుకుని రావాలని చూస్తున్నారు. ఆమె గత కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ కావాలని కోలగట్ల ప్రయత్నించినా మేయర్ సీటు బీసీలకు రిజర్వ్ చేయడంతో కుదరలేదు, దాంతో డిప్యూటీ మేయర్ గానే ఉండాల్సి వచ్చింది. ఈసారి అలా కుదరదని తన కుమార్తె మేయర్ కావాల్సిందే అని కోలగట్ల పట్టు బడుతున్నారని అంటున్నారు. ఈ విషయంలో తగ్గేది లేదని ఆయన అంటున్నట్లుగా చెబుతున్నారు. ఈ ఏడాది చివరిలో కార్పోరేషన్ కి ఎన్నికలు ఉండడంతో మేయర్ పదవిని తన కూతుకుకి ఇప్పించుకునేందుకు కోలగట్ల స్కెచ్ గీస్తున్నారు అని అంటున్నారు.
వచ్చే ఎన్నికల వ్యూహం :
ఇక మేయర్ గా కనుక తన కుమర్తె ఉంటే 2029 ఎన్నికల్లో విజయనగరం ఎమ్మెల్యే టికెట్ కూడా ఆమెకు సాధించవచ్చు అన్నది కోలగట్ల ఆలోచనగా చెబుతున్నారు. తాను రాజకీయంగా తప్పుకుని కుమార్తెని వారసురాలిగా చేయాలన్నదే కోలగట్ల వ్యూహంగా చెబుతున్నారు. అయితే విజయనగరం కార్పోరేషన్ మేయర్ పదవికి చాలా మంది వైసీపీ ఆశావహులు ఉన్నారని చెబుతున్నారు. దాంతో ముందు కోలగట్ల జనంలో ఉంటూ పనిచేస్తే ఆ మీదట అధినాయకత్వం పరిశీలించవచ్చు అన్నది కూడా ఆయనకు చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది. అయితే కోలగట్ల మాత్రం గట్టు దాటడం లేదు బెట్టు వీడడం లేదని తెలుస్తోంది. మరి స్వామి మౌనాన్ని అర్ధం చేసుకుని అధినాయకత్వం తగిన న్యాయం చేస్తుందా లేదా అనందే పార్టీ వర్గాలలో చర్చగా ఉందట.
